Abn logo
May 12 2021 @ 01:03AM

ఈ ఏడాదీ ఆశల్లేవ్...

  • అక్షయ తృతీయ అమ్మకాలపై వర్తకుల్లో గుబులు


ముంబై: అక్షయ తృతీయ అంటే వీసమెత్తు బంగారం అయినా కొనాలన్నది సగటు భారతీయుల ఆకాంక్ష. బంగారం, ఆభరణాల వర్తకులు కూడా ప్రతీ ఏడాది ఈ పర్వదినం అమ్మకాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాని కరోనా విలయ తాండవం ఈ ఏడాది కూడా వర్తకుల ఆశలపై నీరు గుమ్మరించింది. అక్షయ తృతీయ అమ్మకాలు నిరాశావహంగా ఉండడం వరుసగా ఇది రెండో ఏడాది. గత ఏడాది కూడా కరోనా మహమ్మారి అమ్మకాలను తీవ్రంగా ప్రభావితం చేయగా ఈ ఏడాది రెండో విజృంభణ కారణంగా ప్రకటించిన పలు స్థానిక లాక్‌డౌన్లు అమ్మకాలకు పెను అవరోధం కాబోతున్నాయని పరిశ్రమవర్గాలంటున్నాయి. వచ్చే శుక్రవారం  అక్షయ తృతీయ పర్వదినం రోజు తమ దుకాణాల్లో కాసులు కురవడం మాట అటుంచితే అసలు దుకాణాలే తెరవలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఇప్పటికే 90 శాతం రాష్ర్టాల్లో లాక్‌డౌన్లు అమలులో ఉన్నాయని, ఆభరణాల రిటైల్‌ స్టోర్లకు లాక్‌డౌన్‌ మినహాయింపు లేక మూసి ఉంచాల్సివస్తోందని అఖిల భారత వజ్రాభరణాల వర్తక మండలి చైర్మన్‌ ఆశిష్‌ పీథే అన్నారు. గత ఏడాది కనీసం బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో తీసుకుని డెలివరీ ఇచ్చే వెసులుబాటు ఉండేదని, కాని ఈ ఏడాది ఒక్క నిత్యావసరాలు తప్పితే ఏ ఇతర డెలివరీలను అనుమతించకపోవడం తమను మరింతగా కుంగదీస్తుందని ఆయన అంటున్నారు.


వివాహాలు వాయిదా పడడం, వివాహాల కొనుగోళ్లు కొన్ని లాక్‌డౌన్‌కు ముందే జరిగిపోవడం కొంత ఊరట కలిగించే అంశమని ఆయన చెప్పారు. ఈ ఏడాది అక్షయ తృతీయ వ్యాపారం నిరాశావహంగా ఉంటుందంటున్న వారిలో పీఎన్‌జీ జువెలర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ గాడ్గిల్‌, కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కల్యాణ్‌రామన్‌ ఉన్నారు. దేశవ్యాప్తంగా తమకున్న 150 షోరూమ్‌లలో కేవలం 10, 15 మాత్రమే తెరిచే అవకాశం ఉన్నట్టు కల్యాణ్‌రామన్‌ చెప్పారు. 3 లేదా 4 వారాల్లో పరిస్థితి మెరుగుపడవచ్చునన్న ఆశాభావం ఆయన ప్రకటించారు. ప్రస్తుత వాతావరణంలో కుటుంబాలన్నీ తమ రక్తసంబంధీకుల ఆరోగ్యం, క్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, ప్రస్తుతం బంగారం కొనే ఆలోచనలో లేవని విలువైన ఆభరణాల ట్రేడింగ్‌ వేదిక ఆగ్మాంట్‌ డైరెక్టర్‌ కేతన్‌ కొఠారి అన్నారు. 10 గ్రాముల బంగారం గత ఏడాది ఆగస్టులో నమోదు చేసిన చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.58 వేల నుంచి 20 శాతం దిగజారి ప్రస్తుతం రూ.48000 స్థాయిలో కదలాడుతోంది. గత ఏడాది వ్యాపారాలు సగటున 70 శాతం క్షీణించాయి. ప్రపంచ స్వర్ణ మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మొత్తం మీద ఈ ఏడాది అక్షయ తృతీయ వర్తకులకు కన్నీరే మిగల్చబోతోంది.  ఈ-కామర్స్‌ డెలివరీలు జాప్యం


కరోనా మహమ్మారి ఈ-కామర్స్‌ డెలివరీలపై కూడా ప్రభావం చూపింది. డెలివరీల కోసం వినియోగదారులు సుమారు 7 రోజుల వరకు వేచి ఉండాల్సివస్తోంది. భారీ ఆర్డర్లు ప్రాసెస్‌ చేయడం, సిబ్బంది భద్రత రెండింటినీ సమతూకం చేయడం చాలా కష్టంగా మారిందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లంటున్నారు. ఇప్పటికే పలు సంస్థలు కరోనా కఠిన ఆంక్షల కారణంగా డెలివరీలు జాప్యం కావచ్చుననే నోట్‌ను తమ వెబ్‌సైట్లలో ప్రముఖంగా పెట్టాయి. ముఖ్యంగా బిగ్‌ బాస్కెట్‌ యాప్‌ దీన్ని ఆర్డర్‌ సమయంలోనే స్పష్టంగా తెలియచేస్తోంది. 2 గంట ల్లో ఆర్డర్లు డెలివరీ చేస్తామని చెబుతున్న అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీస్‌ కూడా ఢిల్లీలో డెలివరీకి ఒక రోజు తీసుకుంటోంది. కనీసం ఆర్డర్ల ప్రకారం వస్తువులు కస్టమర్లకు అందించడానికి తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిరంతరం అభ్యర్థిస్తున్నామని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి అన్నారు. మానవ వనరుల కొరతతో పాటు ఆరోగ్య ప్రమాణాలకు దీటుగా ప్యాకేజింగ్‌కు సమయం అధికంగా పడుతున్నట్టు ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement