పాకిస్థాన్‌లోనే రియాజ్‌ భత్కల్‌

ABN , First Publish Date - 2020-09-21T06:48:18+05:30 IST

హైదరాబాద్‌ గోకుల్‌చాట్‌, లుంబినీపార్కు జంటపేలుళ్లలో ప్రధాన నిందితుడు, ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్‌ అహ్మద్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ షా బండారీ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ కరాచీలోనే ఉన్నట్లు తేలింది...

పాకిస్థాన్‌లోనే రియాజ్‌ భత్కల్‌

  • గోకుల్‌ చాట్‌, లుంబినీ పార్కు ఉగ్ర దాడుల సూత్రధారి
  • కరాచీలో వీఐపీ హోదా.. మరో 20 మంది ఉగ్రవాదులు కూడా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: హైదరాబాద్‌ గోకుల్‌చాట్‌, లుంబినీపార్కు జంటపేలుళ్లలో ప్రధాన నిందితుడు, ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్‌ అహ్మద్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ షా బండారీ అలియాస్‌ రియాజ్‌ భత్కల్‌ కరాచీలోనే ఉన్నట్లు తేలింది. అక్కడి డిఫెన్స్‌ కాలనీలో అతడు వీఐపీ హోదాలో నివసిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ - ఎఫ్‌ఏటీఎఫ్‌) వర్గాలు స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించాయి.


కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన రియాజ్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. నిషేధిత స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)లో యాక్టివ్‌గా ఉండేవాడు. ఆ తర్వాత తన సోదరులు ఇక్బాల్‌ భత్కల్‌, యాసీన్‌ భత్కల్‌తో కలిసి ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్ర సంస్థను స్థాపించాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. 2007-13 మధ్య కాలంలో హైదరాబాద్‌తోపాటు.. జైపూర్‌, అహ్మదాబాద్‌, ఢిల్లీ నగరాల్లో జరిగిన పేలుళ్ల కేసుల్లో ఇతడు కీలక నిందితుడు. 2008లో షార్జాకు పారిపోయాడు. అక్కడి నుంచే భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్ని, అమలు చేశాడు. భారత నిఘా సంస్థ (ఐబీ) అతడి ఆచూకీ కనుగొని, అరెస్టు చేయడానికి సిద్ధమవ్వగా.. అప్పటికే పాకిస్థాన్‌ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) అతడిని కరాచీకి తరలించింది. అప్పటి నుంచి పాక్‌ సర్కారు అతడికి వీఐపీ హోదాలో సేవలందిస్తోంది. 2011లో రియాజ్‌ను చంపానంటూ అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటారాజన్‌ ప్రకటించాడు.


బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్న రియాజ్‌ ఫొటోను ఐబీకి పంపాడు. కానీ, అదంతా ఫొటోషాప్‌ మాయ అని అధికారులు గుర్తించారు. 2014లో కూడా రియాజ్‌ భత్కల్‌ను అక్కడి పోలీసులు కాల్చిచంపారనే వార్తలు వచ్చినా.. అవన్నీ వదంతులేనని భారత నిఘా వర్గాలు తేల్చాయి. తాజాగా ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో రియాజ్‌ భత్కల్‌ ఉండటాన్ని బట్టి.. పాకిస్థాన్‌ అతడిని ఇంకా కరాచీలోనే ఉంచి, వీఐపీ హోదాలో చూసుకుంటోందని తెలుస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో ఉన్న మరో 20 మందిలో.. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఖలిస్థాన్‌ వేర్పాటువాది రంజీత్‌సింగ్‌ నీతా, బాబర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బీకేఐ) చీఫ్‌ వాధ్వా సింగ్‌, కరడుగట్టిన ఉగ్రవాదులు మిర్జా షాదాబ్‌ బేగ్‌, ఆసిఫ్‌ హసన్‌ సిద్ధిబాపా తదితరులు ఉన్నారు. ఇలా ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ.. హింసను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ఇప్పటికే ‘గ్రే’లిస్టులో పెట్టింది. నిజానికి ఇది అంతర్జాతీయంగా ఆ దేశానికి అవమానకరం. నిధుల సహకారంపై ఆ దేశంపై ఆంక్షలు ఉంటాయి. దీనిపై పాకిస్థాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తీవ్రంగా హెచ్చరించింది. పద్ధతి మార్చుకోకుంటే.. జూన్‌లో జరిగే ప్లీనరీలో బ్లాక్‌లిస్టులో పెడతామని తెలిపింది.


Updated Date - 2020-09-21T06:48:18+05:30 IST