గో‘దారి’లో గుట్టుగా

ABN , First Publish Date - 2021-09-30T06:51:53+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకంతో కూడిన వింత వింత బ్రాండ్ల మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.

గో‘దారి’లో గుట్టుగా

గోదావరిపై గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి యానాం మద్యం డంపింగ్‌

అర్ధరాత్రి తర్వాత రోజూ బోట్లలో రూ.25 లక్షలకుపైగా విలువైన సరుకు తరలింపు

ఆరు నెలలుగా గోదావరి మీదుగా పెరిగిన మద్యం రవాణా.. నెలకు కోట్లలో టర్నోవర్‌

ఏటిగట్టు వెంబడి కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు మీదుగా బ్రాండ్ల స్మగ్లింగ్‌

అటు ముమ్మిడివరం నుంచి కోనసీమలో అనేక మండలాలకు తరలింపు

అక్కడ తెచ్చి ఇక్కడ రెండు చేతులా ఆర్జిస్తున్న కొందరు అధికార పార్టీ నేతలు

తెర వెనుక తన మనుషులతో చక్రం తిప్పుతున్న ఓ వైసీపీ కీలక నేత

యానాం మద్యంతో కొన్నిచోట్ల విక్రయాలు పడిపోయినట్టు ఎక్సైజ్‌శాఖ గుర్తింపు

జిల్లాలో మద్యం అక్రమ వ్యాపారం అధికార  పార్టీలో కొందరికి కాసుల పంట పండిస్తోంది. ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని పక్క రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ సదరు నేతలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఎక్కడికక్కడ రహస్య ముఠాలు ఏర్పాటు  చేసుకుని కోట్లలో టర్నోవర్‌ చేస్తున్నారు. ఇంతకాలం తెలంగాణ మద్యాన్ని లారీలు,  కార్లలో తరలిస్తుండడం ఒకెత్తయితే ఇప్పుడు ఏకంగా గోదావరి నదిని అడ్డాగా మార్చుకుని చెలరేగిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో వందల కేసుల్లో సరుకు పడవల్లో ఏటిగట్ల వెంబడి    స్థావరాలకు చేర్చేస్తున్నారు. అక్కడి నుంచి జిల్లా నలుమూలలకు తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా కె.గంగవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు వరకు,అటు పక్క ముమ్మిడివరం మీదుగా కోనసీమలోకి గోదావరిలో బోట్ల ద్వారా యానాం మద్యాన్ని తరలించి తోటల్లో డంప్‌ చేస్తున్నారు. దీని వెనుక ఆయా మండలాల్లో కొందరు అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతుండగా, వీరందరికి ఓ వైసీపీ కీలక నేత అండదండలందిస్తున్నారు. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకంతో కూడిన వింత వింత బ్రాండ్ల మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందుబాబులు ఎన్నో ఏళ్లుగా తమకు అలవాటైన ప్రముఖ బ్రాండ్ల కోసం అర్రులు చాస్తున్నారు. ఇదే అదనుగా అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల బంధువులు, వారి అనుచరులు గడచిన రెండేళ్లుగా తెలంగాణ నుంచి ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ రెండింత లకు విక్రయిస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. అటు రావులపాలెం, ఇటు ఏజెన్సీలో కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు మీదుగా కార్లు, లారీలు, వ్యాన్లు, ప్రైవేటు బస్సుల్లో జిల్లాలోకి తెలంగాణ మద్యం పెద్ద ఎత్తున డంపింగ్‌ అవుతోంది. వీటిని డోర్‌డెలివరీ రూపంలో కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు అధిక ధరకు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకపక్క ఈ అక్రమ మద్యం వ్యాపారం మూడు బాటిళ్లు ఆరు నిబ్బులుగా సాగుతుండగా, ఇప్పుడు అక్రమార్కులు మరో కొత్తదారి వెదికారు. అదే గోదావరి నది. జిల్లాను ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మద్యం చాలా చవక. పైగా ధర కూడా అక్కడికి ఇక్క డికి సగానికిపైగా వ్యత్యాసం ఉంది. దీంతో ఇప్పుడు అధికార       పార్టీలో కొందరు నేతలు యానాంలో హోల్‌సేల్‌ మద్యం వర్తకుల నుంచి వందల కేసుల్లో చీప్‌లిక్కర్‌, బీర్లు, బ్రాంది, విస్కీ అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ కొన్న సరుకును రాత్రి పన్నెండు తర్వాత పడవల్లో తరలిస్తున్నారు. ముఖ్యంగా యానాం నుంచి కె.గంగవరం, కపిలేశ్వరం, ఆలమూరు మీదుగా రోజు రెండు బోట్లలో గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని తరలిస్తున్నారు. ఇటుపక్క ముమ్మిడివరం నుంచి కోనసీమలోకి డంపింగ్‌ చేస్తున్నారు. ఇలా రోజుకు సుమారుగా రూ.25 లక్షలకు పైగా విలువైన యానాం సరుకు గోదారి మీదుగా గుట్టుగా తరలిపోతోంది. ముఖ్యంగా యానాంలో చీప్‌లిక్కర్‌ రూ.60కు దొరుకుతోంది. అదే చీప్‌లిక్కర్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.150కి విక్రయిస్తోంది. కింగ్‌ లూయిస్‌ బ్రాండ్‌ యానాంలో ఫుల్‌ రూ.600కాగా, జిల్లాలో రూ.1,600కు ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇవికాకుండా యానాంలో రాయల్‌స్టోన్‌, బాంబేడీలక్స్‌, బ్లెండర్‌స్పైడ్‌, రాయల్‌ఛాలెంజ్‌, రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, పలురకాల బీర్లు, వోడ్కా దొరుకుతాయి. కానీ జిల్లాలో ఈ ప్రముఖ బ్రాండ్లు ఏవీ దొరకవు. ఈ నేపథ్యంలో యానాంలో లభ్యమయ్యే ప్రముఖ బ్రాండ్లను రెండు నియోజకవర్గాలకు చెందిన కొందరు వైసీపీ నేతలు హోల్‌సేల్‌ డీలర్ల వద్ద ముందే కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఏటిగట్లు వెంబడి ముమ్మిడివరం మీదుగా అల్లవరం, కొత్తపేటతోపాటు కోనసీమలోని అనేక మండలాలకు, ఇటువైపు కె.గంగవరం నుంచి కపిలేశ్వరపురం, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం, అనపర్తి వరకు సరుకు డంపింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఏటిగట్లను ఆనుకుని ఉన్న మండలాల్లో యానాం మద్యాన్ని కొబ్బరితోటల్లో గుట్టుచప్పుడు కాకుండా దించి అక్కడి నుంచి కావలసిన ప్రాంతాలకు తరలించి యానాం రేటుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు. గడచిన ఆరు నెలలుగా గోదావరి మీదుగా పడవల్లో మద్యం తరలింపు ఎక్కువైంది. నెలకు కోట్లలో ఈ వ్యాపారం జరుగుతోంది. తెలంగాణ మద్యంపై ప్రస్తుతం సెబ్‌ అధికారు ల నిఘా పెరగడంతో ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అనుచర ముఠాల ద్వారా గోదావరిని సురక్షిత స్థావరంగా ఎంచుకున్నారు. నదీ మార్గం ద్వారా అక్రమ మద్యం తరలించినా నిఘా ఉండదనే ధీమాతో స్మగ్లింగ్‌ దందా నడిపిస్తున్నారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారి వైసీపీలో చేరి ఇటీవల పదవి దక్కించుకున్న ఓ నేత కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. గడచిన నాలుగు నెలలుగా కపిలేశ్వరపురం, కె.గంగవరం, ఆలమూరు మండలాల్లో ప్రభుత్వ మద్యం విక్రయాలు 25 శాతం పడిపోయిన ట్టు ఎక్సైజ్‌శాఖ గుర్తించింది. అసలు విషయం అర్థంకాక కారణాలు అన్వేషించే పనిలో పడడం విశేషం.



Updated Date - 2021-09-30T06:51:53+05:30 IST