Abn logo
Jun 19 2021 @ 03:35AM

బెదిరిస్తే... బండారం బయటపెడతా

జగన్‌ బెయిల్‌ రద్దు ఖాయం : గోనె ప్రకాశరావు 


తిరుపతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ అభిమానుల పేరిట కొందరు నన్ను ఫోనులో బెదిరిస్తున్నారు. ఇదేవిధంగా కొనసాగితే జగన్‌ బండారం మొత్తం బయటపెడతా. విదేశాల్లో కూర్చుని తనను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న జగన్‌ అభిమానులకు దమ్ముంటే చర్చకు రావాలి’’ అని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర నేత గోనె ప్రకాశరావు సవాల్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ పాలనకు, రాజశేఖర్‌రెడ్డి పాలనకు.. నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ‘‘వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకర్లు, శకునులు. విజయసాయిరెడ్డి ఫైనాన్స్‌ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారు’’ అని విమర్శించారు. సీఎం జగన్‌ అక్రమాస్తులు, సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ రద్దు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డే ప్రధాన సూత్రధారని గోనె పేర్కొన్నారు. 


వైఎస్‌ పాదయాత్రలో జగన్‌ లేరు

వైఎస్‌ చేపట్టిన పాదయాత్రలో జగన్‌  పాల్గొనలేదని గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. ‘నాలో.. నాతో వైఎస్సార్‌’ పుస్తకంలో ‘తండ్రికి అండగా జగన్‌ పాదయాత్ర చేశారు’ అని విజయమ్మ రాయడాన్ని తప్పుబట్టారు. రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో తాను, తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ప్రారంభం నుంచి చివరి వరకూ ఉన్నామని గోనె తెలిపారు.