సినిమా ఘర్...మన దేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ హృదయానికి ఎంతో చేరువైన భవనం. బంజారా హిల్స్ రోడ్డు నెం.12లో ప్రముఖ చిత్ర నిర్మాత బిమల్‌రాయ్ కుమార్తె అపరాజిత సిన్హా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎం.ఎఫ్.హుస్నేన్ దీనికి ఉచితంగా స్థలాన్ని ఇచ్చి తనలో కళాతృష్ణను చాటుకున్నారు. బిమల్‌రాయ్ చిత్రీకరించిన ఛాయా చిత్రాలు సహా ఎం.ఎస్.హుస్సేన్ వేసిన పెయింటింగ్స్ పాటు పలు గొప్ప ఆర్ట్‌ల కలయికతో సినిమాఘర్ అనే ప్రత్యేకమైన భవనం రూపొందింది. 1999లో స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సినిమా ఘర్ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఘర్ భవనం శిథిలావస్థ దశకు చేరుకుంది. తామెంతో అభిమానించే సినిమా ఘర్ కి గుడ్ బై చెప్పాల్సిందేనా అని విషయం తెలిసిన ఆర్ట్ అభిమానులకు మాటలు కరువయ్యాయి.
సినిమా ఘర్‌తో ఉన్న అనుబంధం గురించి క్యూరేటర్ బిరాద్ రాజారామ్ యాగ్నిక్ మాట్లాడుతూ "1990 చివర్లో నేను సినిమా ఘర్ను సంర్శించాను. ఇదొక ప్రత్యేకమైన మ్యూజియం. ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్‌కు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే భవనమది. అంతే కాదు.. ఎంతో గొప్ప ఆర్ట్‌లతో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకుంది. సినిమా ఘర్ పేరు వినగానే నాకు మూడు అంతస్థుల భవనం గుర్తుకు వచ్చింది. అండర్ గ్రౌండ్లో సుమారు 50 మంది వీక్షించేలా ఓ సినిమా థియేటర్ ఉంది. ఎగువ రెండు అంతస్తుల్లో హుస్సేన్ చిత్రీకరించిన పెద్ద చిత్రాలతో గ్యాలరీలున్నాయి. అలాగే మాధురీ దీక్షిత్ స్ఫూర్తితో హుస్సేన్గారు గజగామినిపై వేసిన సిరీస్ నాకు గుర్తుంది" అన్నారు. చరిత్రకారురాలైన అనురాధ రెడ్డి మాట్లాడుతూ " నేను సినిమా ఘర్కు రెండుసార్లు వెళ్ళాను. ఇదొక సజీవ ప్రదేశం. అక్కడ ప్రత్యేక ప్రదర్శనలు మరియు వాణిజ్యేతర సినిమాలు చూడటం నాకు గుర్తుంది" అన్నారు.