గోదావరి జలాల ఎత్తిపోతలకు సిద్ధం

ABN , First Publish Date - 2020-02-28T11:47:53+05:30 IST

అన్నపూర్ణ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు నీటిని ఎత్తిపోయడానికి అంతా సిద్ధమైంది. గోదావరి నీటితో బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కాళేశ్వరం పథకాన్ని

గోదావరి జలాల ఎత్తిపోతలకు సిద్ధం

ఇల్లంతకుంట, ఫిబ్రవరి 27: అన్నపూర్ణ ప్రాజెక్టులోకి  గోదావరి జలాలు నీటిని ఎత్తిపోయడానికి అంతా సిద్ధమైంది. గోదావరి నీటితో బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మధ్యమానేరు నుంచి నీటిని సర్జిపూల్‌కు.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీరు చేరుతోంది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి రంగనాయక సాగర్‌.. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మలకు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిడ్‌ మానేరు నుంచి గ్రావిటీ, టన్నెల్‌ ద్వారా 4వందల క్యూసెక్కుల నీటిని సర్జిపూల్‌కు పంపిస్తారు. శుక్రవారం నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ మిడ్‌మానేరు ను పరిశీలించనున్నారు. తర్వాత సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలంలోని రంగనాయక్‌ సాగర్‌ పరిశీలించిన అనంతరం ఇరు జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఇదే సమావేశంలో గోదావరి జలాలు ఎప్పుడు ఎత్తిపోయాలన్నది నిర్ణయించే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.


అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తే తొలుత ముంపునకు గురయ్యే అనంతగిరిలోని ఎస్సీ కాలనీవాసులను ఖాళీ చేయించే ఏర్పాట్లలో రెవెన్యూ అధికారులు నిమగ్నం అయ్యారు. కొత్త ఎస్సీ కాలనీలో అందరు ఖాళీ చేయగా కేవలం 6 కుటుంబాలు, పాత ఎస్సీ కాలనీలో 20కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిర్వాసితులను ఖాళీ చేయించడానికి తహసీల్దార్‌లు సోలిపురం రాజారెడ్డి, దార ప్రసాద్‌, సదానందం, శ్రీకాంత్‌లు నాలుగు రోజులుగా గ్రామంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేసిన వారికి రూ.50వేల సహాయం అందిస్తున్నారు. పునరావాస కాలనీలో వసతులు పూర్తి అయినప్పటికినీ ఎస్సీలకు కేటాయించిన ఇండ్ల స్థలాలపై కోర్టుస్టే ఉండటం వల్ల తాత్కాలికంగా ఇంటి స్థలాలు కేటాయించారు. నిర్వాసితులు కొంతమంది అక్కడ తాత్కాలికంగా ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

Updated Date - 2020-02-28T11:47:53+05:30 IST