భగ్గుమన్న టీడీపీ!

ABN , First Publish Date - 2022-09-22T10:40:19+05:30 IST

భగ్గుమన్న టీడీపీ!

భగ్గుమన్న టీడీపీ!

ఎన్టీఆర్‌ పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్త నిరసనలు

వెనక్కి తగ్గాల్సిందేనన్న నేతలు.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకాలు

ఆత్మగౌరవాన్ని మంట కలుపుతారా?.. సర్కారుపై బీజేపీ మండిపాటు


(న్యూస్‌నెట్‌వర్క్‌-ఆంధ్రజ్యోతి)

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నాయకులు ఎక్కడికక్కడ దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ పేరుమార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారితే.. పేర్లు మార్చేస్తారా? అని నిలదీశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ ఆధ్వర్యంలో, కురుపాంలో తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో, సాలూరులో టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి నిరసన చేపట్టారు. అదేవిధంగా విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున గరివిడిలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లిమర్లలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు నిరసన వ్యక్తం చేశారు. కడపలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు, చింతలపూడి, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు, పోలవరం నియోజక వర్గాల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. మండవల్లిలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహాల ఎదుట నల్ల జెండాలను ప్రదర్శించారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రదండు ఆధ్వర్యంలో జడ్పీ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు ఎలా పెడతారని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో.. సెవన్‌హిల్స్‌ ఆస్పత్రి జంక్షన్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు క్షీరాభిషేకం చేశారు. అనంతరం అక్కడ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి బండారు సత్యానందరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ నిరసన తెలిపారు. అవినీతిపరుడుగా పేరొంది, 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్‌.. ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలభిషేకం చేశారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పాలభిషేకాలు చేశారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ నేతృత్వంలో నిరసన తెలిపారు. 

Updated Date - 2022-09-22T10:40:19+05:30 IST