Abn logo
Apr 24 2021 @ 11:57AM

మహిళ కళ్లలో కారం కొట్టి.. బంగారం అపహరణ

హైదరాబాద్/అడ్డగుట్ట : డ్యూటీకి బైక్‌పై వెళ్తున్న రైల్వే మహిళా ఉద్యోగి కళ్లలో కారం చల్లి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం. తార్నాక నాగార్జునకాలనీకి చెందిన జంగం పద్మజ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం ఇంటి నుంచి ఉదయం 8.30 గంటలకు బైక్‌పై తార్నాక నుంచి విజయపురి వైపు వెళ్తుండగా మార్గమధ్యలో ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కళ్లల్లో కారం చల్లి ఆమె వద్ద ఉన్న రూ.45 వేల విలువ చేసే బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ బ్యాగులను తస్కరించి పారిపోయారు. 


కళ్లలో కారం పడడంతో ఆమె స్పృహ తప్పిపడిపోగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి తన స్నేహితులకు ఫోన్‌ చేసి బాధితురాలు పద్మజను వెంటనే మెట్టుగూడలోని కేంద్రీయ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో రైల్వే ఆస్పత్రి వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పద్మజ సోదరుడు తోట శ్రీధర్‌ లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బంధువులే ఈ దాడికి పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఐ మీడియాకు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

క్రైమ్ మరిన్ని...