నిత్యహారతికి మంగళమేనా..?

ABN , First Publish Date - 2021-10-08T07:12:56+05:30 IST

గోదావరి నిత్యహారతికి మంగళం పలికే దిశగా రాష్ట్ర దేవదాయశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ఆరు నెలలుగా ఇక్కడ పనిచేసే 36 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.

నిత్యహారతికి మంగళమేనా..?

  • దేవీ నవరాత్రులే హారతి ఇచ్చి తర్వాత ఆపే ఆలోచన
  • ఆరు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వని వైనం
  • నెలకు మొత్తం రూ.4.25 లక్షల దాకా ఖర్చు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి నిత్యహారతికి మంగళం పలికే దిశగా రాష్ట్ర దేవదాయశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనికి కారణం ఆరు నెలలుగా ఇక్కడ పనిచేసే 36 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. నెలకు సుమారు రూ.4.25 లక్షలు ఇవ్వాలి. ఇందులో బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇవ్వవలసి ఉంది. కరోనా కారణంగా  సుమారు ఏడాది కిందట ఆగిపోయిన గోదావరి నిత్యహారతి గురువారం రాత్రి ప్రారంభమైంది. కానీ దసరా సందర్భంగా ఈ తొమ్మిది రోజులు మాత్రం అన్నవరం దేవస్థానం లేదా, ద్వారకాతిరుమల దేవస్థానంలో ఆధ్వర్యంలో నిర్వహించి తర్వాత ఈ హారతికి స్వస్తి చెప్పే ఆలో చనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల కథనం. గురువారం అత్యంత వైభవంగా హారతి ప్రారంభమైంది. అయితే దీనిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. వారణాసి మహా క్షేత్రంలో గంగానదికి నిత్యహారతి ఇస్తున్న విధంగా రాజమహేంద్రవరంలో గోదావరికి నిత్యహారతి ఇస్తే మంచిదనే ఆలోచనతో బుద్ధవరపు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుద్ధవరపు కుమార్‌ 2010లో  కార్తీక పౌర్ణమి రోజు ఈ హారతికి శ్రీకారం చుట్టారు. ప్రతీ పౌర్ణమి రోజున ఈ హారతి నిర్వహించేవారు. 2014 గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ఈ హారతిని తిలకించి, దీన్ని నిత్యహారతిగా మారిస్తే  బావుంటుందని భావించడమే తడవుగా అధికార్లకు ఆదేశాలు జారీ చేసి, పుష్కరాల నాటి నుంచే నిత్యహారతిగా మార్చారు.  ప్రతీ రోజూ వందలాది మంది భక్తులు, ప్రజలు పుష్కరఘాట్‌లో కూర్చుని గోదావరి నదిలో పంటుమీద పండితులు ఇచ్చే ఈ హారతిని భక్తిశ్రద్ధలతో తిలకించేవారు. రోజూ హారతి ఇవ్వడం వల్ల పుష్కరఘాట్‌ ఓ పుణ్యస్థలంగానూ మారింది. ఈ హారతి నిర్వహించడానికి సుమారు 36 మంది సిబ్బంది ఉంటారు. 20కి మందికిగా పైగా పండితులు ఉంటారు. వీరికి  రూ.4.25 లక్షల ఖర్చు నెలకు అవుతుంది. దీనికి ప్రభుత్వం అంటే దేవదాయ శాఖ నుంచి  75 శాతం, బుద్ధవరపు ట్రస్ట్‌ నుంచి 25 శాతం నిధులు ఇవ్వడానికి అప్పట్లో ఒప్పందం జరిగింది. కానీ ఎంతో బ్రహ్మాండంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచేకాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కూడా ప్రజలు వచ్చేవారు. రాందేవ్‌ బాబా వంటి ప్రముఖులు కూడా ఇక్కడకు రావడం గమనార్హం. కానీ కరోనా వల్ల ఏడాదిగా ఈ హారతి ఆగిపోయింది. దేవీరాత్రుల సందర్భంగా  గురువారం ప్రారంభమైనా 9 రోజుల తర్వాత దీనిని ఆపేయడానికి దేవదాయ శాఖ యోచిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆరు నెలలుగా హారతి సిబ్బందికి, పండితులతో సహా ఎవరికీ జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం.

14 రకాల హారతుల వైభవం

నిత్యహారతిలో ఇక్కడ పండితులు 14 రకాలు హారతులు ఇస్తుంటారు. ఒకటి ధూపహారతి. ఇది చూస్తే చెడు దోష నివారణ కలుగుతుందని నమ్మకం. రెండోది ఏకహారతి. సకల పాపాలు నశించిపోతాయి. మూడోది నేత్ర హారతి. నేత్ర దోషాలు తొలగిపోతాయి. నాల్గోది బిల్వహారతి.   మూడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి. ఐదోది నాగహారతి. నాగదోషాలు తొలగిపోతాయి. ఆరోది పంచహారతి. పంచ మహాపాతకాలు తొలగిపోతాయి. ఏడోది  వృక్షహారతి.  ప్రకృతికి హాని చేసి ఉంటే ఆ పాపాలు తొలగిపోతాయి. ఎనిమిదోది నందిహారతి. నందీశ్వరుడి అను గ్రహం కలుగుతుంది. తొమ్మిదోది సింహహారతి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పదోది రుద్రహారతి. ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. పదకొండోది చక్రహారతి. చక్రధారి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. పన్నెండోది కుంభహారతి. గ్రహ దోషాలు తొలగి,  ఐవ్వర్యసిద్ధి కలుగుతుంది. పద మూడోది కర్పూర హారతి. అనేక దోషాలు నశిస్తాయి. పద్నాలుగోది నక్షత్రహారతి. నక్షత్ర, జాతక దోషాలు తొలగిపోతాయి. ఇలా వీటి గురించి భక్తులు నమ్ముతారు. పైగా ఆ హారతి కనుల విందు చేస్తుంది. దీన్ని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-08T07:12:56+05:30 IST