బంగారం ‘బేర్‌’?

ABN , First Publish Date - 2021-03-06T06:32:16+05:30 IST

బులియన్‌ మార్కెట్లో బంగారం ‘బేర్‌’మంటోందా...? అవుననే అంటున్నారు నిపుణులు. రాబోయే కొద్ది కాలంలో 10 గ్రాముల బంగారం రూ.41,500-రూ.42,000 వరకు తగ్గవచ్చునని వారి అంచనా. అమెరికాలో బాండ్లపై రాబడులు పెరగడం,

బంగారం ‘బేర్‌’?

టార్గెట్‌ రూ.42,000


న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో బంగారం ‘బేర్‌’మంటోందా...? అవుననే అంటున్నారు నిపుణులు. రాబోయే కొద్ది కాలంలో 10 గ్రాముల బంగారం రూ.41,500-రూ.42,000 వరకు తగ్గవచ్చునని వారి అంచనా. అమెరికాలో బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్‌ క్షీణత బంగారం శుక్రవారం నాడు బేరిష్‌ స్థితిలో ప్రవేశించడానికి కారణమన్నది వారి అభిప్రాయం. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కాలంలో చారిత్రక గరిష్ఠ స్థాయిలకు దూసుకుపోయిన బంగారం ధర గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న విషయం విదితమే. ఈటీఎ్‌ఫలలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కారణంగా ధరలు ఏ మాత్రం ఎదుగుదల లేకుండా స్తంభించిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలు పెరగడం, వడ్డీ రేట్లలో స్థిరత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పొజిషన్లు తగ్గించుకుంటూ రావడం, మరింత మెరుగైన అవకాశాల కోసం అన్వేషించడం కూడా బంగారం బేరిష్‌ స్థితిలో ప్రవేశించేందుకు కారణమయ్యాయి. గత ఏడాది మొత్తంలో ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తూ వచ్చిన బంగారం ఆగస్టు నాటికి జీవిత కాల గరిష్ఠ స్థాయి రూ.56,191ని తాకింది. అప్పటి నుంచి అక్టోబరు, డిసెంబరు మినహా మొత్తం ఏడు నెలల కాలంలో ఐదు నెలల్లో బంగారం ధర క్షీణతనే నమోదు చేసింది. 


ఈటీఎ్‌ఫలకు భారీ నష్టం

ఒక్క ఫిబ్రవరి నెలలోనే బంగారం ఈటీఎ్‌ఫల పరిమాణం రెండు శాతం (84.7 టన్నులు) మేరకు పడిపోయిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీఆర్‌ సోమసుందరం అన్నారు. ప్రపంచ స్థాయిలో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు 3681 టన్నులు పడిపోయాయని, దీని విలువ 20,700 కోట్ల డాలర్లని చెబుతున్నారు. ఇది గత ఏడాది జూన్‌ స్థాయికి సమానం. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.522 క్షీణించి రూ.43,887 వద్ద నిలిచింది.

Updated Date - 2021-03-06T06:32:16+05:30 IST