Abn logo
Dec 17 2020 @ 00:35AM

దేవుడు సరే, దెయ్యంతోనే సమస్య!

మతతత్వానికి, మతానికి మధ్య కార్యకారణ సంబంధమేమీ ఉండనక్కరలేదు. మతతత్వం లేకుండా మతం సుదీర్ఘకాలాలు మనుగడలో ఉన్నది. ఆధునిక యుగంలో మతతత్వానికి, తీవ్ర జాతీయవాదానికి మధ్య కుదిరిన లంకె, శాస్త్ర విజ్ఞాన అంశాలతో కంటె, సామాజిక రాజకీయ అంశాలతోనే తగాదా పెట్టుకుంటుంది.


అధినాయకుడు ఆధునికంగా ఉంటే, అనుచరులు అజ్ఞానాలను ప్రదర్శించడంలో అసహజం ఏముంది అనుకోవచ్చు. ఇందులో ఒకరిది జ్ఞానం, మరొకరిది అజ్ఞానం అనేమీ లేదు. అంతా ఒకటే నిర్మితి. ఎవరికి కావలసింది వారు తీసుకుంటారు. సంస్కరణలు వేగంగా జరుగుతూ ఉంటే, వెంటవెంటనే ప్రభుత్వ సంస్థలు పరాధీనం అవుతుంటే, అధికాదాయ వర్గాలకు అన్నీ సమకూరుతూ ఉంటే ఇక దేశంలో ఏమి జరుగుతున్నా పట్టించుకోని లబ్ధి దారుల తరగతి ఒకటి తయారయింది. సంస్కరణలను, నిర్హేతుకమయిన సామాజిక అజ్ఞానాన్ని ప్రశ్నించడం వారి దృష్టిలో ఒక న్యూసెన్స్. విస్తృత ప్రజానీకం అనేక సందర్భాలలో సహజ విజ్ఞతను ప్రదర్శిస్తారు కానీ, వారు తట్టుకోలేనంత వేగంగా, తీవ్రంగా సమ్మతి తయారీ జరుగుతున్నది. 


ఇస్రోఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు అందరూ తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, శ్రీ హరికోటకు సమీపదేవత చెంగాలమ్మకు కూడా పూజలు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఒక సమాచార ఉపగ్రహాన్ని వాహక నౌక ద్వారా ప్రయోగించనున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తలు తమ ప్రయోగం సఫలం కావాలని కోరుతూ పూజలు చేస్తారు. వ్యక్తిగతంగా ఆయా శాస్త్రజ్ఞులకు ఎంత మేరకు నమ్మకాలు ఉంటాయో తెలియదు కానీ, ఈ పూజలనేవి దాదాపు అధికారికమయిన ఆనవాయితీ కూడా. శుద్ధ శాస్త్ర విజ్ఞానాన్నే నమ్ముకుని పరిశోధనలు చేసి, అంతరిక్షాన్నే అందుకునేవారు, స్థానిక దేవతలను, జాతీయ దేవతలను పూజించడమేమిటా అని ప్రశ్న రావడం సహజమే. సామాజిక మాధ్యమాలలో ఔత్సాహికులు వీరావేశంతో నిలదీస్తున్నారు కూడా. సైన్సుకు, దేవుడికి నిజంగా వైరుధ్యం ఉన్నదా, కనీసం సాధారణ మనిషి అవగాహనలో అవి పొంతన లేని అంశాలా? 


మన దేశంలోనే కాదు, అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసాలో కూడా పూజలు జరుగుతాయి. కాకపోతే, నాసా యంత్రాంగం అధికారికంగా పూజలు చేయదు. మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలు జరుగుతున్నప్పుడు, సాహస యాత్రికులు తమ విశ్వాసాలను కూడా మోసుకుపోతారు. మొదటిసారిగా చంద్రుడి చుట్టూ పరిభ్రమించిన అపోలో-8 లోని యాత్రికులు, ఆ సమయంలో బైబిల్‌లోని ఆదికాండాన్ని పఠించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దాన్ని అమెరికన్లందరూ చూశారు. ప్రభుత్వ ఖర్చుతో మతప్రచారమేమిటని నాసా మీద కేసు కూడా నడిచింది. 1969లో జరిగిన అపోలో 11చంద్ర యానంలో, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొదట చంద్రుడిపై కాలుపెట్టగా, రెండో యాత్రికుడు బజ్ అల్డ్రిన్ ప్రొటెస్టంట్ మతకర్మలు కొన్ని చేశాక కానీ కిందికి అడుగు పెట్టలేదు. ఆ మరుసటి సంవత్సరమే, అపోలో 13 మార్గమధ్యంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనేసరికి, అప్పటి అధ్యక్షుడు నిక్సన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున మత ప్రార్థనలు నిర్వహించారు. సోవియట్ హయాంలో ఏమో కానీ, ఇప్పుడు మాత్రం రష్యాలో ఉపగ్రహాలు, రాకెట్లు, వ్యోమనౌకలు- ఏ ప్రయోగాలు జరిగినా క్రైస్తవ పద్ధతిలో శుద్ధులు, ధూమాలు తప్పనిసరి. జపాన్‌లో అయితే, మన దేశంలో యంత్రాలకు బొట్లు పెట్టి పూజలు చేసినట్టు, ఉపగ్రహాలకు కూడా చేస్తారు.


ఇవన్నీ తెలుసుకుంటే, మన దేశంలోని భక్తులకు ఆత్మవిశ్వాసం పెరిగే మాట నిజమే. ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశం, జయాపజయాల మీద ఉత్కంఠ ఉన్నప్పుడు, దైవ విశ్వాసం ధైర్యాన్నిచ్చే మాట నిజమే. నిజానికి ఇక్కడ దేవుడు, మానవ ప్రయత్నం లేకుండా ఆధారపడుతున్న భావన కాదు. ఫలితం మనుషుల చేతిలో లేకుండా పోయే అవకాశమున్నప్పుడు, ఆ సందిగ్ధతను పరిష్కరించే సాధనం. హేతువాదులు చాలా ఆవేశపడవచ్చు, ఆవేదన చెందవచ్చును కానీ, చెంగాలమ్మకో, వెంకన్నకో మొక్కినంత మాత్రాన పెద్ద ప్రమాదం ఏమీ లేదు. అది వైరుధ్యమే అయినా, అది మనుషుల్లో ఘర్షణను ఉపశమింపజేసేదే కానీ, ఉద్దీపింపజేసేది కాదు. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత విశ్వాసాలను, వృత్తి విజ్ఞానాన్ని వేరువేరుగా పెట్టగలిగితే మంచిదే. వారి బాహాటపు ప్రదర్శన వల్ల రాజ్యాంగం వక్కాణించిన వైజ్ఞానిక స్ఫూర్తి తప్పనిసరిగా ప్రభావితమవుతుంది. కానీ, దేశం ఇప్పుడున్న స్థితిలో అంతకు మించి కలవరపడవలసిన అంశాలున్నాయి. 


మతతత్వానికి, మతానికి మధ్య కార్యకారణ సంబంధమేమీ ఉండనక్కరలేదు. మతతత్వం లేకుండా మతం సుదీర్ఘకాలాలు మనుగడలో ఉన్నది. ఆధునిక యుగంలో మతతత్వానికి, తీవ్ర జాతీయవాదానికి మధ్య కుదిరిన లంకె, శాస్త్ర విజ్ఞాన అంశాలతో కంటె, సామాజిక రాజకీయ అంశాలతోనే తగాదా పెట్టుకుంటుంది. శాస్త్ర విజ్ఞానం, సాంకేతికత, వీటివల్ల ఉత్పన్నమయ్యే సంపదలు, అభివృద్ధీ - అన్నీ కావాలి, కానీ, ఆ క్రమానికి సమాంతరంగాను, అనుబంధంగానూ ఉత్పన్నమయ్యే సామాజిక, రాజకీయ విలువలు అక్కరలేదు. ఇది ప్రమాదకరమైన వైరుధ్యం. దాన్ని గుర్తించకుండా మతతత్వం అనేది ఏదో మూఢత్వానికి, అజ్ఞానానికి సంబంధించిందని అనుకోవడం అమాయకత్వం. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తాను వ్యక్తం చేసుకునే తీరు చూద్దాం. ఆయన వస్త్రధారణ ఆధునికమైనదీ కాదు, సాంప్రదాయికమైనదీ కాదు. నూతన ఆర్థిక విధానాలు, సంస్కరణల వల్ల లబ్ధి పొందే శ్రేణి అయినా, ఇంకా పల్లె దాటని గ్రామీణులయినా ఆమోదించే ఆహార్యం. ఆయన వైవాహిక స్థితి వివాదాస్పదం, దాన్ని ప్రజలు ఒక అంశంగా పట్టించుకోలేదు. ఆయన తల్లిని గౌరవంగా చూస్తారు. దాన్ని జనం స్వీకరించారు. ఉత్తరాదిలో ఎన్నికల సభల్లో మాట్లాడేటప్పుడు నిగ్రహాన్ని వదిలేస్తారు. అది స్థానిక వినియోగానికే. విస్తృత వినియోగానికి మన్ కీ బాత్‌లో గంభీరమైన విషయాలు మాట్లాడతారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటారు. బడాయి అని కొందరు అనుకోవచ్చు కానీ, అది కూడా ఏదో సంకేతం ఇచ్చే ఉంటుంది. మరో వైపు ఆయన అంతరిక్ష ప్రయోగకేంద్రాలను సందర్శించి, దేశ వైజ్ఞానిక ప్రగతితో తాదాత్మ్యం చెందుతారు. అత్యాధునిక జీవసాంకేతిక ప్రయోగశాలలను సందర్శించి, శాస్త్రజ్ఞులతో చర్చలు జరుపుతారు. ఈయనకు ఇంత విషయం తెలుసునా అని శాస్త్రజ్ఞులే మీడియా ముందు ఆశ్చర్యపోతారు. పాతచట్టాలతో కొత్త శతాబ్దంలోకి ఎట్లా ప్రయాణిస్తామని ధర్మావేశంతో ప్రశ్నిస్తారు. మతతత్వవాది అని ప్రత్యర్థులు విమర్శించే ఒక నాయకుడు తనను తాను ఆధునికుడిగా ప్రదర్శించుకుంటున్నప్పుడు, ప్రజలు అబ్బురపడుతూ ఆమోదిస్తున్నారు. సమాజంలోని వివిధ జనశ్రేణుల మధ్య (తాము సృష్టిస్తున్న వాటితో సహా) సమస్యలను అధిగమించి, సహజీవన సామరస్యాలను సాధించడం గురించి, సామాజికంగా, ఆర్థికంగా బాధితులుగా, అట్టడుగున ఉన్నవారి శ్రేయస్సు కోసం ప్రగతిశీలంగా తీసుకోవలసిన చర్యల గురించి ఈ ప్రధాని భావాలేమిటి అన్న సందేహం ఎవరికీ రావడం లేదు. 


కొవిడ్ టీకా గురించి ఇంత పరిజ్ఞానం, పట్టింపు ఉన్న ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ, ఆయన సహచరులు ఎంత ఆధునికంగా ఉండాలి? హేతుబద్ధతతో వ్యవహరించాలి? శూద్రులు అజ్ఞానులు అని ఒక నాయకురాలు వ్యాఖ్యానిస్తారు. సంస్కృతం మాట్లాడితే మధుమేహం రాదు అని మరో నాయకుడు అంటాడు. గోమూత్రంతో కరోనా నివారణ సంగతి తెలిసిందే. ఇవేవీ దైవ విశ్వాసానికి సంబంధించినవి కావు. దేవుడి మీద నమ్మకం ప్రకటించేవారు, అనేక జీవనాంశాల విషయంలో హేతుబద్ధంగానే వ్యవహరిస్తారు. కానీ, సామాజిక ఉద్వేగాల మీద స్వారీచేసేవారు, దైనందిన జీవితానికి సంబంధించిన ప్రమాదకరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు, వ్యాపింపజేస్తారు. దురదృష్టకరమేమిటంటే, ఒక వైపు శాస్త్రవిజ్ఞాన, సాంకేతిక అభివృద్ధిని చూస్తూ, వాటి ఫలాలను కూడా అనుభవిస్తూ, ఆ అభివృద్ధి స్ఫూర్తికి భిన్నమయిన విశ్వాసాలను ప్రేరేపిస్తున్నారు. ఈ వైరుధ్యాన్ని జనం గుర్తించకుండా, ఆవేశాల ఉద్రేకాల హోరును వెదజల్లుతున్నారు. చరిత్ర, సామాజిక శాస్త్రం ఇతర మానవీయశాస్త్రాలు ఇప్పటికే చేసిన నిర్ధారణలను కూడా తిరస్కరిస్తున్నారు. ఆర్యులు మధ్య ఆసియా నుంచి రావడం తప్పు, భూగర్భ శిథిలాల కాలనిర్ణయాల ప్రమాణాలు తప్పు, వివిధ భాషా కుటుంబాలు తప్పు, పురాతత్వ- జన్యు పరిశోధనలు తప్పు.. భౌతిక అభివృద్ధిని తక్షణం ప్రభావితం చేయని శాస్త్రాలను నిరాకరించడం సులభం, ఆ నిరాకరణ సామాజిక విభజనలను తీవ్రం చేసేవి కావడం విశేషం. 


అధినాయకుడు ఆధునికంగా ఉంటే, అనుచరులు అజ్ఞానాలను ప్రదర్శించడంలో అసహజం ఏముంది అనుకోవచ్చు. ఇందులో ఒకరిది జ్ఞానం, మరొకరిది అజ్ఞానం అనేమీ లేదు. అంతా ఒకటే నిర్మితి. ఎవరికి కావలసింది వారు తీసుకుంటారు. సంస్కరణలు వేగంగా జరుగుతూ ఉంటే, వెంటవెంటనే ప్రభుత్వ సంస్థలు పరాధీనం అవుతుంటే, అధికాదాయ వర్గాలకు అన్నీ సమకూరుతూ ఉంటే ఇక దేశంలో ఏమి జరుగుతున్నా పట్టించుకోని లబ్ధిదారుల తరగతి ఒకటి తయారయింది. సంస్కరణలను, నిర్హేతుకమయిన సామాజిక అజ్ఞానాన్ని ప్రశ్నించడం వారి దృష్టిలో ఒక న్యూసెన్స్. విస్తృత ప్రజానీకం అనేక సందర్భాలలో సహజ విజ్ఞతను ప్రదర్శిస్తారు కానీ, వారు తట్టుకోలేనంత వేగంగా, తీవ్రంగా సమ్మతి తయారీ జరుగుతున్నది. ఆధునికత తిరోగామిత్వం వైరుధ్యాన్ని, లేదా ద్వంద్వాన్ని గుర్తిస్తే తప్ప, హేతుబద్ధ అవగాహన వేదిక మీదకు రాదు. 


వైరుధ్యాలను నిర్వహించడం గురించి ఒకనాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మాట్లాడేవారు. పరిష్కరించడం సాధ్యపడనప్పుడు నిర్వహించడమేగా చేయవలసింది- అని ఆయన భావం కావచ్చును. మతతత్వానికి నిర్వహణాత్మక విరుగుడుగా ఆయన ముందుకు తెచ్చిన వ్యూహం కూడా కాలక్రమంలో విఫలమైందనే చెప్పాలి. వాస్తవ వైరుధ్యాలను కప్పిపుచ్చడం, అబద్ధపు వైరుధ్యాలను ఎగదోయడం ఒక విధానంగా అమలు జరుగుతున్నప్పుడు, ప్రజలు ఈ కల్లోల కాలాన్ని ఎట్లా ‘నిర్వహించాలి’?

కె. శ్రీనివాస్