‘దేవుడి’నీ వదల్లేదు.!

ABN , First Publish Date - 2020-08-13T05:25:47+05:30 IST

దేవాలయాల నిర్వహణకు విలువైన భూములు కేటాయించారు. అందులో దానంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి.

‘దేవుడి’నీ వదల్లేదు.!

 ఆలయ మాన్యాలు అన్యాక్రాంతం

 అక్రమార్కుల చేతుల్లో 6,500 వేల ఎకరాలు 

 స్వాధీనానికి దేవదాయ శాఖ కసరత్తు


దేవాలయాల నిర్వహణకు విలువైన భూములు కేటాయించారు. అందులో దానంగా ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటి సంరక్షణకు దేవదాయ శాఖ, ధర్మకర్త కమిటీలు ఉన్నాయి. కొందరి స్వార్థం కారణంగా విలువైన దేవుడి భూములు అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలో ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతమైతే.. 1,500 ఎకరాలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు దేవదాయ అధికారులు తెలిపారు.


(కడప-ఆంధ్రజ్యోతి):  జిల్లాలో దేవదాయ శాఖ పర్యవేక్షణలో 2,950 దేవాలయాలు ఉన్నాయి. అందులో 1,400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలు, నిర్వహణ కోసం పూర్వీకులు 19,592 ఎకరాల భూములు కేటాయించారు. నాలుగేళ్ల క్రితం వరకు ఎండోమెంట్‌ పర్యవేక్షణలో 11,596 ఎకరాలు ఉండేది. అందులో నిత్యం సేవలు చేసే ఆర్చకులు, వివిధ సేవలు చేసే వారికి ఇనామ్‌ కింద 3,400 ఎకరాలు కేటాయించారు.


మిగిలిన 8,196 ఎకరాల్లో సాగుయోగ్యమైన 3,200 ఎకరాలు వేలం ద్వారా లీజుకు ఇస్తున్నారు. మిగిలిన భూముల్లో కొండలు, గుట్ట ప్రాంతం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే వేలాది ఎకరాలు రాజకీయ అండ కలిగిన గ్రామస్థాయి నాయకులు, ప్రముఖుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఎండోమెంట్‌ ట్రిబ్యూనల్‌, న్యాయస్థానాల్లో దాదాపు 368 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.


వెలుగులోకి ఇలా

గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి 2016లో అప్పటి ప్రభుత్వం ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమం నిర్వహించింది. దీంతో దాదాపు 8వేల ఎకరాల ఎండోమెంట్‌ ల్యాండ్స్‌ అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2009, 2014లో సైతం దేవదాయశాఖ భూముల రీ సర్వే జరిగింది. ఆక్రమిత భూముల స్వాధీనం కోసం అధికారులు తీసుకున్న చర్యలు నామమాత్రమే. 22ఏ 1సీ కింద దేవదాయ శాఖ భూములు క్రయవిక్రయాలు జరపకుండా నిషేధిత జాబితాలో చేర్చారు.


ఇప్పటివరకు కేవలం 1,500 ఎకరాలు స్వాధీనం చేసుకొని వేలం ద్వారా లీజుకు ఇస్తే రూ.40 లక్షలు వచ్చింది. దీనిని ఆ యా ఆలయాల ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. అన్యాక్రాంతమైన మిగిలిన భూములు కూడా స్వాధీనం చేసుకుని లీజుకు ఇస్తే ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


ఆక్రమణల్లో కొన్ని..

ఫ కడప నగర శివారులోని పాలకొండరాయ స్వామి ఆలయానికి చెందిన చిన్నచౌక్‌ పరిధిలో సర్వే నెంబర్‌144లో 0.25 ఎకరాలు, 145లో 1.44 ఎకరాలు, 146లో 0.03 సెంట్లు, కడప నగరంలో సర్వే నంబర్‌ 13లో 1.96 ఎకరాలు, ఉడ్డాయపల్లిలో సర్వే నెంబర్‌ 503లో 0.25 ఎకరాలు కలిపి 3.91 ఎకరాలు అన్యాక్రాంతం అయిందని 2018 డిసెంబర్‌లో అప్పటి ఆలయ కమిటీ చైర్మన్‌ బాల ఓబులరెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ భూముల విలువ రూ.40 కోట్లు పైమాటే.


 మైదుకూరు మండలంలో 48 దేవాలయాల పరిధిలో 681.22 ఎకరాలు ఉన్నాయి. వాటిలో 380.51 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి.


 సీకే దిన్నె మండలంలో కోట్ల విలువైన 15 ఎకరాల ఎండోమెంట్‌ ల్యాండ్‌ కబ్జాలో ఉంది. 


 బద్వేలు మండలం అనంతరాజపురం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి 30 ఎకరాల భూములు ఉన్నాయి. ఆరు ఎకరాలు అన్యాక్రాంతం అయిందని అధికారులు గుర్తించారు. 


 రైల్వేకోడూరు పట్టణంలో ప్రధాన ఆలయానికి చెందిన రూ.4కోట్లకు పైగా విలువచేసే 1.74 ఎకరాల భూమి పరాధీనమైనట్లు ఎండోమెంట్‌ అధికారులు గుర్తించారు. ఈ భూవివాదం న్యాయస్థానంలో ఉందని అధికారులు పేర్కొన్నారు. 


 వేంపల్లి మండలంలో 80 ఎకరాలు, వేముల మండలంలో 40 ఎకరాలు, చక్రాయపేట మండలంలో 26 ఎకరాలు కలిపి 146 ఎకరాలు దేవదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించారు.


ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం

   - శంకర్‌బాలాజీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవదాయ శాఖ, కడప

జిల్లాలో 2,950 నోటిఫైడ్‌ ఆలయాలు ఉన్నాయి. అందులో 1,400 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ కోసం 19,592 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 11,592 ఎకరాలు మాత్రమే ఎండోమెంట్‌ పర్యవేక్షణలో ఉండేవి. సుమారు 8 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించాం.


ఆ భూముల క్రయవిక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చాం. ఇప్పటికే 1,500 ఎకరాలు ఎలాంటి వివాదం లేకుండా స్వాధీనం చేసుకొని లీజు వేలం వేస్తే రూ.40 లక్షలు వచ్చింది. అన్యాక్రాంతంలో ఉన్న మిలిగిన భూములు కూడా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2020-08-13T05:25:47+05:30 IST