మేకను చంపినందుకు గొడవ.. నేరస్తులకు ఉరిశిక్ష విధించిన కోర్టు

ABN , First Publish Date - 2021-12-08T12:08:51+05:30 IST

మనిషి విచక్షణ కోల్పోయినప్పుడు కోపంతో ఎంతటి ఘోరానికైనా ఒడిగడతాడు. అప్పుడు జరిగే హింసలో ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఒక సంఘటన జరిగింది...

మేకను చంపినందుకు గొడవ.. నేరస్తులకు ఉరిశిక్ష విధించిన కోర్టు

మనిషి విచక్షణ కోల్పోయినప్పుడు కోపంతో ఎంతటి ఘోరానికైనా ఒడిగడతాడు. అప్పుడు జరిగే హింసలో ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఒక సంఘటన జరిగింది. కేవలం ఒక మేకను చంపేశారనే గొడవలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మేక యజమాని కోపంతో తన బలగం తీసుకు వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది.


వివరాలలోకి వెళితే.. మార్చి 2007 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లా పరిధి భికారిపూర్ గ్రామంలో అక్లు చౌహాన్ అనే వ్యక్తికి చెందిన మేక రామ్ సనేహి అనే రైతు పొలంలోని పంటను నాశనం చేసింది. తన పంటను నాశనం చేసిన మేకను రామ్ సనేహి కొట్టడంతో ఆ మేక చనిపోయింది. ఈ విషయం తెలిసిన అక్లు చౌహాన్ తన మేకను చంపినందుకు రామ్ సనేహితో గొడవపడ్డాడు. 

గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తరువాత అక్లు చౌహాన్ వెళ్లి తన మిత్రులైన జైచంద్, రామ్ సారన్‌లను వెంట తీసుకువచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి రామ్ సనేహిని కత్తులతో పొడిచి చంపేశారు. రామ్ సనేహిని కాపాడడానికి వచ్చిన పబ్బర్ అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు. 

ఈ కేసు 12 ఏళ్ల నుంచి విచారణలో ఉంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఏడుగురు.. కోర్టులో సాక్ష్యం చెప్పారు. జిల్లా సెషన్స్ కోర్టు నిందితులకు  ఉరిశిక్ష విధించింది.

Updated Date - 2021-12-08T12:08:51+05:30 IST