దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుడు

ABN , First Publish Date - 2021-01-07T09:57:45+05:30 IST

స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక/ తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక/ కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక/ వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు...

దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుడు

స్త్రీనపుంసక పురుష మూర్తియునుఁ గాక/ తిర్య గమర నరాది మూర్తియునుఁ గాక/ కర్మ గుణ భేద సదసత్ప్రకాశిఁ గాక/ వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.. అని మొసలి నోట చిక్కిన గజేంద్రుడి దైవస్మరణ అది. ఏ లింగమూ కాదు, ఏ జీవీ కాదూ, దేవుడూ కాదు, ఏ గుణమూ లేదు, ఇవేవీ కానప్పటికీ అన్నీ తానే అయినవాడు అయిన దేవుడికి చేసిన ప్రార్థన. మొసలితో తానుగా చేయవలసిన పోరాటం చేసిన తరువాత, నిస్సహాయంగా ప్రాణరక్షణ కోసం కరిరాజు, బమ్మెర పోతరాజు సాయంతో ఎంతో గంభీర తాత్విక ఆర్తనాదాలు చేస్తాడు. ఆత్మభవుడైనవాడు, పెంజీకటి కవ్వల నిలిచి ప్రకాశించేవాడు ఎవడోవాడిని సంబోధిస్తాడు. బహుశా, పోతన వలె దైవతత్వాన్ని శుద్ధ ఆధ్యాత్మికతతో చెప్పినవారు తెలుగుకవులలో ఎవరూ ఉండి ఉండకపోవచ్చు. భాగవతం ఆరంభమే ‘శ్రీ కైవల్య పదము’తో చేశాడు. ఒక మహాశక్తి తప్ప మరేదీ లేని ఆ కేవలత్వం ఊహామాత్రంగా అయినా అనుభవంలోకి తెచ్చుకొని పలవరించడం భక్త కవి మాత్రమే చేయగలడు. 


కానీ, నిరాకార నిర్గుణత్వాన్ని, పరమశక్తిని ఆరాధించే కవీ, ఆ నైరూప్యత దగ్గర నిలిచిపోలేడు. ఆ ఔన్నత్యం దగ్గర ఎక్కువ సేపు నిలబడలేడు. పతనం కావలసిందే. శ్రీ కైవల్యపదం ఏ కృష్ణునిదో అవుతుంది. మూలకారణమైనవాడు ఏ విష్ణుమూర్తో అవుతాడు. ఒక రూపాన్ని ఆపాదించి, ఆ రూపానికి మానవీయమైన సమస్త స్వభావాలను, మనోభావాలను, సాధారణ జీవితాంశాలను, పెళ్లిళ్లను, పిల్లలను- అన్నిటిని ఆపాదించుకుని ఆ వేడుకలను తాదాత్మ్యంతో ఆనందించడం, ఆరాధనగా అభివర్ణించడం భక్తుడు చేస్తాడు. బైరాగులు, యోగులు కేవల ఆధ్యాత్మికతను పలవరిస్తారు, క్షణభంగురతను, మోక్షాన్ని జపిస్తారు. అటు మధుర భక్తిలోను, ఇటు వైరాగ్యంలోనూ కూడా జీవుని వేదనే ఉంటుంది. ఎవ్వనిచే జనించు అన్న విచికిత్స ఉన్నది. జనించి నశించే జీవితానికి అర్థమేమిటన్న చింతన ఉన్నది. దేవుళ్లకు భుజకీర్తులు, వజ్రకిరీటాలూ తొడిగి హుండీలలో ముడుపులు చెల్లించే భక్తులకు ఆధ్యాత్మిక చింతన ఉంటుందంటే నమ్మలేము. 


దైవమన్నది ఒక మధురమయిన ఊహ. మానవులు కనిపెట్టిన అన్నిటిలోకీ అద్భుతమయిన భావన. ఏ ప్రశ్నకూ దైవం సమాధానం కాకపోవచ్చును కానీ, ప్రశ్నలను ఉపశమింపజేసే శక్తి దానికి ఉన్నది. దేవుడికి నమ్మకం ఇచ్చి, తిరుగు కానుకగా ధైర్యం తెచ్చుకోవచ్చు. అదేదో అతీతశక్తి నుంచి దొరికిన ధైర్యం అనుకోనక్కరలేదు. ఊహ నుంచి పిండుకున్న విశ్వాసం అది. ఎక్కడ మానవ అవగాహన ముగిసిపోయి లేదా స్తబ్ధమై, నిలిచిపోతుందో అక్కడి నుంచి అంధకారం మొదలు. అది మనిషికి భయానకం. అక్కడ ఒక తోడు కావాలి. చీకటి అంటే భయపడేవారే మరణానంతర జీవితం ఉన్నదని, స్వర్గనరకాలు ఉంటాయని నమ్ముతారని స్టీఫెన్ హాకింగ్ అంటాడు. పరమ భౌతికశాస్త్రం దుర్బల మానవులను భయపెడుతుంది. బిగ్ బ్యాంగ్ కంటె ముందు కాలమే లేదు, ఇక దేవుడెక్కడ- అన్న హాకింగ్ ప్రశ్నను చర్చించాలన్నా భయమే కలుగుతుంది. 


పుట్టుకకు ముందు, చనిపోయిన తరువాత మనిషి ఉనికి ఉండదనేది ఎప్పటికీ భీతి కలిగించే అంశమే. చైతన్యం మనిషికి భారం అంటారు కానీ, కేవల స్పృహ, కొద్దిపాటి సమాచారం కూడా బరువే. జీవితం అన్నది దీపం ఆరిపోయినంత మామూలుగా ముగిసిపోతుందన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం. మానవేతర జీవజాలంలో దేనికైనా ఇటువంటి మరణానంతర జీవితానికి సంబంధించిన ఊహలూ భయాలూ ఉంటాయో లేదో తెలియదు. ఆధ్యాత్మికత లోపించిన మతం, ప్రజలను నియంత్రించే విలువల, భావాల సంపుటిగా, సమస్త వ్యవస్థాగత రుగ్మతలకు సమర్థనలు అందించే స్మృతులుగా పరిణమించే క్రమంలో, పూర్వ, పర జన్మల గురించి, కర్మ ఫలితం గురించి, పాపపుణ్యాల పర్యవసానాల గురించి బోలెడన్ని విశ్వాసాలను, విధివిధానాలను రచించింది. ఆరిపోయే జీవితం అన్న ఆలోచన కన్న, ఆత్మ ప్రవహించే ఎడతెగని జన్మలు అన్న విశ్వాసం ఎంతో ధీమా ఇస్తుంది. ఇదంతా భావనాత్మకమైన ఉపశమనమే తప్ప, వాస్తవ జీవితంలో అసంకల్పితంగా అయినా పరమభౌతికంగా ప్రవర్తించక తప్పదు. పాపపుణ్యాల పరిగణన, వాటిని మదింపు వేస్తారన్న నమ్మకం, నరకలోకపు భీతీ- నిజంగా ఉంటే, లోకంలో ఇంత పాపం ఉండదు. ఇంతటి క్రూరత్వమూ ఉండదు. పాపాలూ నేరాలూ చేయకుండా అధికారమూ సంపదా రాదని నిర్ధారణ అయిన తరువాత, వాటికి కావలసిన సమర్థనలను చేరుస్తూ మతవిశ్వాసాల సంపుటులు ఆధునికీకరణ చెందాయి. నీకు విధించిన ధర్మాన్ని నువ్వు పాటించు, ఫలితం నీకు అంటదు. నీ విశ్వాసాన్ని స్వీకరించనివాడిని వధించు, నీ ధర్మం గర్విస్తుంది. మనుషులు సమానం కాదు, దేవుడే అసమానతలను సృష్టించాడు, దేశాలన్నిటినీ ఆక్రమించు, ప్రపంచాన్ని నాగరికం చేసే బాధ్యత చరిత్ర నీకు అప్పగించింది, బానిసత్వం తప్పు కాదు, బానిస వ్యాపారం తప్పు కాదు, బానిసలను ప్రేమిస్తే చాలు... చరిత్ర పొడువునా అధికారం చేసిన ప్రతి అన్యాయానికీ దేవుడి మద్దతు పొందడానికి దుర్మార్గులు ప్రయత్నించారు. అందుకు మతాల పెద్దలు సహకరించారు. ఇక మతంలో దైవం ఎక్కడ, ఆధ్మాత్మికత ఎక్కడ? 


ఒకే ఒక్కడి గురించి పోతన చెప్పినట్టు, దేవుడొక్కడే అని కబీర్ కూడా చెప్పాడు. బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమయ్యా చెప్పాడు. ఏకైక దైవం మహాశక్తిశాలి అని ఒక మతం చెప్పింది. దేవుడు దయామయుడని మరొక మతం చెప్పింది. దేవుడనే విచికిత్సే అనవసరం అని ఓ మతం చెప్పింది. ఈ మతమార్గాలు అన్నీ, ఆరంభంలో ఆధ్మాత్మిక అన్వేషణల నుంచి, మనుషుల నైతిక వర్తనల దిద్దుబాటు ఆవశ్యకత నుంచి తపనపడి ఉండవచ్చును. కానీ, దేవుళ్లెక్కడ? సర్వశక్తిశాలి అయిన దేవుడెక్కడ? దేవుడు తమ విశ్వాసాలు నివాసముండే దేశాల భౌగోళిక రాజకీయ సరిహద్దులకు లోబడే వ్యవహరిస్తాడా? ఏ దేశం దేవుడు ఆ దేశస్థులనే గమనిస్తుంటాడా? మొత్తం మనుషుల మీద అతనికి అధికారం ఉండదా? ఈ దేవుళ్లందరూ అనుయాయులను పోగేసుకుని, ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంటారా? మా దేవుడికి ఈ అన్యాయం జరిగింది, కాదు మా దేవుడికే అన్యాయం జరిగింది అంటూ మనుషులు పోట్లాడుకుంటూ ఉంటే, ఆ కలహాలను దేవుడు ప్రోత్సహిస్తూ ఉంటాడా? అసలు దేవుడంటూ ఉంటే మనుషులను శిక్షిస్తాడా? ప్రేమిస్తాడా? దేవుడంటూ ఉంటే ఫలానా మతస్థులకే మేలు జరిగేట్టు తన శక్తిని ఉపయోగిస్తూ ఉంటాడా? దేవుళ్ల గురించి, దైవస్థలాల గురించి పోట్లాడేవాళ్లు, పోట్లాటలు తెచ్చేవాళ్లు, రాళ్లు విసిరేవాళ్లు, ఉద్రేకాలు పొందేవాళ్లు -తాము ఆధ్యాత్మికతను కోల్పోయిన శుష్క మతవాదులుగా పతనమయినట్టు గుర్తించలేకపోతున్నారా? 


సమాజాన్ని, దేశాలను, మానవీయతను భ్రష్టు పట్టించే నయా వ్యాపార, రాజకీయ సంస్కృతులు ఆధ్మాత్మికతకు వ్యతిరేకమయినవి. దైవం లేకుండా కూడా మతం ఉండవచ్చును, ఆధ్యాత్మికత ఉంటే. ప్రజలను దోచుకునే వ్యాపారి తన దొంగసొత్తులో కొంత భాగాన్ని దేవుడికి లంచం ఇచ్చి, తనకు క్షమాపణ దొరికిందని, తానిప్పుడు దేవుడి ఆంతరంగికుడినని విర్రవీగుతున్నాడు. మనుషులను అణచిపెట్టేవారు, ప్రాణాలు తీసేవారు, పసిపిల్లలతో ఆడశరీరాలతో వ్యాపారాలు చేసేవారు-.. వీరెవరికీ పాపభీతి లేదు. దేశాధినేతలకు, సైనిక నియంతలకు, కార్పొరేట్ దిగ్గజాలకు వీరెవరికీ తమ చర్యల పర్యవసానాలపై కానీ, దేవుడి దగ్గర సంజాయిషీ చెప్పుకోవలసి రావడంపై కానీ ఎటువంటి భయమూ లేదు. ఎప్పటికీ తమ నేరాలకు విచారణ ఉండదని, స్వర్గనరకాలు లేవని అంతరాంతరాలలో వీరందరికీ తెలుసును. వీరి దైవభక్తి పరమ ఆడంబరంగా, దేవుడే పారిపోయేంత నీచాభిరుచులతో ఉంటుంది. సర్వాంతర్యామి అని తాము విశ్వసించవలసిన దైవాన్ని ఒక స్థలానికి పరిమితం చేయాలని చూస్తారు. సర్వశక్తిమంతుడని భావించవలసిన దేవుణ్ణే తాము రక్షించగలమని ప్రగల్భిస్తారు. 


జీవితపు మంచిచెడ్డలకు ఏ తీర్పరులూ ఉండరని, సామాజిక పరస్పరత నుంచే నీతి అవినీతులు ఏర్పడాలని, శిక్షించేవారు లేకున్నా మనిషి నైతికతను వీడకూడదని గ్రహింపు కలిగిననాడు ఉన్నతమయిన జీవనస్థాయి ఏర్పడుతుంది. కష్టమే. ఇవాళ అధిక సంఖ్యాకులయిన మనుషులు, ముఖ్యంగా కష్టజీవులు, అణగారినవారు, ఏవేవో విశ్వాసాలపై భయంతోనో, భక్తితోనో తమ జీవితంలో కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. ఆ భయభక్తులే సహనపు సరిహద్దులను కాపలా కాస్తున్నాయి. సమాన పరిగణన, సమాన అవకాశాలు, పరస్పరత, ప్రలోభ రహిత పరిమిత జీవనం... ఇటువంటివి మనుషులను నడిపే విలువలయితే, బహుశా, అప్పుడు అస్తినాస్తి విచికిత్స అవసరం ఉండదు. మానవీయ సమాజం అవతరణ ఫలితంగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ వైపరీత్యాలు కనీసస్థాయికి పడిపోతే, దైవభావనను ఆశ్రయించి ఉపశమనం పొందవలసిన అవసరమూ తగ్గిపోతుంది.


కె. శ్రీనివాస్

Updated Date - 2021-01-07T09:57:45+05:30 IST