పసిడి డిమాండ్‌ 30శాతం డౌన్‌

ABN , First Publish Date - 2020-10-30T06:42:29+05:30 IST

ఈ ఏడాది మూడో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబరు) భారత్‌లో పసిడి గిరాకీ 86.6 టన్నులుగా నమోదైందని...

పసిడి డిమాండ్‌ 30శాతం డౌన్‌

  • జూలై-సెప్టెంబరు కాలానికి 
  • డబ్ల్యూజీసీ నివేదిక విడుదల 


ముంబై: కరోనా సంక్షోభం, అధిక ధరల కారణంగా గిరాకీ లేక బంగారం వెలవెలబోతోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబరు) భారత్‌లో పసిడి గిరాకీ 86.6 టన్నులుగా నమోదైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన 123.9 టన్నుల డిమాండ్‌తో పోలిస్తే 30 శాతం తగ్గిందని తాజా నివేదికలో వెల్లడించింది. విలువ ప్రకారం.. గడిచిన మూడు నెలల్లో గోల్డ్‌ డిమాండ్‌ 4 శాతం తగ్గి రూ.39,510 కోట్లకు పరిమితమైంది. 2019లో ఇదే సమయానికి రూ.41,300 కోట్లుగా ఉంది. ‘‘కరోనా సంబంధిత అంతరాయాలు, అధిక ధరలతోపాటు వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం పసిడి గిరాకీ తగ్గుదలకు ప్రధాన కారణం. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులు, ఆగస్టులో ధరలు గణనీయంగా తగ్గడం బంగారం కొనుగోళ్లకు కొంతమేర తోడ్పడ్డాయి. దాంతో మూడో త్రైమాసికానికి గిరాకీ రెండో క్వార్టర్‌తో పోలిస్తే మెరుగైంద’’ని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ అన్నారు. 


ప్రపంచ డిమాండ్‌లో 19శాతం తగ్గుదల 

గడిచిన మూడు నెలలకు ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీ 19 శాతం తగ్గి 892.3 టన్నులకు పరిమితమైందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2009లో సెప్టెంబరు త్రైమాసికం తర్వాత మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి డిమాండ్‌ అని తెలిపింది. 


ముఖ్యాంశాలు

  1. ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)తో పోలిస్తే మాత్రం డిమాండ్‌ పుంజుకుంది. రెండో క్వార్టర్‌లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 70 శాతం క్షీణించి 64 టన్నులకు పరిమితమైంది. 
  2. ఈ సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల్లో బంగారు ఆభరణాల డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 48 శాతం తగ్గి 52.8 టన్నులకు జారుకుంది. విలువపరంగా 29 శాతం క్షీణించి రూ.24,100 కోట్లకు పడిపోయింది.
  3. వర్షాల సీజన్‌, పితృ పక్షం, అధిక మాసం వంటి కారణాల వల్ల మూడో త్రైమాసికంలో ఆభరణాల కొనుగోళ్లు తక్కువగా నమోదవడం సాధారణమే. కరోనా కారణంగా పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లోనూ కొనుగోళ్లు జరగలేదు. 
  4. పసిడిలో పెట్టుబడులు మాత్రం 52 శాతం పెరిగి 33.8 టన్నులకు చేరుకుంది. విలువపరంగా బంగారంలో ఇన్వె్‌స్టమెంట్‌ 107 శాతం వృద్ధి చెంది రూ.15,410 కోట్లకు ఎగబాకింది. 
  5. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఇన్వె్‌స్టమెంట్‌ కోసం గోల్డ్‌ బార్స్‌, కాయిన్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా బంగారం కొనుగోళ్లు, గోల్డ్‌ ఈటీఎ్‌ఫలలో పెట్టుబడులూ పుంజుకున్నాయి. 
  6. జూలై-సెప్టెంబరు కాలానికి దేశంలో 41.5 టన్నుల బంగారం రీసైక్లింగ్‌ జరిగింది. గత ఏడాదిలో ఇదే కాలానికి జరిగిన 36.5 టన్నుల రీసైక్లింగ్‌తో పోలిస్తే 14 శాతం పెరిగింది. లోహం ధరల అనూహ్య పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. 
  7. లాక్‌డౌన్‌ కారణంగా రెండో త్రైమాసికంలో కేవ లం 9 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి కాగా.. మూడో త్రైమాసికంలో 90.5 టన్నులకు పెరిగింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులు, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు క్రమంగా తొలగడం ఇందుకు కారణం. 

Updated Date - 2020-10-30T06:42:29+05:30 IST