దేవుడే దిక్కు!

ABN , First Publish Date - 2021-12-01T07:07:56+05:30 IST

మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్‌వేవ్‌లో కొవిడ్‌ మహమ్మారి జిల్లాను కకావికలం చేసింది. ఒక్కసారిగా కేసులు పెరిగితే కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ ల్లో వైద్య సదుపాయాల డొల్లతనం ఎలా ఉంటుందో తేటతెల్లం చేసింది.

దేవుడే దిక్కు!
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆక్సిజన్‌ లిక్విడ్‌ ట్యాంక్‌

కొవిడ్‌ కల్లోల జ్ఞాపకాలు మర్చిపోకముందే మళ్లీ ఓమైక్రాన్‌ భయం

ఒకవేళ మునుపటిలా మహమ్మారి చుట్టుముడితే హాహాకారాలే గతి

జిల్లాలో రెండు కొవిడ్‌ వేవ్‌ల నుంచి అసలు గుణపాఠమే నేర్వని ప్రభుత్వం

మొదటి, రెండు వేవ్‌ల్లో వేలాది మంది ప్రాణవాయువు అందక కన్నుమూత

అయినా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి ఆక్సిజన్‌ పైపులైన్ల ఏర్పాటుపై మొద్దునిద్ర

రూ.7.87 కోట్లతో పిల్లల పడకలు, ఆక్సిజన్‌ ఏర్పాటుకు 11 సార్లు టెండర్లు

కాంట్రాక్టర్లు ముందుకురాక పనులు వదిలేసిన అధికారులు 

కొవిడ్‌ కల్లోల చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఓమైక్రాన్‌ వైరస్‌ ముప్పు భయాందోళనలు వెన్నాడుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలనే ప్రభుత్వ హెచ్చరికలు  వణుకు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ మహమ్మారి మళ్లీ విరుచుకుపడితే అందుకు అనుగుణంగా ఆసుపత్రులు సిద్ధంగా లేకపోవడం కలవర పెడుతున్నాయి. మొదటి, రెండో విడత మహమ్మారి నుంచి గుణపాఠం నేర్చుకుని ఆసుపత్రులను సర్వసన్నద్ధం చేయాల్సిన ప్రభుత్వం ఇంకా పట్టించుకున్నట్టు లేదు. దీంతో బాధితులకు దేవుడేదిక్కు అన్నట్టు కనిపిస్తోంది. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్‌వేవ్‌లో కొవిడ్‌ మహమ్మారి జిల్లాను కకావికలం చేసింది. ఒక్కసారిగా కేసులు పెరిగితే కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ ల్లో వైద్య సదుపాయాల డొల్లతనం ఎలా ఉంటుందో తేటతెల్లం చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో వైరస్‌ విశ్వరూపం చూప డంతో లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. వేలాది మందికి సకా లంలో ప్రాణవాయువు అందక ఆసుపత్రుల్లోను, బయట చనిపోయారు. చెంతనే ఏరియా, సీహెచ్‌సీలున్నా ఆక్సిజన్‌ దొరక్క జీజీహెచ్‌, డీహెచ్‌, ప్రైవేటు ఆసుపత్రులకు పోటెత్తారు. ఆక్సిజన్‌ పడకలు దొరక్క ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఒక్కో సిలెండర్‌ రూ.10వేలకు సైతం బ్లాక్‌లో కొనుగోలు చేసి కొందరు కొనఊపిరి కాపాడుకున్నారు. ఈ విపత్తు నేర్పిన గుణపాఠం, మూడో వేవ్‌లో రెండు లక్షల కేసుల వరకు వచ్చే ప్రమాదం ఉందన్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అంచనాలతో కళ్లుతెరిచిన ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల వ్యవస్థ ఏర్పాట్లు, మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కాకినాడ జీజీహెచ్‌లో ప్రస్తు త ఆక్సిజన్‌ పైపులైను వ్యవస్థను మరో 150 పడకలకు పొడిగించేలా సింగిల్‌లైన్‌, మరో 50 పడకలకు డబుల్‌లైన్‌ పైపులైన్‌ పొడిగించడానికి రూ.40.34 లక్షలతో టెండర్లు పిలిచింది. రాజమహేంద్రవరం జిల్లా ఆసు పత్రికి రూ.20.63 లక్షలు, అమలాపురం ఏరియా ఆసుపత్రికి రూ.24.77 లక్షలు, రామచంద్రపురం రూ.24.31 లక్షలు, తుని ఏరియా ఆసుపత్రికి రూ.30.28 లక్షలు, ప్రత్తిపాడు సీహెచ్‌సీకి రూ. 18.32 లక్షలు, రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం సీహెచ్‌సీల ఆధునికీకరణ, ఆక్సిజన్‌ సరఫరాకు రూ.29.83 లక్షలు, అడ్డతీగల, గోకవరం, ఏలేశ్వరం తదితర సీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ లైన్ల ఏర్పాటు, ఉన్నవి ఆధునికీకరణకు రూ.27.82 లక్షలతో టెం డర్లు పిలిచారు. ఇప్పటివరకు వీటిలో జీజీహెచ్‌ సహా అనేక ఆసుపత్రు ల్లో పనులు జరగలేదు. అనేకసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ రాలేదు. ముఖ్యంగా జీజీహెచ్‌ ఈఎన్‌టీ వార్డుకు కేంద్రీకృత ఆక్సిజన్‌ పైపులైన్‌ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కొన్నిచోట్ల అయి తే కేవలం పైపులైన్లు అమర్చి వదిలేశారు. కానీ వేటికీ ఆక్సిజన్‌ వసతి ఏర్పాటు చేయలేదు. మరికొన్నిచోట్ల పైపులు వచ్చినా బిల్లులు రాలేదని అమర్చలేదు. ఇక పసిపిల్లల కోసం అనేక ఏరియా, పీహెచ్‌సీల్లో ఐసీ యూ పడకల ఏర్పాటుకు పిలిచిన వర్కులకు ఇప్పటివరకు 11 నుంచి 14 సార్లు టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. వీటికీ స్పందన లేక పనులు మొదలవలేదు. ఆక్సిజన్‌ సమస్య తీర్చడానికి 26 ఆసుపత్రుల్లో ఎయిర్‌ అండ్‌ వ్యాక్యూమ్‌ విధానంలో పైపులైన్‌ నిర్మించడానికి ఒక్కో ఆసుపత్రికి రూ.22 లక్షల చొప్పున రూ.5.72 కోట్లతో టెండర్లు పిలిచారు. కేసులు పెరిగితే ఒక సిలెండర్‌ నుంచి ఒకరికి ఆక్సిజన్‌ అందించడం కాకుండా ఒకే సిలెండర్‌ ద్వారా అనేక పడకలకు ఆక్సిజన్‌ వృథా లేకుండా ఈ ఎయిర్‌ అండ్‌ వ్యాక్యూమ్‌ పైపులైన్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే 26 ఆసుపత్రులకు ఇప్పటివరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పం దన లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఉండిపో యాయి. అధికారులు సైతం కాంట్రాక్టర్లు రాలేదనే కారణంతో ఏ పనీ చేయకుండా అలా వదిలేశారు. అటు కొవిడ్‌ నిర్థారణ జరిపే ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కాకినాడ జీజీహెచ్‌ ల్యాబ్‌లోనే ఉంది. దీంతో సెకండ్‌ వేవ్‌లో లక్షల మంది నుంచి శాంపిళ్లు సేకరించి కాకినాడకు తరలించారు. తీరా వైరస్‌ నిర్థారణకు నాలుగు రోజుల కుపైనే పట్టేది. ఈలోపు అనేకమంది బయట సంచరిం చడంతో కేసులు రెట్టింపయ్యాయి.ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం, అమలాపురంలలో రూ.27 లక్షలతో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టింగ్‌ సెంటర్ల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. వీటికి యంత్రాలు వచ్చినా ఇప్పటిదాకా బిగింపునకు అనుమతి రాలేదు. దీంతో మళ్లీ ముప్పు వస్తే ప్రభుత్వం చేతులెత్తేయడం మినహా మరో దారి లేదు.



Updated Date - 2021-12-01T07:07:56+05:30 IST