Advertisement
Advertisement
Abn logo
Advertisement

Vijayawada: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 57 మంది..!

బంగారం మాటున బండారం

చౌక బంగారం కేసులో బయటపడిన అసలు నిజాలు

57 మంది నుంచి రూ.8కోట్లు వసూలు

కీలక నిందితురాలు నాగమణి అరెస్టు

తక్కువ ధరకు బంగారం బిస్కెట్లంటూ మోసం

పోలీసులనూ తప్పుదారి పట్టించే యత్నం

ఆన్‌లైన్‌ రమ్మీ ఆటకు సర్వం సమర్పయామి

కిలాడీ లేడీపై మూడు పీఎస్‌ల్లో కేసులు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఒకరిద్దరు కాదు.. ఏకంగా 57 మంది.., వేలు లక్షలు కాదు.. అక్షరాలా రూ.8కోట్లు.. తక్కువ ధరకే బంగారం బిస్కెట్‌ ఆశచూపి కిలాడీ లేడీ దోచుకున్న సొత్తు ఇది. రూ.కోటీ43లక్షలను ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి పోగొట్టుకుని, కిడ్నాప్‌ డ్రామాలతో కలకలం సృష్టించి, నమ్మినవారిని మోసం చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నాగమణి కేసులో వాస్తవాలను పోలీసులు బుధవారం తెలిపారు. 


బంగారం బిస్కెట్లు ఎరగా వేసి 57 మందిని నిలువునా ముంచేసి రూ.8కోట్లు కాజేసిన కిలాడీ లేడీని సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను పశ్చిమ ఇన్‌చార్జి డీసీపీ బాబూరావు, ఏసీపీ మేడిశెట్టి వెంకటేశ్వరరావు, సీసీఎస్‌ ఏసీపీ కొల్లు శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పక్కుర్తి సింహాద్రి నాగమణి అలియాస్‌ మౌనిక భర్తతో మనస్పర్థలు పెట్టుకుని విడిపోయింది. తునిలో ఉండగా చీటీలు వేసి పలువురిని ముంచేసింది. తర్వాత తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని అమ్మి బకాయిలు తీర్చింది. 2006వ సంవత్సరంలో తుని నుంచి రైల్లో వస్తుండగా, విజయవాడకు చెందిన సీటీఐ సండ్రాన వెంకటేశ్వరరావుతో పరిచయం పెంచుకుంది. వెంకటేశ్వరరావు, నాగమణి కలిసి సీతారామపురం జంక్షన్‌లో లక్ష్మీహోమ్‌ ల్యాండ్‌ అపార్టుమెంట్‌లో 13 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 


అసలు ఉద్యోగం సీటీఐ.. ప్రచారం మాత్రం కస్టమ్స్‌ అధికారి

నాగమణి, వెంకటేశ్వరరావు కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తక్కువ ధరకు బంగారం బిస్కెట్‌ను ఇవ్వాలన్న పథకాన్ని రూపొందించుకున్నారు. రైల్వేశాఖలో పనిచేస్తున్న వారి నుంచి డబ్బు వసూలు చేయడానికి తనకు ఉన్న పరిచయాలను వెంకటేశ్వరరావు ఉపయోగించుకున్నాడు. ఇతరుల నుంచి డబ్బు వసూలు చేయడానికి, నమ్మకం కలిగించడానికి వెంకటేశ్వరరావును నాగమణి కస్టమ్స్‌ అధికారిని చేసింది. ఇద్దరూ కలిసి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి వెళ్లేవారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులకు డబ్బు, డ్రైఫ్రూట్స్‌ ఇచ్చేవారు. 100 గ్రాముల బంగారం బిస్కెట్‌ను రూ.4లక్షలకు ఇస్తామని కొందరికి చెప్పింది. ఇతరుల నుంచి డబ్బు కట్టిస్తే అందులో కమీషన్‌ ఇస్తానని మరికొందరికి చెప్పింది. వెంకటేశ్వరరావు సీటీఐ కావడంతో పదిమంది టీటీఐల నుంచి రూ.లక్షల్లో సొమ్ము వసూలు చేశారు. వారి మాటలు నమ్మి  దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది తమ బంధువులు, మిత్రులతో డబ్బు కట్టించారు. ఇలా మొత్తం 57 మంది నుంచి రూ.8కోట్ల వరకు వసూలు చేశారు. 


రూ.4.50 లక్షలు, 219 గ్రాముల బంగారం స్వాధీనం

బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడం, తిరిగి డబ్బు కూడా చెల్లించకపోవడంతో బాధితులు సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. అయితే, నాగమణి మళ్లీ నాటకమాడింది. ఈనెల ఆరో తేదీన తనను కొంతమంది కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేయగా, అలాంటిదేమీ కనిపించలేదు. వెంకటేశ్వరరావు, నాగమణిలను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గుండెనొప్పి వచ్చిందని వెంకటేశ్వరరావు రైల్వే ఆస్పత్రిలో చేరిపోయాడు. నాగమణిని సుదీర్ఘంగా విచారణ చేయగా, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగమణి పేరుతో రెండు, వెంకటేశ్వరరావు పేరుతో నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వాటిని పరిశీలించగా, అందులో మొత్తం రూ.14కోట్ల22లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు తేలింది. నాగమణి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి రూ.కోటీ43లక్షలు పోగొట్టుకున్నట్టు ధ్రువీకరించారు.


నాగమణి మాటలు నమ్మి కొంతమంది బంగారం ఆభరణాలను ఆమెకు ఇచ్చారు. వాటిని మణప్పురంతో పాటు ఇతర ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టుపెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేసింది. నాగమణిని అరెస్టు చేసిన పోలీసులు రూ.4.50 లక్షలు, వివిధ ఫైనాన్స్‌ కంపెనీల్లో తాకట్టుపెట్టిన 219 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నాగమణిపై వన్‌టౌన్‌, కొత్తపేట, సత్యనారాయణ పురం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వసూలు చేసిన డబ్బును ఏం చేసిందన్న విషయంపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, త్వరలో ఆమెను పోలీసు కస్టడీకి తీసుకుంటామని ఇన్‌చార్జి డీసీపీ బాబూరావు తెలిపారు. తనపై దాడి చేశారని నాగమణి చేసిన ఫిర్యాదుపై టీటీఐలు వినయ్‌, సుబ్బారావు, ఆకుల రాఘవేంద్రరావుపైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

నాగమణి అరెస్టు వివరాలు తెలియజేస్తున్న పోలీసులు


Advertisement
Advertisement