బంగారం దిగుమతుల జోరు..

ABN , First Publish Date - 2021-10-18T07:33:22+05:30 IST

పండగల సీజన్‌లో ప్రజలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడం, వర్తకుల నుంచి డిమాండ్‌ పెరగడంతో పసిడి దిగుమతులు ....

బంగారం దిగుమతుల జోరు..

9 నెలలు..రూ.1.78 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పండగల సీజన్‌లో ప్రజలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడం, వర్తకుల నుంచి డిమాండ్‌ పెరగడంతో పసిడి దిగుమతులు దూసుకుపోయాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో దిగుమతులు ఏకంగా 2,400 కోట్ల డాలర్ల (రూ.1.78 లక్షల కోట్లు)కు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ కేవలం 680 కోట్ల డాలర్లు (రూ.50,500 కోట్లు) మాత్రమే ఉంది. మరోవైపు ఒక్క సెప్టెంబరు నెలలో కూడా పసిడి దిగుమతులు 511 కోట్ల డాలర్లు (రూ.37,800 కోట్లు)గా ఉండటం విశేషం. గత ఏడాది ఇదే కాలంలో ఇవి 60.14 కోట్ల డాలర్లు (రూ.4,400 కోట్లు)గా ఉన్నాయి. కాగా వెండి దిగుమతులు మాత్రం తగ్గాయి. ఏప్రిల్‌-సెప్టెంబరు నెలల మధ్య కాలంలో ఇవి 15.5 శాతం క్షీణించి 61.93 కోట్ల డాలర్లకు దిగి వచ్చాయి. అయితే సెప్టెంబరు నెలలో మాత్రం 92 లక్షల డాలర్ల నుంచి ఏకంగా 55.23 కోట్ల డాలర్లకు పెరిగాయి. బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 29.6 కోట్ల డాలర్ల (రూ.2,150 కోట్లు) నుంచి 2,260 కోట్ల డాలర్ల (రూ.1.68 లక్షల కోట్లు)కు పెరిగింది.  

Updated Date - 2021-10-18T07:33:22+05:30 IST