అన్నప్రాశనకు వెళ్తూ అనంతలోకాలకు

ABN , First Publish Date - 2021-04-03T08:15:11+05:30 IST

బంధువుల ఇంట్లో అన్నప్రాశన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

అన్నప్రాశనకు వెళ్తూ అనంతలోకాలకు

  • నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • సర్పంచి కుటుంబంలో నలుగురి మృతి
  • మృతుల్లో ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు

నిడమనూరు, ఏప్రిల్‌ 2: బంధువుల ఇంట్లో అన్నప్రాశన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్‌ తరి శ్రీనివా్‌సతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన పుచ్చకాయల వ్యాపారి కొల్లి నాగరాజు.. టాటా ఏస్‌ వాహనంలో పుచ్చకాయలతో స్వగ్రామానికి వెళుతున్నాడు. అదే సమయంలో మిర్యాలగూడ నుంచి హాలియా వైపు వెళ్తున్న బియ్యం లారీ.. టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టి సుమారు 50 అడుగుల దూరం లాక్కెళ్లి డివైడర్‌ను దాటింది. అదే సమయంలో నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో అత్తగారింట్లో అన్నప్రాశన కార్యక్రమానికి బైక్‌పై భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తున్న తెప్పలమడుగు సర్పంచ్‌ తరి శ్రీనివాస్‌ బైక్‌.. ప్రమాదవశాత్తూ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివా్‌స(32)తో పాటు ఆయన భార్య విజయ(30) అక్కడికక్కడే మృతి చెందారు. 


శ్రీనివాస్‌ కుమార్తె విద్యశ్రీ(5), కుమారుడు కన్నయ్య(3)తోపాటు టాటా ఏస్‌ వాహనంలో ఉన్న కొల్లి నాగరాజు, ఆయన కుమారుడు యశ్వంత్‌, డ్రైవర్‌ దస్తగిరి గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్‌ కుమారుడు, కుమార్తె మృతి చెందారు. నాగరాజు, యశ్వంత్‌, దస్తగిరి చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు. నిడమనూరులో కోదాడ-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఒకే వైపులో వాహనాలు ప్రయాణిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - 2021-04-03T08:15:11+05:30 IST