బంగారం... రూ.65,000!

ABN , First Publish Date - 2020-07-26T06:12:02+05:30 IST

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో రోజుకో సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేస్తున్నాయి. ఈ గోల్డెన్‌ ర్యాలీ మున్ముందూ కొనసాగనుందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల గమనానికి అనుగుణంగానే దేశీయంగానూ పెరుగుతూ వస్తున్నాయని వారంటున్నారు...

బంగారం... రూ.65,000!

  • కిలో వెండి రూ.74 వేలకు ఎగబాకే చాన్స్‌ 
  • బులియన్‌ మార్కెట్లో దూసుకుపోతున్న ధరలు  
  • 2011 తర్వాత మళ్లీ 1,900 డాలర్లకు ఔన్స్‌ గోల్డ్‌ 
  • ఏడాది కాలంలో 2,500 డాలర్లకు చేరే అవకాశం 

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో రోజుకో సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేస్తున్నాయి. ఈ గోల్డెన్‌ ర్యాలీ మున్ముందూ కొనసాగనుందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల గమనానికి అనుగుణంగానే దేశీయంగానూ  పెరుగుతూ వస్తున్నాయని వారంటున్నారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం (31.10 గ్రాములు) శుక్రవారం నాడు 1,900 డాలర్లకు ఎగబాకింది. పసిడి ఈ మైలురాయిని చేరడం 2011 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. బంగారంతోపాటు వెండి కూడా పెరుగుతూపోతోంది. ఔన్స్‌ వెండి ప్రస్తుతం 23 డాలర్లకు చేరుకుంది. ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే, ఈ సెప్టెంబరు చివరినాటికి ఔన్స్‌ బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని యూబీఎస్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాది కాలంలో రేటు 2,500 డాలర్లకు ఎగబాకవచ్చ ని పుణెకు చెందిన జువెలరీ బ్రాండ్‌  పీఎన్‌ గాడ్గిల్‌ ఎండీ, సీఈఓ సౌరభ్‌ గాడ్గిల్‌ అన్నారు. 


హైదరాబాద్‌లో రూ.53,000 పైనే.. 

భారత్‌లో మేలిమి బంగారం ఈ వారంలో రూ.50,000 మైలురాయిని దాటేసింది. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర శనివారం నాడు రూ.53,470కి ఎగబాకింది. కేజీ వెండి రూ.61,200 పలికింది. ముంబై మార్కెట్‌ విషయానికొస్తే, 99.9 స్వచ్ఛత బంగారం తులానికి రూ.51,124గా నమోదైంది. కిలో వెండి రూ.59,885గా ట్రేడైంది. వచ్చే 12 నెలల్లో పది గ్రాముల బంగారం రూ.65,000, కేజీ వెండి రేటు రూ.74,000 దాటవచ్చని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. 2019 ఆగస్టు నుంచే అప్‌ట్రెండ్‌లో పయనిస్తోన్న బంగారం ధరలు కేవలం ఈ ఏడాదిలోనే 60 శాతం పైగా ఎగబాకాయి. 


రిటైల్‌ కొనుగోళ్లు కరువు 

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్కెట్‌ దాదాపుగా స్తంభించిపోయింది. దాదాపు రెండు నెలలపాటు ఆభరణాల షాపులు తెరుచుకోలేదు. ఇప్పుడు తెరిచి ఉన్నా కొనేవారు కరువయ్యారు. ఎందుకంటే, కొవిడ్‌ సంక్షోభంతో అందరికీ ఆదాయం తగ్గింది. పరిస్థితులు చక్కబడే వరకు చేతిలో ఉన్న సొమ్మును పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇందుకు తోడు, గడిచిన 3 నెలల్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. మున్ముందు ధరలు మరింత పెరగడం ఖాయమని కమోడిటీ నిపుణులంటున్నారు. పైగా, ఆర్థిక మాంద్యం. ఈ నేపథ్యంలో బంగారం రిటైల్‌ కొనుగోళ్లు మరింత తగ్గవచ్చని జువెలరీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.‘‘లాక్‌డౌన్‌, భౌతిక దూరం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో అభద్రత  కారణాలతో ఇప్పటికే ఆభరణాల డిమాండ్‌ భారీగా పతనమైంది. కేవలం 20-25 శాతం వ్యాపారం జరుగుతోంది. ఈ తరుణంలో ధరలు భారీగా పెరుగుతుండటంతో జువెలరీ విక్రయాలకు మరింత గండిపడవచ్చు’’నని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ అన్నారు. కరోనా ఆంక్షలతో పండగలు, పెళ్లిళ్లూ సాదాసీదాగా జరుపుకోవాల్సి వస్తోందని, దాంతో నగలు కొనేవారు కరువయ్యారని ఆయన పేర్కొన్నారు. కనీసం నవంబరు వరకు బంగారం ధరలు బుల్లిష్‌గానే ఉండవచ్చని భావిస్తున్నట్లు అనంత పద్మనాభన్‌ అభిప్రాయపడ్డారు. 


ధర పెరుగుదలకు కారణాలు 

  1. మానవాళిని కబళిస్తున్న కరోనా సంక్షోభం 
  2. అమెరికా- చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు 
  3. ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణత ఆందోళనలు
  4. అగ్రరాజ్యాల కొవిడ్‌-19 ఊరట ఉద్దీపనలు
  5. అమెరికాలో సున్నాకు చేరువైన వడ్డీ రేట్లు
  6. డాలరు మారకం రేటులో ఊగిసలాటలు 




మార్కెట్లో వడ్డీ రేట్లు సున్నా స్థాయికి పడిపోయినప్పుడు బంగారా నికి సాధారణంగానే డిమాండ్‌ పెరుగుతుం ది. ఎందుకంటే, గోల్డ్‌ పెట్టుబడులపై వడ్డీ ఎంత వస్తుందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. మార్కెట్లో అనిశ్చితి పెరిగే కొద్దీ విలువైన లోహాల ధరలూ పెరుగుతూపోతుంటాయి.అందుకే, ఇప్పుడు పసిడిలో పెట్టుబడులు పెడుతున్నా. మున్ముందు మరింత ఇన్వెస్ట్‌ చేస్తా. 

               - మార్క్‌ మోబియస్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ 


 కరోనా సంక్షోభంతో భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న బంగారం, వెండికి డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. సున్నా స్థాయి వడ్డీ రేట్లు, డాలర్‌ మారకంలో ఊగిసలాటలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీటి ధరల ర్యాలీ 2021 వరకు కొనసాగవచ్చు. 

- ఎలీ ఓంగ్‌, బ్లూంబర్గ్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్‌ 


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి వచ్చే వరకు లేదా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే దాకా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగనున్నాయి. 

- నిష్‌ భట్‌, మిల్‌వుడ్‌ కేన్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు, సీఈఓ


ఆంధ్రజ్యోతి (బిజినెస్‌ డెస్క్‌)


Updated Date - 2020-07-26T06:12:02+05:30 IST