గోదావరి మళ్లీ ఉగ్రరూపు!

ABN , First Publish Date - 2022-09-13T10:13:54+05:30 IST

ఎగువన విరామం లేకుండా వర్షాలు పడుతుండటంతో గోదావరి నది మళ్లీ ఉగ్రరూపు దాల్చింది.

గోదావరి మళ్లీ ఉగ్రరూపు!

మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెంలోకి 10 లక్షల క్యూసెక్కుల చొప్పున..

భద్రాచలం వద్ద 45.1 అడుగుల ఎత్తులో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

కృష్ణాకు నిలకడగా.. శ్రీశైలంలోకి 2.9 లక్షల క్యూసెక్కుల వరద

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 10.3 సెం.మీ వర్షపాతం

బలహీనపడ్డ వాయుగుండం.. 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో, ఎగువన విరామం లేకుండా వర్షాలు పడుతుండటంతో గోదావరి నది మళ్లీ ఉగ్రరూపు దాల్చింది. కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెంలోకి 10లక్షల క్యూసెక్కుల పైనే వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 10.07 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం బ్యారేజీకి 10.45 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెంలోకి 10.26 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీలోకి 8.97 లక్షల క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీలోకి 6.7 లక్షల క్యూసెక్కులు,  ఎల్లంపల్లిలోకి 5.34 లక్షల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌కు 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో, 10 వేల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటు పెరిగింది. 45.1 అడుగుల ఎత్తులో నది ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపు దాల్చడంతో పంటలు నీట మునుగుతున్నాయని ఏపీలోకి విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులోకి వరద నిలకడగా వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు వరద వస్తుండగా అంతకుమించి 3.12 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, పులిచింతల ప్రాజెక్టుకు2.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదులుతున్నారు. జూరాలకు 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2.29 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సుంకేసులకు 54 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 54వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మరోవైపు ఆగని వాన రైతుకు వేదను మిగుల్చుతోంది!! చేలల్లో నీరుచేరి పత్తి, మిరప తదితర పంటలు జాలు పడుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌, పాలమూరు, ఖమ్మంజిల్లాలో వర్షం పడింది. జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నంలో 10.3 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 8.2 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలో రోజంతా భారీ వర్షం పడింది. వేల్పూరు, జాక్రాన్‌పల్లి, మోర్తాడ్‌, భీంగల్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 3వేల ఎకరాల్లో సోయా పంటకు నష్టం జరిగింది. హైదరాబాద్‌లో సాయంత్రం 4గంటల నుంచి కొన్నిచోట్ల  భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, మల్కాజ్‌గిరి, కాప్రా, బాలానగర్‌, మారేడ్‌పల్లి, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌, శేక్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 


 18న ఉపరితల ఆవర్తనం! 

విశాఖపట్నం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిసాలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో సోమవారం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మధ్యప్రదేశ్‌, విదర్భ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. అయితే రుతుపవన ద్రోణి తూర్పుభాగం దక్షిణాది వైపు కొనసాగడంతో సముద్రం నుంచి తేమగాలులు ఉత్తర కోస్తాపైకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి.  అలాగే, ఈనెల 18న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది.

Updated Date - 2022-09-13T10:13:54+05:30 IST