ఇంట్లోనే గోల్డ్‌ ఫేషియల్‌!

ABN , First Publish Date - 2021-02-24T06:17:02+05:30 IST

ఇంట్లో ఉండే వస్తువులతో ముఖానికి గోల్డ్‌ ఫేషియల్‌ చేసుకోవచ్చు. పార్లర్‌కి వెళ్లి మీరు చేయించుకునే గోల్డ్‌ ఫేషియల్‌ కన్నా ఈ వంటింటి గోల్డ్‌ ఫేషియల్‌ ముఖానికి మరింత వన్నె తెస్తుంది. పైగా ఈ ఫేషియల్‌కి వాడే వస్తువుల్లో ఎలాంటి రసాయనాలూ ఉండవు...

ఇంట్లోనే గోల్డ్‌ ఫేషియల్‌!

ఇంట్లో ఉండే వస్తువులతో  ముఖానికి గోల్డ్‌ ఫేషియల్‌ చేసుకోవచ్చు. పార్లర్‌కి వెళ్లి మీరు చేయించుకునే గోల్డ్‌ ఫేషియల్‌ కన్నా ఈ వంటింటి గోల్డ్‌ ఫేషియల్‌ ముఖానికి మరింత వన్నె తెస్తుంది. పైగా ఈ ఫేషియల్‌కి వాడే వస్తువుల్లో ఎలాంటి రసాయనాలూ ఉండవు. చర్మానికి ఇది ఇన్‌స్టంట్‌ గ్లోను ఇస్తుంది. అది ఎలాగంటే...



  1. మొదట  క్లెన్సింగ్‌ కోసం రెండు  టేబుల్‌స్పూన్ల పాలు తీసుకోవాలి. 
  2. స్క్రబ్బింగ్‌కు ఒక  టేబుల్‌స్పూను తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ చక్కెర, అర టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం తీసుకుని (నిమ్మరసం పడని వాళ్లు దాన్ని వాడనక్కర్లేదు) ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. స్క్రబ్బర్‌ రెడీ అయింది.
  3. ఇక ఫేస్‌ మాస్కును కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక టేబుల్‌ స్పూను తేనె, అరటేబుల్‌ స్పూను నిమ్మరసం,  అరటేబుల్‌ స్పూను కన్నా కూడా తక్కువగా కొబ్బరినూనె, చిటికెడు పసుపు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి.(పసుపు పడని వాళ్లు దానికి బదులు సెనగపిండి వాడొచ్చు.) దానితోపాటు ఒక టేబుల్‌ స్పూను పెరుగును ఈ మిశ్రమంలో వేసి పేస్టులా చేసుకోవాలి. 
  4. ఇప్పుడు క్లెన్సింగ్‌ కోసం సిద్ధంచేసుకున్న పాలలో దూది ముంచి దానితో ముఖం, మెడ భాగాలపై సున్నితంగా మర్దనా చేయాలి. ఆ  తర్వాత నీళ్లల్లో తడిపిన వస్త్రంతో ముఖాన్ని కింద నుంచి పైకి తుడవాలి. తర్వాత రెడీ చేసిపెట్టుకున్న స్క్రబ్‌ని రెండు చేతులతో ముఖానికి, మెడ, చెవి భాగాలకు పట్టించుకుని సున్నితంగా మసాజ్‌ చేయాలి. 
  5. ఫేషియల్‌ చేసుకుని చాలా రోజులు అయినవాళ్లు  క్లెన్సింగ్‌ ఐదు నిమిషాలు, స్క్రబ్బింగ్‌ పది నిమిషాలు చేసుకోవచ్చు. అయితే ఈ పనిని ఎంతో మృదువుగా, సున్నితంగా చేయాలి లేకపోతే చర్మం దెబ్బతింటుంది. స్క్రబ్బింగ్‌ పూర్తయిన తర్వాత  తడి గుడ్డతో ముఖాన్ని పైన చెప్పిన విధంగా తుడుచుకోవాలి.  తర్వాత వాటర్‌  స్టీమర్‌తో ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి  మంచి మెరుపు వస్తుంది. 
  6. ముఖానికి ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆతర్వాత మాస్కును  ముఖం కింద నుంచి పైకి  రాసుకొని పదినిమిషాలు అలాగే వదిలేయాలి. చేతులను తడి చేసుకుని ఎండిన మాస్కు ముఖాన్ని మెల్లగా శుభ్రం చేసుకోవాలి.  అలాకాకుండా వస్త్రంతో ముఖం పైభాగం నుంచి  కిందికి తుడిస్తే చర్మం వదులు అవుతుంది.  తర్వాత  మెత్తటి వస్త్రంతో ముఖాన్ని పొడిగా తుడుచుకోవాలి. ఇలా చేసేటప్పుడు గుడ్డతో కింద నుంచి ముఖం పైకి తుడుచుకుంటూ క్లీన్‌ చేయాలి. అలా చేయడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.  తడిగుడ్డతో ముఖాన్ని బాగా తుడిచేసుకున్న తర్వాత  చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే  మీ ముఖం అందంతో మెరిసిపోతుంది.


Updated Date - 2021-02-24T06:17:02+05:30 IST