మంచి చొరవ !

ABN , First Publish Date - 2021-06-25T09:29:31+05:30 IST

జమ్ముకశ్మీర్‌ రాజకీయ పక్షాల నేతలతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశం మంచి ముందడుగు. ఈ భేటీ నిరవధికంగా మూడుగంటలపాటు కొనసాగడమే...

మంచి చొరవ !

జమ్ముకశ్మీర్‌ రాజకీయ పక్షాల నేతలతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశం మంచి ముందడుగు. ఈ భేటీ నిరవధికంగా మూడుగంటలపాటు కొనసాగడమే అది విజయవంతమైనదనడానికి నిదర్శనమని బీజేపీ నాయకులొకరు వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రప్రతిపత్తి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నోట విస్పష్టంగా వినడం కొందరికి కచ్చితంగా ఆనందం కలిగించే ఉంటుంది. రెండేళ్ళక్రితం మాటమాత్రంగానైనా చెప్పకుండా, ప్రత్యేకప్రతిపత్తిని ఏకపక్షంగా రద్దుచేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు తమను ఇలా పిలిచి, స్వయంగా ప్రధాని నేతృత్వంలోనే సమావేశం నిర్వహించడం వారికి మెట్టుదిగిరావడంగా కూడా కనిపించి ఉండవచ్చు.


రాష్ట్రాన్ని హఠాత్తుగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసిన కేంద్రపెద్దలు సరైన సమయంలో, కాస్త ముందూవెనుకా చూసుకొని తిరిగి రాష్ట్రం చేస్తామని గతంలోనే పలుమార్లు అన్నారు. ఇప్పుడు ప్రధాని నోట వెలువడిన మాట కొత్తదేమీ కాదు కానీ, నియోజకవర్గాల పునర్విభజన సాధనే లక్ష్యంగా జరిగిన సమావేశం కనుక, అది మరోమారు వినిపించింది. పునర్విభజన ప్రక్రియ ఎంతవేగంగా ముగిస్తే అంత వెంటనే ఎన్నికలు జరుగుతాయని ప్రధాని ప్రకటించారు. ఒక్క మరణం సంభవించినా బాధాగానే ఉంటుందనీ, కశ్మీర్‌కోసం, దేశంకోసం సమష్టిగా పనిచేయాలనడం ద్వారా ప్రధాని అక్కడున్నవారితో చేయీచేయీ కలిపిన సందేశం ఇచ్చారు. శాంతి, ప్రజాస్వామ్యం, ప్రజల్లో కొత్త ఆశలు ఇత్యాది మాటలన్నీ వాతావరణం చక్కగా ఉన్నదని చెప్పడమే. శాంతికోసం ఏమైనా చేస్తాననీ, సంఘర్షణ తనకు నచ్చదని కూడా ప్రధాని అన్నట్టు సమావేశంలో పాల్గొన్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత చెప్పుకొచ్చారు. సమావేశం యావత్తూ చక్కగా సాఫీగా సాగిందనీ, ఇకపై జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్న నమ్మకం తమకు కలిగిందని సజ్జాద్‌లోన్‌ అంటున్నారు. 


ప్రత్యేకప్రతిపత్తి రద్దుచేసిన తరువాత కేంద్రం ఇటుతిరిగిచూడటం ఇదే మొదటిసారి కనుక ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. 2019 ఆగస్టు పూర్వస్థితి సాధనే లక్ష్యంగా పెట్టుకున్న గుప్కార్‌ అలయెన్స్‌ ఈ సమావేశంలో తన వాదననైతే వినిపించగలిగింది. అయితే, ఈ లక్ష్య సాధనకోసం ప్రజలను రెచ్చగొట్టేదీ, అడ్డుతోవలు తొక్కేది లేదనీ న్యాయమార్గంలో నడుస్తామని ఒమర్‌ అబ్దుల్లా ప్రకటించారు కనుక కేంద్రానికి ఏ బాధా ఉండదు. 370 అధికరణ విషయం కోర్టు విచారణలో ఉన్నది కనుకనే ప్రధాని మాట్లాడలేదని మరికొందరు సమర్థించారు. ఏతావాతా ఈ సమావేశంతో కేంద్రానికి తాను ఆశించిన రీతిలో అడుగులువేయడానికి వీలు ఏర్పడినట్టే. జమ్మూకశ్మీర్‌ను ఇదే రూపంలో ఎంతోకాలం కొనసాగించడం అసాధ్యం, ప్రమాదం కూడా. నియోజకవర్గాల పునర్విభజన నిమిత్తం గత ఏడాది కమిషన్‌ ప్రకటించగానే కశ్మీర్‌ రాజకీయపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1995లో రాష్ట్రపతిపాలన ఉండగా ఈ ప్రక్రియ జరిగింది. తిరిగిపదేళ్ళకు జరగాల్సిన ప్రక్రియను రెండేళ్ళ ముందే ఫరూక్‌ అబ్దుల్లా ప్రజాప్రాతినిధ్యచట్టాన్ని సవరించి 2026వరకూ ముట్టుకోలేకుండా చేశారు. ఈ కారణంగా జమ్మూ ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయిందని బీజేపీ బాధ. ఇప్పుడు తారుమారైన పరిస్థితులను తనకు అనుకూలంగా తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నించడం సహజం. ప్రధాన రాజకీయపక్షాల అనుమానమంతా ఈ పునర్విభజన ప్రక్రియలో కశ్మీ్‌ర్‌కంటే జమ్మూ, లద్దాఖ్‌ ప్రాతినిధ్యం హెచ్చుతుందనీ, విలీనాలు, సంలీనాలతో అన్ని హద్దులూ మారిపోతాయనీ. కశ్మీర్‌ రాజకీయపక్షాలేవీ ఇంతకాలమూ రంజన్‌ ప్రకాష్‌ దేశాయ్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌ కమిషన్‌ భేటీలకు హాజరుకాలేదు. పీడీపీతో తెగదెంపులు చేసుకొని, రాష్ట్రపతిపాలన విధించిన మూడేళ్ళ తరువాత కేంద్రప్రభుత్వం ఇప్పుడు అటువైపుగా దృష్టిసారించడానికి అఫ్ఘానిస్థాన్‌లో అనూహ్యంగా మారిన పరిస్థితులు, వేర్వేరు దిక్కుల్లో చైనా చొరబాట్లు కారణాలు కావచ్చు. స్థానిక ఎన్నికల్లో అతిపెద్దపార్టీగా అవతరించినప్పటికీ, కశ్మీర్‌లో వేళ్ళూనుకొనివున్న పాతతరం పార్టీల స్థానంలో సజ్జాద్‌లోన్‌ వంటివారిని ముందుకు తేగలమన్న నమ్మకం క్రమంగా చెరిగిపోవడమూ కావచ్చు. ఏదిఏమైనా కేంద్రం తీసుకొన్న ఈ చొరవ ప్రశంసనీయమైనదే. ఏ కారణాలతో చొరవచూపినప్పటికీ శాంతినెలకొనడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులువేయడం ముఖ్యం.

Updated Date - 2021-06-25T09:29:31+05:30 IST