Apr 21 2021 @ 00:46AM

వెయ్యేళ్లు వెనక్కి వెళ్లి... భయపెడుతుందీ రాణి!

సన్నీ లియోన్‌ ఓ చారిత్రక చిత్రం అంగీకరించారు. అదీ హారర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా! అందులో ఆమె రాణిగా కనిపించనున్నారు. అసలు వివరాల్లోకి వెళితే... సతీశ్‌, సంజన ప్రధాన పాత్రల్లో తమిళ దర్శకుడు ఆర్‌. యువన్‌ ఓ ఫాంటసీ అండ్‌ హిస్టారికల్‌ హారర్‌ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం, వెయ్యేళ్ల క్రితం... రెండు కాలాల్లో జరిగే కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో సన్నీ లియోన్‌ రాణిగా నటించడానికి అంగీకరించారు. ఆమెపై సన్నివేశాలను ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జూన్‌లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందంగా కనిపిస్తూనే భయపెట్టే విధంగా రాణి పాత్ర, సన్నివేశాలను తీర్చిదిద్దారట. తమిళంలో సన్నీ లియోన్‌ నటిస్తున్న రెండో చారిత్రక చిత్రమిది. గతంలో ‘వీరమహాదేవి’ చేశారు. అయితే, అదింకా విడుదల కాలేదు.