దేవుడా... భక్తులేరీ!?

ABN , First Publish Date - 2020-08-08T08:41:29+05:30 IST

ఏడుకొండల వాడి సన్నిధి అంటేనే... నిత్యకల్యాణం, పచ్చతోరణం! కొండనిండా భక్తుల సందడి! సగటున రోజుకు 60వేల మంది శ్రీవారిని దర్శించుకునే వారు. పర్వదినాలు, వరుస సెలవుల్లో ఈ సంఖ్య లక్షను

దేవుడా... భక్తులేరీ!?

  • వెంకన్న భక్తుల వెనుకడుగు
  • పూర్తికాని 12వేల దర్శన కోటా
  • మంగళవారం కేవలం 3962 మందే
  • ఒక్కరోజులో అతిస్వల్ప దర్శనాలివే

(తిరుమల - ఆంధ్రజ్యోతి)

ఏడుకొండల వాడి సన్నిధి అంటేనే... నిత్యకల్యాణం, పచ్చతోరణం! కొండనిండా భక్తుల సందడి! సగటున రోజుకు 60వేల మంది శ్రీవారిని దర్శించుకునే వారు. పర్వదినాలు, వరుస సెలవుల్లో ఈ సంఖ్య లక్షను తాకేది. కానీ... ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రోజంతా కలిపినా... అప్పట్లో ఒకటి రెండు గంటల్లో దర్శించుకున్న వారికంటే తక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మంగళవారం కేవలం 3962 మంది దర్శనానికి వచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత కొండపై దర్శనాలు ప్రారంభమయ్యాక ఒకరోజులో ఇంత స్వల్ప సంఖ్యలో భక్తులు రావడం ఇదే తొలిసారి. బుధవారం ఈ సంఖ్య 5659కి పెరిగింది. గురువారం 8024 మంది, శుక్రవారం 7132 మంది స్వామిని దర్శించుకున్నారు. కరోనాతో మార్చి 21న రద్దయిన దర్శనాలను జూన్‌ 11న టీటీడీ తిరిగి ప్రారంభించింది. 


తొలుత రోజుకు ఆరువేల మందికి దర్శనాలు చేయిస్తామని ప్రకటించింది. తర్వాత రోజుకు 12వేల మంది వరకూ దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతలో తిరుపతిలో కరోనా కేసుల కట్టడికి అధికారులు లాక్‌డౌన్‌ అమలు చేయడం ప్రారంభించారు. దీంతో తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే టైంస్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా 9వేల టికెట్లు ఇస్తున్నారు. ఆగస్టు కోటాను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. వీటితోపాటు వీఐపీలకు, శ్రీవాణి ట్రస్టు దాతలకు వీఐపీ బ్రేక్‌ టికెట్లూ కేటాయిస్తున్నారు. 

తమిళనాడులో ఇలా...

కొండ మీద కూడా ఆంక్షలు అమలు చేయాలని, కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా దర్శనాలను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ ధార్మిక సంస్థలు, భక్తుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తమిళనాడును చూసి టీటీడీ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. మధుర, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి, అరుణాచలం వంటి క్షేత్రాల్లో ఇప్పటికీ భక్తులను అనుమతించడంలేదు. రూ. పదివేలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలను మాత్రమే తెరిచేందుకు అనుమతించింది. ఏపీలో మాత్రం ప్రసిద్ధ క్షేత్రాలన్నింటినీ తెరిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండట్లేదు. తిరుమలలో జూన్‌, జూలైలలో ఆన్‌లైన్‌ కోటా విడుదల చేసిన వెంటనే భక్తులు బుక్‌ చేసుకోగా.. ఆగస్టులో 8, 15 తేదీలు మినహా ఏఒక్కరోజూ కోటా పూర్తిస్థాయిలో బుక్‌ కాలేదు.


ఆరోగ్య సమస్యలుంటే తాత్కాలిక రిలీవ్‌: ఈవో

తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నా, ఇతర కారణాలతో రాలేమని రాతపూర్వకంగా తెలియజేసినా వారిని తాత్కాలికంగా రిలీవ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి తిరుమలలోని వకుళ  విశ్రాంతి భవనంలో అర్చకులతో ఆయన సమావేశమయ్యారు. ఆరోగ్యపరంగా మరింత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా రిలీవ్‌ చేసినా, వారు ఆన్‌ డ్యూటీలోనే ఉన్నట్టు టీటీడీ పరిగణిస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం. తిరిగి వారెప్పుడైనా విధులకు హాజరుకావచ్చని భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-08-08T08:41:29+05:30 IST