రక్తవృద్ధికి మేలైన ఆహారం

ABN , First Publish Date - 2020-02-28T20:30:28+05:30 IST

శరీరంలో రక్తం తగిన పరిమాణంలో ఉంటేనే మనిషికి ఆరోగ్యం. రక్తం టాక్సిక్‌ (విషపూరితం)గా మారితే అనేక వ్యాధులు వస్తాయి. అందువల్ల రక్తం శుభ్రంగా

రక్తవృద్ధికి మేలైన ఆహారం

శరీరంలో రక్తం తగిన పరిమాణంలో ఉంటేనే మనిషికి ఆరోగ్యం. రక్తం టాక్సిక్‌ (విషపూరితం)గా మారితే అనేక వ్యాధులు వస్తాయి. అందువల్ల రక్తం శుభ్రంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్తాన్ని శుద్ధి చేసుకునే మార్గం మన వంటగదిలోనే ఉందని వారు అంటున్నారు. సమతుల ఆహారం ద్వారా ఎల్లప్పుడూ రక్తం పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవచ్చు. 


శరీరంలో ఉండే కోట్లాది రక్తకణాలకు ప్రాణవాయువును (ఆక్సిజన్‌ను) సరఫరా చేసేది రక్తమే. దేహానికి అవసరమైన హార్మోన్లు, నూట్రియంట్లను కూడా ఆహారం నుంచి తీసుకుని ప్రతి కణానికీ అందిస్తుంది. పోషకాలు కలిగిన మేలైన ఆహారం రక్తవృద్ధికి తోడ్పడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడంలో ఆహారం పోషించే పాత్ర కీలకం కూడా. దేహంలోని అన్ని అవయవాలకు ఆటంకాలు లేకుండా శుభ్రమైన రక్తం సరఫరా కావడానికి సమతుల ఆహారం తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. 

మనం తినే ఆహారం ద్వారా అందిన న్యూట్రియంట్లను రక్తనాళాల్లో ఉన్న కణాలకు రక్తం సరఫరా చేస్తుంది. కణాల నుంచి ‘వ్యర్థాలను’ తీసుకుని వాటిని డి–టాక్సిఫికేషన్‌ ఆర్గాన్లకు పంపుతుంది. చివరకు దేహం నుంచి బయటకు వెళ్ళేలా  చేస్తుంది. అంతేకాదు దేహంలోని పిహెచ్‌, నీరు, ఉష్ణోగ్రత స్థాయుల్ని రక్తం క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధులపై పోరాడే తెల్ల రక్తకణాలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, రక్తంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపించడమే మేలైన మార్గం. ఇందుకోసం ప్రత్యేకంగా మందులువాడే బదులు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని, పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


వ్యాయామం

రోజులో పనిచేసే సమయంలో, ప్రయాణంలో, ఇంటి వద్ద విరామం తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ సమయం కూర్చునే ఉంటే శరీర అవయవాల్లో సరైన కదలికలు ఉండవు. ఇది రక్తం సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగం/వ్యాపార రీత్యా ఎక్కువసేపు కూర్చునే వారికి తప్పనిసరిగా వ్యాయామం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల వేగపు నడక మంచింది. అలా నడవ లేనివాళ్ళు కనీసం ప్రాణాయామం చేయాలి. దీనివల్ల శ్వాసక్రియ క్రమబద్ధం అవుతుంది.  


మంచినీళ్ళు

డీహైడ్రేషన్‌ (దేహంలో నీరు తగినంతగా లేకపోవడం) ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. కొన్ని సమయాల్లో కళ్ళు తిరిగి పడిపోవడం, కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మంచినీళ్ళు తాగడం అనేది కీలకం. తగినంతగా నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు విసర్జింపబడతాయి. రోజుకు విడతల వారీగా కనీసం ఎనిమిది గ్లాసులు అనగా రెండు లీటర్ల మంచినీళ్ళు తాగాలని నిపుణులు చెబుతున్నారు.


పసుపు 

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపులో సహజంగా ఉండే కుర్కుమెన్‌లో యాంటీ ఆక్సిడెంట్ రక్త కణాలకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. కుర్కుమిన్‌లోని రసాయనక వ్యవస్థ ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుతుంది. శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యపరుస్తుంది. యాంటి యాక్సిడెంట్‌ ఎంజైమ్‌లను దేహం సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా కుర్కుమిన్‌ సహాయపడుతుంది.  అందువల్ల రోజూ తినే ఆహారంలో పసపు వినియోగం తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కూర, పప్పు, రసం, సాంబారు వండేటప్పుడు చిటికెడు పసుపు వేస్తే రక్త కణాలు మెరుగుపడతాయి. 


ఉసిరి, బీట్‌రూట్‌

ఉసిరిలో (గూస్‌ బెర్రీలు) యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ ఇ, సి  సమృద్ధిగా ఉంటాయి. ఉసిరికాయలను తినడంవల్ల రక్తశుద్ధి వేగంగా జరుగుతుంది. అంతేకాదు రక్తవృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. భారతీయులు ముఖ్యంగా తెలుగుప్రజలు ఉసిరికాయలతో ఏడాది పొడుగనా నిల్వ ఉండేలా పచ్చళ్ళు  చేసుకోవడం వెనుక ఈ ప్రయోజనం కూడా ఉంది. అలాగే బీట్‌రూట్‌ కూడా ఎంతో  ప్రయోజనకారి. ఇది రక్తాన్ని శుభ్రపరచడమే కాదు రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది కూడా. వారంలో కనీసం రెండు, మూడుసార్లు బీట్‌రూట్‌ను ఆహారంగా తీసుకోవాలి. బీట్‌రూట్‌లో రక్తాన్ని శుభ్రపరిచే ఫొలేట్‌ (విటమిన్‌ బి9) ఉంటుంది. పుష్కలంగా ఫైబర్‌ కూడా ఉంటుంది. దీంట్లో ఉండే మాంగనీస్‌, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ సి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నాళాల్లో రక్తసరఫరా త్వరగా మెరుగుపడుతుంది. కావాలనుకుంటే జ్యూస్‌ చేసుకుని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


ఆకుపచ్చని కూరలతో

ఆకుపచ్చ ఆకులుగల కూరగాయలు క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ వంటివి రక్తశుద్ధికి దోహదపడతాయి. వీటిలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే రక్తశుద్ధికి కీలకంగా పనిచేస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రక్తవృద్ధి, శుద్ధిలో ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాల పాత్ర ముఖ్యమైనది. ఒమెగా3 సప్లిమెంట్లతోపాటు, సోయాబీన్‌, పాలకూర, చేపలు, అవిసె గింజలు, ఆక్రూట్లు (వాల్‌నట్స్‌)లో ఒమెగా 3 పుష్కలంగా ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన బెల్లంలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి ఐరన్‌ మాత్రలను సిఫార్సు చేస్తారు. కొన్నిసార్లు ఐరన్‌ మాత్రలకు బదులు బెల్లం తినాలని కూడా వైద్యులు చెబుతారు. డి–టాక్సిఫైయింగ్‌ ఏజెంటుగా బెల్లం పనిచేస్తుంది. దేహంలో ఉండే టాక్సిన్లను బయటకు వెళ్ళగొట్టడంలో బెల్లం చురుగ్గా పనిచేస్తుంది. దీంతో రక్తశుద్ధి కలుగుతుంది. 


బ్లాక్‌ కాఫీ, లెమన్‌ వాటర్‌

రక్తాన్ని శుద్ధి చేయడంలో లివర్‌ (కాలేయం) కీలకంగా పనిచేస్తుంది. ఆహారాన్ని శక్తిగా మార్చి టాక్సిన్లను బయటకు పంపడానికి కాలేయం సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో నాణ్యమైన బ్లాక్‌ కాఫీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌ కాఫీ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ బి2, బి3, బి5తో పాటు మ్యాంగనీస్‌, పొటాషియం,  మెగ్నీషియం ఉంటాయి. రోజు రెండు కప్పుల బ్లాక్‌ కాఫీ తాగితే లివర్‌ శుభ్రపడుతుంది. ఫలితంగా రక్తశుద్ధి మెరుగవుతుంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. నిమ్మకాయల్లో ఉండే విటమిన్‌ సి రోగనిరోధకతను పెంపొందిస్తుంది. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. లివర్‌లో ఉండే టాక్సిన్లను బయటకు పంపడానికి ఇది తోడ్పడుతుంది. రోజు ఉదయం ఒక కప్పు లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, రక్తవృద్ధి మెరుగవుతాయి. 


వెల్లుల్లి, అల్లం

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఇక్కడ ఉల్లి అంటే వెల్లుల్లి అని అర్థం. వెల్లుల్లిలో నూట్రియంట్లు అధికంగా ఉంటాయి. క్యాలరీలు మాత్రం తక్కువ. అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా వెల్లుల్లి ద్వారా లభిస్తాయి. సల్ఫర్‌, పొటాషియం, ఐరన్‌, విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొడితే ఉత్పత్తి అయ్యే అల్లిసిన్‌ యాంటి బయొటెక్‌గా పనిచేస్తుంది. ఇది గుండె  పనితీరును మెరుగుపరుస్తుంది. భోజనానికి కనీసం 30 నిమిషాల ముందు ఒక గ్లాసుడు నీళ్ళలో వెల్లులి రసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నేరుగా వెల్లుల్లి రెబ్బల్ని తింటే వాసన వస్తుంది. అందువల్ల ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది.  అల్లం విటమిన్‌ బి3, బి6, విటమిన్‌ సిలకు నెలవు. మెగ్నీషియం కూడా పుష్కలం. జీర్ణాశయ సమస్యలకు అల్లం ఔషధంగా పనిచేస్తుంది. దేహంలో టాక్సిన్లను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరించి రక్తంలో షుగర్‌ స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. గుండె సమస్యలను నివారించి, పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తశుద్ధిని వేగవంతం చేస్తుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 గ్రాముల అల్లం ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణుల విషయంలో ఏ రూపంలోనూ రోజుకు ఒక గ్రాముకు మించి అల్లం తీసుకోరాదు. పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు అల్లం ఇవ్వకపోవడమే మంచిది. రోజు రెండు కప్పుల అల్లం టీ తాగితే రక్తవృద్ధికి తోడ్పడుతుంది. 


చక్కటి నిద్ర

రక్తంలో టాక్సిన్లను తొలగించడం, శుద్ధి చేయడంలో నిద్ర కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే సమయంలో రక్తపోటు తగ్గుతుంది. కండరాలు విశ్రమిస్తాయి. శ్వాస తీసుకోవడం తగ్గుతుంది. కణజాలంలో  మరమ్మతులు  జరుగుతాయి. కణాల పునర్నిర్మాణానికి అవసరమైన హార్మోలు నిద్రపోయే సమయంలోనే విడుదల అవుతాయి.   దేహంలో రక్తశుద్ధి వేగవంతగా జరుగుతుంది. అందువల్ల రోజూ క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. 


తులసి ఆకు, విత్తనాలు

సాధారణంగా ఎక్కడా తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి ఆకులు, విత్తనాలు శరీర ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు చివరి ప్రయత్నంగా  ఆ వ్యక్తి నోటిలో తులసి ఆకు రసం పోయడం తెలిసిన విషయమే. తులసి ఆకు, విత్తనాలు యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దేహాంలో తగినంత ఉష్టోగ్రత ఉండేలా చూడటానికి తులసి ఆకు రసం ఉపయోగపడుతుంది. తులసి విత్తనాల్లో (గింజల్లో) ఐరన్‌, విటమిన్‌ కె, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్‌ కారణంగా రక్తవృద్ధి జరుగుతుంది. ఈ గింజలను రోజూ తినడం వల్ల దేహంలో కొల్లాజెన్ స్రవించడానికి తోడ్పడుతుంది. కొత్త చర్మకణాలు ఉత్పత్తికి కొల్లాజెన్ సహాయపడుతుంది. దెబ్బతిన్న చర్మ కణజాలం తొలగిపోయి కొత్త కణాలు రావడం వల్ల దేహంలోని టాక్సిన్లు స్వేద గ్రంధుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సూర్యకిరణాల నుంచి విటమిన్‌ డి సగ్రహించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఫలితంగా ఎర్ర రక్తకణాల వృద్ధిచెందుతాయి. రక్తవృద్ధి, రక్తశుద్ధికి తులసి ఆకు, విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

– నిడుమోలు వసుధ


Updated Date - 2020-02-28T20:30:28+05:30 IST