బంగారం మోజు తగ్గింది

ABN , First Publish Date - 2020-07-31T07:32:49+05:30 IST

దేశంలో బంగారం డిమాండు, దిగుమతి రెండూ కొవిడ్‌-19 ప్రభావం వల్ల భారీగా తగ్గాయి.

బంగారం మోజు తగ్గింది

  • జూన్‌ త్రైమాసికంలో డిమాండు 70 శాతం డౌన్‌
  • ధన త్రయోదశి వరకు ఇంతే 

న్యూఢిల్లీ: దేశంలో బంగారం డిమాండు, దిగుమతి రెండూ కొవిడ్‌-19 ప్రభావం వల్ల భారీగా తగ్గాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన అంతరాయాలతో పాటుగా ప్రజలు ఖర్చుల విషయంలో అప్రమత్తం కావడం ఇందుకు కారణం. మొత్తం బంగారం దిగుమతి 11.6 టన్నులకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దిగుమతి 247.4 టన్నులతో పోల్చితే ఇది 95 శాతం తక్కువ. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో డిమాండు 63.7 టన్నులకు పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండు 213.2 టన్నులుంది. ‘క్యు2 బంగారం డిమాండు ధోరణులు’ పేరిట ఆ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. విలువపరంగా చూసినా బంగారం డిమాండు గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు తగ్గిందని తెలిపింది. దేశంలో నెలకొన్న భయంతో కూడి న అస్థిర పరిస్థితులు, వివాహాలు వాయిదా పడడం బంగారం డిమాండు గణనీయంగా తగ్గడానికి కారణమని డబ్ల్యుజిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇండియా సోమసుందరం అన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం కొనుగోళ్లు కాస్తంత పుంజుకున్నా పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత గాని అసలు ధోరణి స్పష్టం కాదని ఆయన చెప్పారు. ధన త్రయోదశి నాటికి పరిస్థితులు మెరుగుపడి కొనుగోళ్లు పుంజుకోవచ్చునని వ్యాపారులు ఆశావహంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. 


నివేదిక ముఖ్యాంశాలు...

  • బంగారం ఆభరణాల డిమాండు 74 శాతం పడిపోయి 168.6 టన్నుల నుంచి 44 టన్నులకు పడిపోయింది. 
  • ఠవిలువపరంగా డిమాండు రూ.49,380 కోట్ల నుంచి రూ.18,350 కోట్లకు దిగజారింది.

  • పెట్టుబడిగా బంగారం డిమాండు కూడా 56 శాతం తగ్గి 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు దిగజారింది. విలువపరంగా క్షీణత రూ.13,040 కోట్ల నుంచి రూ.8,250 కోట్లు. 

  • దేశంలో మొత్తం రీసైకిల్‌ చేసిన బంగారం సైతం 64 శాతం పడిపోయి 37.9 టన్నుల నుంచి 13.8 టన్నులకు తగ్గింది.  

  • జూన్‌ 30తోనే ముగిసిన ఆరు నెలల కాలంలో కూడా డిమాండు 56 శాతం తగ్గి 165.6 టన్నులకు పడిపోయింది. 

  • డిమాండు తగ్గినప్పటికీ ధరలు పెరిగిపోతూ ప్రస్తుతం 10 గ్రాములు రూ.52,000 స్థాయిలో ఉండడం కూడా ప్రజల్లో నిరాసక్తతకు కారణం. 

Updated Date - 2020-07-31T07:32:49+05:30 IST