కళ్లు గప్పి.. కోట్లు బుక్కి...

ABN , First Publish Date - 2021-06-20T07:02:55+05:30 IST

గోదావరి ఇసుక అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత కొత్త విధానానికి కొన్ని నెలల ముందు అనేక ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్లు అడ్డగోలుగా బరితెగించారు. వారికి కేటాయించిన రీచ్‌లకు అతిసమీపంలో అనుమతించని చోట కూడా కొందరు అధికారపార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా తవ్వి తరలించేశారు.

కళ్లు గప్పి.. కోట్లు బుక్కి...

  • గోదావరి ఇసుక రీచ్‌ల్లో కోట్ల విలువైన ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు
  • నలుగురు కాంట్రాక్టర్లకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ రూ.23.50 కోట్ల జరిమానా 
  • నెలలు గడుస్తున్నా జరిమానా చెల్లించడానికి అక్రమార్కులు ససేమిరా
  • తెరవెనుక ఇద్దరు అధికార పార్టీ కీలక నేతల అండదండలతో ధీమా
  • అపరాధ రుసుం వసూలవకపోవడంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగించిన అధికారులు
  • ఆస్తులు జప్తునకు మండపేట, ఆత్రేయపురం, రావులపాలెం తహశీల్దార్లకు ఆదేశాలు
  • ఈ ఉచ్చు నుంచి బయటపడేసేలా వాటాదారులైన కీలక నేతలతో కాంట్రాక్టర్ల బేరాలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

గోదావరిలో ఇసుక అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. అడ్డగోలుగా సరిహద్దులు ఉల్లఘించి ఇసుక విక్రయాలతో కోట్లలో సంపాదించిన ఆస్తిపై స్వాధీనం అస్త్రం వేలాడుతోంది. రూ.23.50కోట్ల జరిమానా చెల్లించాల్సి రావడంతో నలుగురు కాంట్రాక్టర్లు ఇప్పుడు అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ఆస్తుల జప్తు లేకుండా చేసుకునేందుకు రాయబేరాలు నడుపుతున్నారు. ఇన్నాళ్లుగా ఇసుక అక్రమ ఆదాయంలో తలాకొంత పంచుకున్నందున ఇప్పుడు చిక్కు నుంచి బయటపడేలా చేయమని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. మరోపక్క రూ.23.50 కోట్ల జరిమానా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల ఆస్తులను ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద జప్తు చేయడానికి రెవెన్యూశాఖ ఇప్పుడు రంగంలోకి దిగింది. దీంతో కాంట్రాక్టర్లు, వీరి ఇసుక అక్రమాలకు ఇన్నాళ్లుగా మద్దతు ఇచ్చిన కీలక నేతలకు వణుకుపడుతోంది. 

గోదావరి ఇసుక అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత కొత్త విధానానికి కొన్ని నెలల ముందు అనేక ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్లు అడ్డగోలుగా బరితెగించారు. వారికి కేటాయించిన రీచ్‌లకు అతిసమీపంలో అనుమతించని చోట కూడా కొందరు అధికారపార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా తవ్వి తరలించేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖ నగరాలకు రాత్రి వేళల్లో వందలాది లారీల్లో ఇసుక అమ్మి కోట్లలో సంపాదించారు. ముఖ్యంగా తాతపూడి, కపిలేశ్వరపురం, పులిదిండి,వేమగిరి ర్యాంపుల్లో సదరు కాంట్రాక్టర్లు జియోకోఆర్డినేట్‌లను ఉల్లంఘించి కోట్ల విలువైన లక్షల టన్నుల ఇసుక తవ్వి తరలించేశారు. దీనిపై గనులశాఖ కొన్ని నెలల కిందట క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి తాతపూడి ర్యాంపులో కాంట్రాక్టర్‌ సయ్యద్‌రబ్బానీ అనుమతి లేకుండా 35,623 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించినట్టు నిర్ధారించింది. కపిలేశ్వరపురం ర్యాంపులో కాంట్రాక్టర్‌ మల్లిడి భూపతిరెడ్డి 17,872 క్యూబిక్‌ మీటర్లు, పులిదిండి ర్యాంపులో వేముల శ్రీనివాసరావు కాంట్రాక్టరు 5,979, వేమగిరిలో రఘురాం హ్యూమ్‌ పైప్స్‌కు కంపెనీకి చెందిన కాంట్రాక్టర్‌ ఎన్‌.అనిల్‌కుమార్‌ 15,555 క్యూబిక్‌ మీటర్లు చొప్పున ఇసుక అక్రమంగా తవ్వినట్లు నిర్ధారించింది. ఈ అక్రమాలపై కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న జిల్లాసాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) మార్చి 23న చర్చించింది. అడ్డగోలుగా జరిపిన ఇసుక తవ్వకాలకుగాను కాంట్రాక్టర్‌ రబ్బానీకి రూ.10.68 కోట్లు, భూపతిరెడ్డికి రూ.5.36 కోట్లు, శ్రీనివాసరావుకు రూ.1.79 కోట్లు,  అనిల్‌కుమార్‌కు రూ.4.66 కోట్ల చొప్పున అందరికీ కలిపి రూ.23.50 కోట్లు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం జరిమానాకు సంబంధించి నోటీసులు పంపింది. వీరిలో ముగ్గురు కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాధానంపై డీఎల్‌ఎస్‌సీ సంతృప్తి చెందలేదు. కాగా నెలలు గడుస్తున్నా సదరు కాంట్రాక్టర్లు జరిమానా చెల్లింపును బేఖాతరు చేశారు. వీరిలో ముగ్గురు కాంట్రాక్టర్లు అయితే తమ వెనుక అధికార పార్టీ కీలక నేతల అండదండలు ఉండడంతో జరిమానాను తేలిగ్గా తీసుకున్నారు. తమ వెనుక ఉండి ఇసుక తవ్వించింది సదరు కీలక నేతలే కావడంతో వారే చూసుకుంటారనే ధీమాతో వ్యవహరించారు. రాజమహేంద్రవరానికి కొంచెం దూరంలో ఉన్న ఓ మంత్రి నియోజకవర్గం పరిధిలోని ఓ కాంట్రాక్టర్‌ తనకంటే తన వెనుక ఉన్న కీలక నేత ఎక్కువ లాభం పొందడం తో జరిమానా లేకుండా అధికారులతో మాట్లాడి ఆయనే బయట పడేయాలని పైరవీలు మొదలుపెట్టారు. కోనసీమకు చెందిన మరో కాంట్రాక్టర్‌ ఓ వైసీపీ ఎమ్మెల్యేకు ముందే ముడుపులు ఇచ్చి అక్రమ తవ్వకాలు చేయడంతో ఆయనదే భారం అన్నట్టు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడు రూ.23.50 కోట్ల జరిమానా వసూలు కాలేదు. ఈ మొత్తాన్ని చెల్లించే ఉద్దేశం లేక కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు జారిపోయారు. తమతో వాటా పంచుకున్న నేతలే తమను బయటపడేయాలంటూ భారం వారిపై వదిలేయడంతో ఇప్పుడు సదరు కీలకనేతలు ఉలిక్కిపడుతున్నారు. కాగా జరిమానా ఆలస్యం కావడంతో నలుగురు కాంట్రాక్టర్ల ఆస్తులు స్వాధీ నం చేసుకోవాలని మండపేట, రావులపాలెం, ఆత్రేయపురం తహశీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో నలుగురు కాంట్రాక్టర్ల స్వస్థలాల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయనేదానిపై వీఆర్వో లు ఆరా తీస్తున్నారు. ఆస్తుల జాబితా సిద్ధం అయ్యాక వేలం వేసి జరిమానా రాబట్టనున్నారు. కాగా ఆస్తుల స్వాధీన ఉచ్చు బిగుస్తుండడంతో కీలక నేతలపై కాంట్రాక్టర్లు ఒత్తిడి పెంచారు. వాటా లెక్కలు బయటపెట్టకుండా ఉండాలంటే తమను బయటపడేయాలంటూ పదేపదే పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఈనేపథ్యంలో వీరికి సహకరించకపోతే  తమ వాటా ఆదాయం ఎక్కడ బయటపెట్టేస్తారోననే భయం సదరు నేతలను వెన్నాడుతోంది. 

Updated Date - 2021-06-20T07:02:55+05:30 IST