Abn logo
Jul 24 2021 @ 23:40PM

గోదావరి ముంపు

పోలవరం మండలం కోండ్రుకోట నుంచి తరలివెళుతున్న నిర్వాసితులు

పోలవరం నిర్వాసితుల్లో భయం.. భయం..


కొవ్వూరు, జూలై 24: అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొవ్వూరు గోష్పాధక్షేత్రం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 9నుంచి 10లక్షల వరద ప్రవాహం బ్యారేజ్‌కు చేరుకోవచ్చునని గోదావరి హెడ్‌వాటర్‌ వర్క్స్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం, ర్యాలి, విజ్జేశ్వరం, మద్దూరు ఆర్మ్‌లలో 175 గేట్లను ఎత్తివేసి 4,61,337 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని  సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ దిగువన ఉన్న మూడు ప్రధాన డెల్టాలకు వ్యవసాయ సాగునీటి అవసరాల నిమిత్తం 4200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

గోదావరి వరద ముంపులో పోలవరం మండలం వాడపల్లి


కుక్కునూరు – దాచారం మధ్య మునిగిన లో లెవెల్‌ కాజ్‌ వే

కుక్కునూరు: మండలంలో పలు గ్రామాల్లో రహదారులపై గోదావరి నీరు చేరింది. కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగు లోలెవెల్‌ కాజ్‌వే, ఎర్రబోరు, ముత్యాలంపాడు గ్రామాల మధ్య పాలవాగుపై లోలెవెల్‌ కాజ్‌వే కూడా నీట మునిగాయి. బెస్తగూ డెంలో దాదాపు 50 కుటుంబాలను, కుక్కునూరులో దాదాపు 30 కుటుం బాలను పునరావాస కాలనీలకు తరలించారు. తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో లక్ష్మీకాంతం, ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

వేలేరుపాడులో నీట మునిగిన ఎద్దువాగు బ్రిడ్జి

వేలేరుపాడు: కొయిదా మధ్య ఎద్దువాగు వంతెన పూర్తిగా మునిగిపోయింది. కొయిదా, పరిసర 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు, రుద్ర మకోట మధ్య కాజ్‌వేపై వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. రుద్రమకోట, రేపాక గొమ్ము, తాట్కూరుగొమ్ము, తిరుమలాపురం గ్రా మాల ప్రజలు ఇళ్లల్లోని సామానులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శివకాశీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, భూదేవిపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. వేలేరుపాడు మండలంలో సహాయ పునరావాస చర్యలను ఐటీడీఏ పీవో ఆనంద్‌ పరిశీలించారు. సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందు బాటులో ఉంచామని ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లిన తరువాత వారం దరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. తహసీల్దార్‌ చెల్లన్నదొర, ఎంపీడీవో శ్రీహరి, అధికారులు వరద తీవ్రతను పర్యవేక్షిస్తున్నారు.