బంగారం 50,000?

ABN , First Publish Date - 2020-02-22T07:00:33+05:30 IST

గత రెండు రోజుల్లో పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగించాయి.

బంగారం 50,000?

  • మరో ఏడాదిలో చేరుకునే చాన్స్‌...సిటీ గ్రూప్‌ అంచనా


గత రెండు రోజుల్లో పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగించాయి. కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాంతో, భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండికి అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్‌ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,600 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. గురువారం 10 గ్రాములు బంగారం ఒక దశలో రూ.43,000 పలికింది.


బంగారం, వెండి ధరలు మున్ముందు మరింత ఎగబాకనున్నాయని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు ఇందుకు కారణం కావచ్చని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు ఈక్విటీల్లోని తమ పెట్టుబడులను విలువైన లోహాల్లోకి మళ్లించవచ్చని, భవిష్యత్‌లో వీటికి డిమాండ్‌ మరింత పుంజుకోవచ్చన్నది వారి అభిప్రాయం. అనిశ్చిత వాతావరణం ఇలాగే కొనసాగితే వచ్చే 1-2 ఏళ్లలో ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ఈ ప్రకారం దేశీయంగా పసిడి ధర కనీసం రూ.50,000 స్థాయిని దాటనుంది. ఆసియాలోని చైనా, భారత్‌లు మందగమనంలోనే కొనసాగితే మాత్రం బంగారానికి డిమాండ్‌ అంతగా పెరగకపోవచ్చని అభిప్రాయపడింది. ఎందుకంటే, ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునేది ఈ రెండు దేశాలే. 


బుల్‌ ట్రెండ్‌ మొదలైంది..

బంగారం మళ్లీ బుల్‌ ట్రెండ్‌లోకి మళ్లిందని స్కోటియా బ్యాంక్‌ మెటల్స్‌ విభాగ వ్యూహకర్త నిక్కీ షీల్స్‌ అంటున్నారు. ఈ ఏడాది భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు అధికమయ్యే అవకాశాలు ఉన్నందున ఔన్సు గోల్డ్‌ రేటు 1,500 డాలర్ల ఎగువనే ట్రేడ్‌ కావచ్చంటున్నారు. 


1,921 డాలర్లు 

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ గత ఆల్‌టైం గరిష్ఠ ధర 2011లో నమోదైంది


రూ. 42,492 

ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో తులం బంగారం గత సెషన్‌ ముగింపు ధర


1,646 డాలర్లు 

శుక్రవారం ఔన్స్‌ గోల్డ్‌ రేటు 


7 శాతం

ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల


Updated Date - 2020-02-22T07:00:33+05:30 IST