Abn logo
Sep 20 2021 @ 01:23AM

వెళ్లిరా.. గణేషా!!

ఆదిలాబాద్‌లో గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్‌, ఎస్పీ

జిల్లావ్యాప్తంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు
పెన్‌గంగా, ఇతర నదుల్లో లంబోధరుడి నిమజ్జనం
సరస్వతీ శిశుమందిర్‌ నుంచి ప్రారంభమై శోభాయాత్ర
పాల్గొన్న ఎంపీ, కలెక్టర్‌, ఎస్పీ,  ఎమ్మెల్యేలు, అధికారులు
ప్రశాంతంగా ముగిసిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 19: జిల్లావ్యాప్తంగా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడు భక్తులు బై.. బై..  చెప్పాడు. గత యేడాది కరోనా ప్రభావంతో నిరాడంబరంగా నిర్వహించుకున్న గణేష్‌ నవరాత్రి వేడుకలను, ఈ యేడాది మాత్రం భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రత్యేక విద్యుత్‌ కాంతుల మధ్య విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేసి మండపాలను ఏర్పాటు చేయగా.. వివిధ ఆకారాల్లోని విఘ్నేశ్వరున్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. కాగా ప్రతియేడు లాగే పెన్‌గంగా నదిలో నిమజ్జనానికి గణనాథులను తరలించారు.
గణనాథుడికి ప్రముఖుల పూజలు
జిల్లా కేంద్రంలోని వినాయక్‌ చౌక్‌లో గల సరస్వతీ శిశుమందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిచంగా.. ఈ వేడుకలకు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర, ఎంపీ సోయంబాపురావ్‌, ఎమ్మెల్యే జోగు రామన్నలు, సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ ధర్మానికి గణేష్‌ చవితి నవరాత్రులు ప్రత్యేకమైనవని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా లంభోధరుడికి తొమ్మిది రోజుల పాటు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి ప్రజలు, భక్తులు తమను విఘ్నాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. అనంతరం అతిథులు సరస్వతీ శిశుమందిర్‌ నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో భాగంగా పోలీసులు జిల్లాతో పాటు పట్టణ కేంద్రంలోనూ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్‌ 1978 సంవత్సరం నుంచి ఆదిలాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారని, భక్తులు ప్రతియేడు లాగే ఈ యేడాది కూడా ప్రశాంతంగా ఈ వేడుకలను ముగించుకోవాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా 1,100 ప్రతిమలు
జిల్లా వ్యాప్తంగా 1100 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారని కలెక్టర్‌ పేర్కొన్నారు. గత యేడాది కొవిడ్‌ కారణంగా ఈ వేడుకలు నిర్వహించలేక పోయామని.. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనలను అనుసరించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఎంపీ సోయంబాపురావ్‌ మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలను హైదరాబాద్‌ తరహాలో నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. గణేష్‌ ఉత్సవాలు హైదరాబాద్‌ తర్వాత ఆదిలాబాద్‌లోనే ఎక్కువ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో భక్తులు, ప్రజలు పూజలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
 నిమజ్జనోత్సవంలో భాగంగా పలువురు విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించారు. ఆయా పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు, పాటలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థాల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, సమాజ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు జంగిలి ఆశన్న, ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, ప్రపుల్‌వఝే, శ్రీరామచంద్రగోపాల చంద్రపీఠాధిపతి యోగానంద సరస్వతీ స్వామి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌, ఆదినాథ్‌, నాంపెల్లి వేణుగోపాల్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
జైనథ్‌: జిల్లాలో గణేష్‌ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్‌ చంద్ర అన్నారు. ఆదివారం మండలంలోని పెన్‌గంగా నది వద్ద నిమజ్జనం చేసే బ్రిడ్జి, స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించామన్నారు. ఇందుకు ప్రజలు గణేష్‌ మండళ్ల నిర్వాహకులు సహకరించాలని కోరారు. అంతకు ముందు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి పెన్‌గంగా బ్రిడ్జిని పరిశీలించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు, జైనథ్‌ సీఐ కె.మల్లేష్‌, ఎస్సై సాయిరెడ్డి, వెంకన్నలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.