పట్టాలెక్కిన రైళ్లు

ABN , First Publish Date - 2020-06-02T08:47:30+05:30 IST

దాదాపుగా డెబ్బై రోజుల విరామం తరువాత సాధారణ రైళ్ల ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరి వెళ్లాయి.

పట్టాలెక్కిన రైళ్లు

విశాఖ నుంచి బయలుదేరిన గోదావరి, ఏపీ ఎక్స్‌ప్రెస్‌

రెండు గంటలు ముందే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు

ప్రవేశ ద్వారం వద్ద స్ర్కీనింగ్‌ అనంతరం లోనికి అనుమతి

సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ పర్యవేక్షణ


విశాఖపట్నం, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి):

దాదాపుగా డెబ్బై రోజుల విరామం తరువాత సాధారణ రైళ్ల ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరి వెళ్లాయి. కరోనా లాక్‌డౌక్‌తో చాలామంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు, పిల్లలకు దూరంగా పెద్దలు, విహారయాత్రకు వచ్చి ఉండిపోయినవారు...ఇలాంటివారంతా సోమవారం ప్రారంభమైన రైళ్లలో బయలుదేరి వెళ్లారు. వారందరిలోను ఓ రకమైన సంతోషం కనిపించింది. ఎలాగోనా ఈ బందీఖానా నుంచి బయటపడుతున్నామనే భావన వ్యక్తమైంది. ఈ ప్రయాణం కోసం వారు రెండు గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవడంతో జ్ఞానాపురం మార్గంలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది.


అయినప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరించి చాలా జాగ్రత్తగా వచ్చారు. ఇప్పటివరకు కరోనా బారిన పడలేదని, ఇంటికి చేరేంత వరకు అదే జాగ్రత్తలు పాటించాలనే తపన వారిలో కనిపించింది. నెలల వయసు కలిగిన పిల్లలకు కూడా మాస్కులు కట్టి తీసుకువచ్చారు. వీరందరినీ వీడియో థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా పరీక్షలు చేసి, రైలు లోపలకు అనుమతించారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 800 మంది ప్రయాణికులు వెళ్లారు. అలాగే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోను 500 మంది వరకు ఎక్కారు. ప్రయాణికులను రైలులో తనిఖీలు చేసే టీటీఈలు కూడా నోటికి మాస్క్‌తో పాటు ముఖానికి షీల్డ్‌ మాస్క్‌ ధరించి విధులకు హాజరయ్యారు.


సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది

రైల్వేలో సివిల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ఉంది. మాక్‌డ్రిల్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారిలో 22 మందిని రెండు గ్రూపులుగా విభజించి కరోనా విధులు అప్పగించారు. వారు తెల్లటి యూనిఫామ్‌లో స్టేషన్‌లోను, రైలులోను సందర్శించి...అంతా మాస్క్‌లు ధరించారా? లేదా?, భౌతిక దూరం పాటిస్తున్నారా? లేదా అని పరిశీలించి, అవన్నీ పక్కాగా అమలు చేసే బాధ్యతలు అప్పగించారు. రైలు ప్రయాణం వల్ల కరోనా వచ్చిందనే అపవాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. 


అనకాపల్లి నుంచి గోదావరిలో 33 మంది ప్రయాణం..70 రోజుల తరువాత కనిపించిన పాసింజర్‌ రైలు

అనకాపల్లి టౌన్‌: సుమారు 70 రోజుల తరువాత అనకాపల్లి స్టేషన్‌లో పాసింజర్‌ రైళ్లు కనిపించాయి. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అనకాపల్లికి చేరుకుంది. 33 మంది ప్రయాణికులు రైలులో ఎక్కారు. అధికారులు సూచించిన మేరకు రెండు గంటల ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రధాన మార్గంలో ఆర్పీఎఫ్‌ అధికారులు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి లోపలకు అనుమతించారు. ఆర్డీవో జె.సీతారామారావు ఏర్పాట్లను పరిశీలించి, స్టేషన్‌ సూపరింటెండెంట్‌ జీవన్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు.  


షూటింగ్‌ కోసం వచ్చి చిక్కుకుపోయాం- రమేష్‌, హైదరాబాద్‌

లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ నిమిత్తం విశాఖ వచ్చాం. ఇంతలోనే లాక్‌డౌన్‌ విధించడంతో చిక్కుకుపోయాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో రైళ్లు నడవడంతో స్వస్థలానికి వెళ్లే అవకాశం కలుగుతోంది.


సికింద్రాబాద్‌లో ఉద్యోగం..రాజశేఖర్‌, విశాఖపట్నం

నేను విశాఖ వాసినే. కానీ సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. సెలవులో వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రయాణానికి అనుమతులు రావడంతో మళ్లీ విధుల్లో చేరేందుకు వెళుతున్నాను.  

Updated Date - 2020-06-02T08:47:30+05:30 IST