‘గూడు’ లేని Gold Medalist.. ‘డబుల్‌’ ఇల్లు కేటాయించండి!

ABN , First Publish Date - 2021-12-08T14:00:15+05:30 IST

తైక్వాండోలో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో విజయాలను సాధించి దేశానికి..

‘గూడు’ లేని Gold Medalist.. ‘డబుల్‌’ ఇల్లు కేటాయించండి!

  • తైక్వాండో ప్రపంచ చాంపియన్‌ ఆవేదన


హైదరాబాద్ సిటీ/కృష్ణానగర్‌ : తైక్వాండోలో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో విజయాలను సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చానని, ఉండటానికి ఇల్లు కూడా లేకుండా దుర్భర స్థితిలో ఉన్నానని తైక్వాండో ప్రపంచ చాంపియన్‌ పఠాన్‌ జమీల్‌ ఖాన్‌ ఆవేదన చెందాడు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నేషనల్‌ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో సంస్ధ పౌండర్‌ రామ్‌ ఆరెళ్ల అతడిని సన్మానించారు. జమీల్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా తైక్వాండోలో ఎన్నో విజయాలు సాధించానని, తమది నిరుపేద కుటుంబమని, తైక్వాండో మీద ఇష్టంతో కొంతమంది సహకారంతో అనేక దేశాల్లో పోటీల్లో పాల్గొన్నానని, ఇప్పటివరకు 33 గోల్డ్‌, 14 సిల్వర్‌, 24 బ్రాంజ్‌ పతకాలు సాధించానన్నాడు. 


గత నెల 27, 28 తేదీల్లో లండన్‌ మాంచెస్టర్‌ నగరంలో బ్రిటిష్‌ తైక్వాండో ఓపెన్‌ చాంపియన్‌షి్‌పలో స్పరింగ్‌ విభాగం సీనియర్‌ డివిజన్‌ నుంచి గోల్డ్‌, కట్టస్‌ విభాగంలో సిల్వర్‌ పతకాలను కైవసం చేసుకున్నానని తెలిపాడు. 2017లో తైక్వాండో ఈవెంట్‌లో 30 నిమిషాల్లో కట్టస్‌ 72 సార్లు చేయడంతో అప్పటి వరకు ఉన్న రికార్డును అధిగమించామన్నారు. దీంతో గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో తనపేరు నమోదు చేశారని తెలిపాడు. కూరగాయలు అమ్మే స్థితి నుంచి బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రోత్సాహం ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కేటాయించాలని జమీల్‌ ఖాన్‌ కోరారు. 

Updated Date - 2021-12-08T14:00:15+05:30 IST