గోదావరి ఎండింది

ABN , First Publish Date - 2021-04-17T06:21:58+05:30 IST

గోదావరి ఎండిపోయింది. ఎడారిలా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం దారుణంగా పడిపోయింది.

గోదావరి ఎండింది
పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి అలా...

  • బ్యారేజి వద్ద 4.2 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
  • 2018 తర్వాత ఇదే దారుణ పరిస్థితి.. ఇటు సీలేరు నీరు బంద్‌
  • మరో రెండు మూడు రోజులే కాల్వలకు నీరు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి ఎండిపోయింది. ఎడారిలా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం దారుణంగా పడిపోయింది. అఖండ గోదావరిలో ఇసుక తిప్పలు తేలాయి. దీనితో రబీ రైతుల గుండెల్లో తడారిపోతోంది. మంచినీరు చెరువులు నిండక, గోదావరి డెల్టా కాలువల సమీపంలోని మున్సిపాల్టీలు, గ్రామాల ప్రజల గొంతెండిపోతోంది. వర్షాలు కురవాలంటే కనీసం ఇంకా రెండు నెలలు ఆగాలి. ఇప్పటికే ఎండలు ముదిరాయి. రెండ్రోజుల నుంచి అక్కడక్కడా వర్షం పడడం కొంత ఉపశమనమేకానీ ఇది మరింత ఉక్కపోతను పెంచుతుందని జనం ఆందోళన చెందుతున్నారు. మే నెల,  జూన్‌ నెలలో కూడా కొంత మేర ఎండలు ఉంటాయి. ఈలోపు మంచినీటి అవసరాలు, పశువులకు, చేపల చెరువులకు నీటి సమస్య తతెత్తే ప్రమాదం ఉంది. గత జూన్‌ నుంచి ఇప్పటివరకూ సముద్రంలోకి 3476.267 టీఎంసీ ల గోదావరి నీటిని వదిలేశారు. ఇటు పోలవరం జాప్యం వల్ల నీటి నిల్వ సామర్థ్యం లేదు. దీనివల్ల ఇప్పటివరకూ డెల్టా కాలువలకు కేవలం 207.94 టీఎంసీల నీటిని మాత్రం ఇవ్వగలిగారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 4.4. అడుగుల దిగువకు పడిపోయింది. గతేడాది ఈరోజున 7.6 అడుగుల నీటిమట్టం ఉంది. మూడు రోజుల కిందట ఏకంగా 4 అడుగులు పడిపోయింది. మధ్యలో సీలేరు నుంచి నీటిని ఆపడంతో ఈ సమస్య ఏర్పడింది. తిరిగి 6 వేల క్యూసెక్కుల సీలేరు నీరు వదలడంతో కొంత మె రుగైంది. కానీ గురువారం అర్ధరాత్రి నుంచే సీలేరు నుంచి నీటిని బంద్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు ఆ నీరు చేరుతుంది. తర్వాత కాలువలకు నీరు ఇవ్వలేని పరిస్థితి. ప్రస్తుతం సీలేరు నీరు రావడం వల్ల ఈస్ట్రన్‌ డెల్టాకు 1000 క్యూసెక్కులు, సెంట్రల్‌ డెల్టాకు 1100 క్యూసెక్కులు, వెస్ట్రన్‌ డెల్టాకు 2300 క్యూసెక్కులు ఇస్తున్నారు.

  • గండమే...

జిల్లాలో మొత్తం 4,07,098 ఎకరాల్లో రబీ వరిసాగు చేశారు. సెంట్రల్‌ డెల్టా పరిధిలో ఉన్న కోనసీమలోని 16 మండలాల పరిధిలో 94,949 ఎకరాల్లో వరి రబీ సాగు మొదలెట్టారు. ఇక్కడ ఇంకా కోతలు మొదలు కాలేదు. ఈస్ట్రన్‌ డెల్టా పరిధిలోని 18 మండలాల్లో 2,15,667 ఎకరాల్లో రబీ వరి వేయగా, ఇక్కడ కొంతమేర కోతలు జరిగాయి. ఈ నేపఽథ్యంలో రబీ అవసరాల మేరకు నీరు లభించడం కష్టమే. పంట ఆఖరి దశలో ఉన్నందున నీరు బాగా అవసరం. రైతులు జాగ్రత్తగా ఈ రెండు మూడు రోజులు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే బీటలు తీసిన పొలాల్లో రైతుల బాధలు దేవుడికే తెలుసు.

  • సమస్య ముందే తెలిసినా...

తెలంగాణ వైపు నుంచి ఒక చుక్క నీరు కూడా రావడంలేదు. భద్రాచలం వల్ల ప్రస్తుతం నీటిమట్టం 3 అడుగులు మాత్రమే ఉంది. మరోపక్క పోలవరం పనులు జరుగుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయనున్నారు. దీని కోసం ముందుగానే కార్యాచరణ ప్రకటించారు. అయినా గోదావరిలో నీటిని కొంతమేర అయినా ఆపలేకపోయారు. గోదావరి రైతుల ఇసుక గండం పట్టుకుంది. అఖండ గోదావరిలోనూ, పట్టా భూముల్లో ఇసుకతీత కోసం అక్టోబరు తర్వాత చాలా నీటిని సముద్రంలోకి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది సముద్రంలోకి ఏకంగా 3476.267 టీఎంసీల నీటిని వదిలేశారు. కేవలం కాలువలకు 207.94 టీఎంసీల నీటినే వాడారు. ఏడాది వరదలు బాగా రావడం వల్ల నీరు కూడా ఎక్కువ వచ్చింది. డిసెంబర్‌లో రబీ మొదలైన తర్వాత బ్యా రేజీ వద్ద అత్యధిక నీటిమట్టం ఉండేటట్టు ప్రయత్నం చేస్తే సమస్య ఉం డదు. బ్యారేజీ నీటిమట్టం ప్రస్తుతం 4.4 అడుగులకు పడిపోయింది. కనీసం 7.5 అడు గులు ఉంటే కాలువల నుంచి శివారు భూములకు నీరిచ్చే అవకాశం ఉంటుం ది. బ్యారేజీ వద్ద వాస్తవానికి 11 అడుగుల వరకూ నీటిని నిల్వ చేయవచ్చు.  గోదారి లెవల్‌ 13.9 మీటర్ల వరకూ ఉండొచ్చు. ఇవాళ ఏకంగా 12.01 మీటర్లకు పడిపోయింది. అంటే బ్యారేజీ వద్ద నీటిమట్టం పడిపోకుండా ఎప్పుడూ జాగ్రత్త తీసుకున్నట్టు లేదు. డిసెంబర్‌ తర్వాత సీలేరు నీరు మనకు అవసరం అవు తుంది. అది వచ్చేలోపు బ్యారేజీ వద్ద నీటిమట్టం నిలబెట్టుకుంటే సమస్య ఉండదు. కానీ అలా చేయకపోవడం వల్ల సమస్య ఎదురవుతోంది. అంతేకాక ఇటీవల ఇసుక బెడద ఎక్కువైంది. ఇసుక నుంచి రూ.కోట్లు రుచి మరిగిన వ్యక్తులు గోదావరిలో నీరు తక్కువ ఉండేలా ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-04-17T06:21:58+05:30 IST