భగవంతుడే సార్వభౌముడు

ABN , First Publish Date - 2020-10-07T06:49:03+05:30 IST

ఆత్మజ్ఞానం కోసం తన దగ్గరకు వచ్చిన నారదునికి.. నామం, వాక్కు, మనసు, సంకల్పం, చిత్తం,

భగవంతుడే సార్వభౌముడు

ఆత్మజ్ఞానం కోసం తన దగ్గరకు వచ్చిన నారదునికి.. నామం, వాక్కు, మనసు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, బలం, అన్నం, జలం, తేజస్సు, ఆకాశం వరుసగా ఒకదాని కంటే మరొకటి గొప్పవని సనత్కుమారుడు వివరించాడు.

‘‘ఆకాశం కంటే గొప్పనైనది కలదా?’’ అని నారదుడు ప్రశ్నించగా.. ‘‘ఆకాశం కంటే గొప్పది స్మరణ. ఆకాశంలో శబ్దం వెలువడి నశిస్తుంది. అదే శబ్దం స్మృతిలో స్థిరంగా నిలుస్తుంది. స్మరణ శక్తి లేకుంటే గతంలో కలిగిన ఏ జ్ఞానమైనా గుర్తుండదు. ఒకే స్థలంలో కొంతమంది చేరినప్పుడు ఆ వ్యక్తులకు సంబంధించిన గతమందలి స్మృతి లేకపోతే ఒకరినొకరు గుర్తించరు. స్మరణ శక్తి వలననే సంతానాన్ని, పశువులను ఇంకాదేనినైనా గుర్తించగలుగుతారు. స్మరణ ఉంటేనే ఆకాశాదులు ఉపయోగపడతాయి. అయితే, అటువంటి స్మరణము కంటే ఆశ శ్రేష్ఠమైనది. ఆశ స్మరణముతో పాటు భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. ఆశతోనే మనిషి కర్మలు చేస్తాడు. ఆశతోనే సంపదలు కోరుతాడు’’ అని బోధించాడు.


‘‘ఆశ కంటే గొప్పది ఏది?’’ అని నారదుడు ప్రశ్నించగా.. ‘‘ఆశ కంటే గొప్పది ప్రాణం. ఆశ జీవితం కోరకే కదా! ప్రాణంతో ఉండటం కోసమే. బండి చక్రపు నాభియందు చుట్టూరా ఉన్న ఆకులు అమర్చబడి ఉన్నట్లుగా నామం నుంచి ఆశ వరకూ అన్నీ ప్రాణమందే అమర్చబడి ఉన్నాయి. ప్రాణం లేకుంటే ఆశ ఎక్కడిది? సర్వం ప్రాణమయమై ఉంది. ప్రాణం సహాయంతోనే అంతా జరుగుతోంది. ప్రాణమే తల్లి, తండ్రి, సోదరుడు, ఆచార్యుడు.


అద్దంలో ప్రతిబింబంలాగా.. పరమాత్మ ప్రాణంలో ప్రతిబింబమై ఉంటాడు. ప్రాణం పోయిన తరువాత మిగిలిన శరీరం పంచభూతాల్లో కలిసిపోవలసిందే. సర్వమూ ప్రాణమయమై ఉన్నదని తెలిసినవాడు ప్రాణమే అన్నింటి కంటే గొప్పది అని విచారించి నామం నుండి ప్రాణం వరకు చేరుతాడు. అతను అక్కడే ఆగిపోకుండా ముందంజ వేస్తాడు. సత్యాన్ని తెలుసుకుంటాడు. 


కాబట్టి నారదా! నీవు సత్యాన్ని కోరదగినవాడవు’’ అని సనత్కుమారుడు వివరించాడు. ‘‘స్వామీ! నాకు సత్యమునే ఉపదేశించండి’’ అని నారదుడు కోరగా.. ‘‘విజ్ఞాని అయిన వాడే సత్యం చెప్పగలడు. తెలియని వాడు సత్యాన్ని చెప్పలేడు. సత్యాన్ని తెలుసుకోవడానికి మతి కావాలి. విచారము చేసినవాడు సత్యాన్ని తెలుసుకోగలడు. అందుకు శ్రద్ధ కావాలి. నిష్ఠ గల వానికే శ్రద్ధ కలుగుతుంది. నియమంగా ఉన్నవాడే కర్తవ్య కర్మలను అనుష్ఠిస్తాడు. ఏ సుఖాన్నీ కోరకుండా ఎవ్వరూ ఏ కార్యమూ చేయరు. కాబట్టి సుఖం తెలియదగింది.


అయితే, అల్పంలో సుఖం లేదు. అనల్పమందే సుఖమున్నది. భూమయే (పోలిక లేని అనుభవరూపమైన బ్రహ్మ పదార్థము) అనల్పము, గొప్పది. కాబట్టి నారదా! భూమను తెలియగోరుము’’ అని సనత్కుమారుడుపదేశించాడు. దానికి నారదుడు.. ‘‘దాని గురించే నాకు బోధించండి’’ అని అడిగాడు. 

‘‘భూమ అనేదే సుఖము. అదే ఆనందం. అదే గొప్పది. భూమ కంటే వేరైనదంతా అల్పం. అంతా నశించేది. భూమ తన మహిమయందే ప్రతిష్ఠితమై ఉంది. అదే సర్వము. ఈ కనబడు ప్రపంచమంతా అదే. అదే పరబ్రహ్మము. భూమను తెలుసుకున్న వానికి ప్రాణాదులన్నీ ఆత్మ నుండి కలిగినవని తెలుస్తాయి.


ఆత్మలో.. అంటే తనయందే భూమ ఎరుక కలుగుతుంది. భూమను అనుభూతి చెందుతాడు’’ అని సనత్కుమారుడు నారదునికి అన్నింటికంటే గొప్పదైన భగవంతుడి సార్వభౌమతత్త్వాన్ని బోధించాడు.

-  జక్కని వేంకటరాజం


Updated Date - 2020-10-07T06:49:03+05:30 IST