Abn logo
Sep 27 2021 @ 01:16AM

ధర్మపురి వద్ద పెరిగిన గోదావరి వరద

నిండుగా ప్రవహిస్తున్న గోదావరి

కడెం ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా నీటి విడుదల

ధర్మపురి, సెప్టెంబరు 26: ధర్మపురి వద్ద గోదావరి నది నీటి ప్రవాహం ఆదివారం సాయంత్రం పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి వాగుల ద్వారా నీరు గోదావరి నదిలో చేరుతోంది. దీనికి తోడుగా నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోనికి మధ్యాహ్నం రెండు గంటల వరకు 3,734 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు సంబంధించిన రెండు గేట్లు తెరచి 12,750 క్యూసెక్కుల నీరు దిగువకు గోదావరి నది లోనికి విడుదల చేశారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు నది నీటి మట్టం పెరిగింది. సత్యవతి, బ్రహ్మగుండం పైనుంచి నది నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. సంతోషీమాత, మంగళిగడ్డ, సోమవిహార్‌, మహాలక్ష్మి స్నానఘ ట్టాలు ఆనుకుని వరద నీరు చేరుకుంది. ధర్మపురి, రాయపట్నం వద్ద భక్తులు లోతు ప్రదేశాలకు వెళ్లి స్నానాలు చేయకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మండలంలోని ఆరెపల్లి, దొంతాపూర్‌, జైనా, రాజారం, దమ్మన్నపేట, తిమ్మాపూర్‌, రాయపట్నం గోదావరి తీరాన గల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులను నది వైపు వెళ్లరాదని తహసీల్దార్‌ నలువాల వెంకటేష్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ సూచించారు. వరద పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.