కేరళ సీఎం మెడకు ‘గోల్డ్‌ స్కామ్‌’

ABN , First Publish Date - 2020-07-10T07:10:25+05:30 IST

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న కేరళ గోల్డ్‌స్కామ్‌ ఇప్పుడు సీఎం పినరయి విజయన్‌ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేశ్‌ను సీఎం కాపాడుతున్నారంటూ...

కేరళ సీఎం మెడకు ‘గోల్డ్‌ స్కామ్‌’

  • కీలక నిందితురాలిని కాపాడుతున్నారని ఆరోపణ
  • విపక్షాలు, బీజేపీ ముప్పేట దాడి
  • ఎన్‌ఐఏ విచారణకు కేంద్రం ఆదేశాలు

తిరువనంతపురం, జూలై 9: రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న కేరళ గోల్డ్‌స్కామ్‌ ఇప్పుడు సీఎం పినరయి విజయన్‌ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేశ్‌ను సీఎం కాపాడుతున్నారంటూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.


సీఎంవో ఉద్యోగుల ప్రమేయముందన్న ఆరోపణలతో సమగ్ర విచారణను కోరాయి.దుబాయ్‌ నుంచి యూఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్‌ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి వచ్చిన సరుకును ఈ నెల 5న కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా దౌత్యమార్గంలో వచ్చిన సరుకును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయరు. కానీ, పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని, గృహోపకరణాల మధ్యలో బంగారాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ కేసులో యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి సరిత్‌ కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. స్వప్న సురేశ్‌ను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. అటు కేరళ సర్కారు సీఎం ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ను తప్పించింది. స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడానికి, సీఎంవోలో స్వేచ్ఛనివ్వడానికి కారకుడంటూ ఆయనపై వేటు వేసింది.త అయితే.. సీఎం పినరయి విజయన్‌కు, స్వప్న సురేశ్‌కు దగ్గరి సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం దీన్ని సీరియ్‌సగా తీసుకుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అన్నారు. రాజకీయాలకతీతంగా విచారణ పారదర్శకంగా జరిపించాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ కేసు విచారణ బాధ్యతను కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించింది.  




ఎవరీ స్వప్న సురేశ్‌?

కేరళ గోల్డ్‌ స్కామ్‌ మొత్తం స్వప్న సురేశ్‌ చుట్టే తిరుగుతోంది. ఆమె సోషల్‌ మీడి యా ప్రొఫైల్స్‌లో సీఎం విజయన్‌తోపాటు ప్రముఖులతో దిగిన ఫొటోలున్నాయి. ఆమె కెరీర్‌ మొత్తం వివాదాలమయమే. తొలుత తిరువనంతపురంలో ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేసిన స్వప్న 2010-11లో దుబాయ్‌ వెళ్లింది. అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తుండగా ఆరోపణలు రావడంతో మళ్లీ కేరళకు వచ్చింది. తర్వాత ఎయిర్‌ ఇండియా ఏజెంట్‌గా తిరువనంత పురంలో పనిచేసింది. యూఏఈ కాన్సులేట్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం సంపాదించింది. అక్కడా ఆరోపణలు రావడంతో తొలగించారు. తర్వాత కేరళ ఐటీ మౌలిక సదుపాయాల సంస్థలో లైజనింగ్‌ అధికారిగా చేరింది. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్న బుధవారం సాయంత్రం తన అడ్వొకేట్‌ ద్వారా కేరళ హైకోర్టు ఆన్‌లైన్‌లో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉంది.


Updated Date - 2020-07-10T07:10:25+05:30 IST