Vijayawada: తక్కువ ధరకు బంగారం కేసులో ట్విస్ట్‌

ABN , First Publish Date - 2021-09-17T06:35:27+05:30 IST

రూ.4లక్షలకే..

Vijayawada: తక్కువ ధరకు బంగారం కేసులో ట్విస్ట్‌

బెజవాడ బిస్కెట్లే!

రైల్వే సీటీఐ వెంకటరావు, నాగమణి కీలక నిందితులు

వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడో?


ఆంధ్రజ్యోతి, విజయవాడ: రూ.4లక్షలకే 100 గ్రాముల బంగారం బిస్కట్‌ ఆఫర్‌ ముసుగులో జరిగిన మోసంలో అసలు కోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ మొత్తం మోసానికి కర్త, కర్మ, క్రియ రైల్వే సీటీఐ ఎస్‌.వెంకటరావు, అతడి సహచరణి పక్కుర్తి సింహాద్రి నాగమణి అలియాస్‌ మౌనిక అని నిర్ధారణకు వచ్చారు. రూ.4లక్షలకే 100 గ్రాముల బంగారం బిస్కెట్లను ఇస్తామని చెప్పి విజయవాడలో సుమారు 60 మందికి వారిద్దరూ టోకరా వేసినట్టు తేల్చారు. ఈ నెల ఐదో తేదీ నుంచి జరుగుతున్న కేసు దర్యాప్తు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చింది. రైలు ప్రయాణంలో అయిన పరిచయంతో వెంకటేశ్వరరావు జీవితంలోకి అడుగుపెట్టిన నాగమణి బంగారం వ్యాపారం ముసుగులో పలువురిని నిలువునా ముంచేసింది. ఈ వ్యవహారంపై వెంకటేశ్వరరావు, నాగమణిలను వేర్వేరుగా విచారిస్తున్న పోలీసులకు వారి నుంచి పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి.


రైల్వేలో సీటీఐగా పనిచేస్తున్న ఆకుల రాఘవేంద్రరావుకు మొత్తం డబ్బు ఇచ్చినట్టు నాగమణి పోలీసులకు చెప్పింది. ఈ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ ఛాయలు ఏమీ కనిపించలేదు. వాస్తవానికి సింగపూర్‌, దుబాయ్‌ ప్రాంతాల నుంచి బంగారం వస్తుందని, దాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని పలువురు రైల్వే ఉద్యోగులకు నాగమణి, వెంకటేశ్వరరావు చెప్పారు. ఇదంతా అవాస్తవమని పోలీసులు గుర్తించారు. విజయవాడ వన్‌టౌన్‌లోనే బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసి, వాటిని రూ.4లక్షలకు నాగమణి విక్రయించిందని సమాచారం. అటు నాగమణి బ్యాంకు ఖాతాలు, ఇటు వెంకటేశ్వరరావు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలు ఏమీ కనిపించడం లేదు. 


ఆ డబ్బు ఎక్కడో!

బంగారం బిస్కెట్ల పేరుతో వసూలు చేసిన కోట్లాది రూపాయలను వారిద్దరూ ఏమి చేశారన్నది తెలియడం లేదు. అటు టాస్క్‌ఫోర్స్‌, ఇటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల దృష్టిని మరలించడానికి వెంకటేశ్వరరావు, నాగమణి కొత్తకొత్త కథలను వినిపించినట్టు సమాచారం. విచారణలో భాగంగా పోలీసులు వెంకటేశ్వరరావు భార్యను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. సుమారు 14 ఏళ్ల క్రితం వెంకటేశ్వరరావు కుటుంబాన్ని వదిలేసి, నాగమణితో సహజీవనం సాగిస్తున్నట్టు ఈ విచారణలో తేలింది.


వెంకటేశ్వరరావు ద్వారానే నాగమణి రైల్వేలోని ఉద్యోగులకు బంగారం బిస్కెట్ల ఆశ చూపిందని సమాచారం. నాగమణి వన్‌టౌన్‌లో ఎక్కడెక్కడ బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసిందనే వివరాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. బాధితులు ఒక్కొక్కరు పోలీసుల వద్దకు వచ్చి నాగమణి, వెంకటేశ్వరరావు ఏవిధంగా తమను మోసం చేశారో వివరించారు. రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులు వెల్లడించే అవకాశాలున్నాయి. 

Updated Date - 2021-09-17T06:35:27+05:30 IST