సర్కారు బడికి మంచి రోజులు

ABN , First Publish Date - 2022-01-20T06:43:44+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు - మన బడి’ పేరిట ప్రణాళికను అమలు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సర్కారు బడికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.

సర్కారు బడికి మంచి రోజులు
సిరిసిల్లలోని ప్రభుత్వ పాఠశాల

- ‘మన ఊరు..మన బడి’ పేరుతో అభివృద్ధికి కార్యాచరణ 

- పల్లెల్లోకి ఇంగ్లీష్‌ చదువులు 

- 1వ తరగతి నుంచి బోధనకు సన్నాహాలు 

- జిల్లాలో 529 పాఠశాలలు 

- 55,084 మంది విద్యార్థులు 


 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతోపాటు  మౌలిక వసతుల కల్పనకు  ‘మన ఊరు - మన బడి’ పేరిట ప్రణాళికను అమలు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సర్కారు బడికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి ఇప్పటికే విద్యాశాఖ నుంచి నివేదికలను తెప్పించి కార్యాచరణను రూపొందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో సమస్యలతో పాఠశాలలు కొనసాగుతున్నాయి. సరిపడని తరగతి గదులు, శిథిలావస్థలో భవనాలు, మూత్ర శాలల సమస్య వంటి ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంతో ప్రైవేటు విద్యా సంస్థలకు పోటీగా మారుతాయనే ఆశలు మొదలయ్యాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ చదువు లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ స్థాయిలో ఇంగ్లీష్‌ చదువులు అందుబాటులో లేకపోవడంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొవిడ్‌ను సైతం ఎదుర్కొంటూ పట్టణాలకు, మండల కేంద్రాలకు తమ పిల్లలను విద్యాబోధనకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన చేపడితే స్థానిక పాఠశాలల్లోనే  తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తారని  ప్రభుత్వం ఆలోచన చేసింది.  ప్రభుత్వ పాఠశాలల్లో  1వ తరగతి నుంచే ఇంగ్లీష్‌ విద్యాబోధన చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సక్సెస్‌ పాఠశాలల పేరుతో ఆంగ్లంలో బోధన సాగిస్తున్నారు. జిల్లాలో 529 పాఠశాలలు ఉన్నాయి. 7 మోడల్‌ పాఠశాలలు, 13 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 7 సాంఘిక, నాలుగు గిరిజన, రెండు బీసీ సంక్షేమ పాఠశాలలు, రెండు మైనార్టీ రెసిడెన్షియల్‌, ఒక అర్బన్‌ రెసిడెన్షియల్‌, ఒక తెలంగాణ రెసిడెన్షియల్‌, ఒక ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వీటిల్లో 55,084 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 489 ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 359 పాఠశాలల్లో ఆంగ్లబోధన కొనసాగుతోంది. 339 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 228 పాఠశాలల్లో ఇంగ్లీష్‌ బోధిస్తున్నారు. 17,487 మంది విద్యార్థులు చదువుతున్నారు. 111 ఉన్నత పాఠశాలలు ఉండగా  95 పాఠశాలల్లో 12,560 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ బోధనలో చదువుతున్నారు. 37 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 34 పాఠశాల్లో 3,252 మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ బోధనలో ఉన్నారు. జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రెండు పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం కొనసాగుతోంది.  వీటిలో 641 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 359 పాఠశాలల్లో 33,940 మంది విద్యార్థులు ఆంగ్ల బోధనలో ఉన్నారు. కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి మొగ్గు చూపడం విశేషం,  ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 5,894 మంది విద్యార్థులు పెరిగారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంగ్లీష్‌బోధనకు శ్రీకారం చుడుతుండడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 

వెంటాడుతున్న ఉపాధ్యాయుల కొరత 

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మెరుగైన విద్యకు ముందడుగు పడుతున్న ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. జిల్లాకు 2341 ఉపాధ్యాయుల పోస్టులు మంజూరవగా 2041 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 300 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది.  ఇంగ్లీష్‌ బోధనపై పట్టున్న ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లీష్‌ బోధన ప్రవేశపెట్టినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సమస్యలు తీరేనా..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 489 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా చాలా పాఠశాలల్లో ల్యాబ్‌లు, లైబ్రరీ వంటి సదుపాయాలతోపాటు విద్యుత్‌ సౌకర్యం లేనివి కూడా ఉన్నాయి. వర్షం వస్తే బడికి సెలవులు ఇచ్చే పరిస్థితి.  సరిపడా మూత్రశాలలు, వంట గదులు లేవు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు వచ్చే ఆర్థిక సంఘం నిధులను పాఠశాలలకు ఉపయోగించుకునే వీలు కల్పించారు. ‘మన ఊరు- మనబడి’ పేరుతో ప్రభుత్వం చేపట్టే  కార్యక్రమానికి తోడు ఆర్థిక సంఘం నిధులతో పాఠశాలల్లో సమస్యలు తీరుతాయని పలువురు భావిస్తున్నారు. 


Updated Date - 2022-01-20T06:43:44+05:30 IST