‘గోల్డెన్‌ అవర్‌’ హీరోలు.. ఈ సేవియర్లు

ABN , First Publish Date - 2021-04-04T08:18:31+05:30 IST

రోడ్డు ప్రమాదాలు.. ఏటా వేల మందిని బలి తీసుకోవడమే కాదు.. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి.

‘గోల్డెన్‌ అవర్‌’ హీరోలు.. ఈ సేవియర్లు

  • శివార్లలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందితో బృందాలు
  • ప్రాథమిక చికిత్స, సకాలంలో ఆస్పత్రికి తరలింపుపై శిక్షణ
  • సమీపంలోని ట్రాఫిక్‌ పోలీసులతో అనుసంధానం
  • సైబరాబాద్‌లో ఇప్పటికే 11 బృందాలకు శిక్షణ పూర్తి
  • వెయ్యి మందిని తీర్చిదిద్దడమే లక్ష్యమంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలు.. ఏటా వేల మందిని బలి తీసుకోవడమే కాదు.. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వందల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. చిన్నారులను అనాథలను చేస్తున్నాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. వేలాది మంది జీవితాలను అంగవైకల్యంతో దుర్భరంగా మారుస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తు, నిబంధనలు పాటించకపోవడం.. ఇవే ప్రధానంగా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ ఈ విషయాలన్నీ తెలుసు.. అయినా.. తమకేం కాదులే అనే ఓ చిన్నపాటి నిర్లక్ష్యం.. పెనుప్రమాదానికి దారితీస్తోంది. ఇవి ప్రమాదాలకు కారణాలైతే.. క్షతగాత్రులకి సరైన సమయంలో చికిత్స అందకపోవడం అధిక శాతం మరణాలకు హేతువు అవుతోంది. సకాలంలో ప్రాథమిక చికిత్స అందకపోవడం వల్లే అధిక శాతం మృతిచెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోనే ఉంటోంది. 


ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి గంటలోపు ఆస్పత్రులకు తరలించగలిగితే.. ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తొలి గంట గోల్డెన్‌ అవర్‌ అని, ఆ సమయంలోగా ఆస్పత్రికి చేర్చగలిగితే.. బతికించడం సాధ్యమవుతుందని వారు అంటున్నారు. అందుకే సైబరాబాద్‌ పోలీసులు ఇప్పుడు ఈ దిశగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతగా కృషి చేస్తున్నా.. లాభం లేకపోతుండడంతో.. మరణాలను తగ్గించడంపై దృష్టిసారించారు. దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


గోల్డెన్‌ సేవియర్స్‌ బృందాల ఏర్పాటు

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌.. రెండేళ్లుగా రహదారి భద్రతపై దృష్టి పెట్టారు. రోడ్డు ప్రమాదాలకు, అందులో మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా రోడ్డు యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. దీని నివేదిక ఆధారంగా ప్రమాదాల నివారణకు ఓ ప్రణాళిక రూపొందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారికి మొదటి గంటలోపే ప్రాథమిక చికిత్స అందించి, సకాలంలో ఆస్పత్రికి చేర్చగలిగితే.. నూటికి 95 శాతం మంది ప్రాణాలు కాపాడచ్చని వైద్యులు చెప్పడంతో.. ముందుగా దానిపై దృష్టి పెట్టారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించారు. ‘గోల్డెన్‌ అవర్‌’ను సీరియ్‌సగా తీసుకున్నారు. ఆ గంటలో స్పందించి.. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి.. ఆస్పత్రులకు తరలించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


ప్రమాదాలు అధికంగా జరిగే పాయింట్లను గుర్తించి.. ఆ పరిసరప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్లు, దాబాలు తదితర చోట్ల పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిని ఒప్పించి.. వారితో కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. 30 మంది సభ్యులతో ఏర్పడ్డ ఒక్కో బృందానికి ఆ దగ్గరలోని ట్రాఫిక్‌ పోలీసులను జత చేశారు. వీరికి ‘సేవియర్స్‌’ (సేవింగ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ ఆన్‌ రోడ్‌) అని నామకరణం చేశారు. వారికి.. ప్రాథమిక వైద్యం, ప్రాణాలు కాపాడడంలో మెళకువలు, సకాలంలో బాధితులను ఆస్పత్రికి తరలించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడానికి ‘కేర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్స్‌’ ముందుకు వచ్చింది. ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ) ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది. ఇలా ఇప్పటి వరకు 11 బృందాలకు శిక్షణ ముగించి  రక్షకులుగా తయారు చేసినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని, కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 1000 మంది రక్షకులను తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. 

Updated Date - 2021-04-04T08:18:31+05:30 IST