మంచి మాటతీరుతోనే మన్నన

ABN , First Publish Date - 2021-12-10T04:30:01+05:30 IST

సృష్టిలోని జీవరాశులన్నిటిలో భావాలను వ్యక్తం చేసే శక్తి మానవులకే ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడతారు....

మంచి మాటతీరుతోనే  మన్నన

సృష్టిలోని జీవరాశులన్నిటిలో భావాలను వ్యక్తం చేసే శక్తి మానవులకే ఉంది. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడతారు. ఒక వ్యక్తి మాట్లాడే పద్ధతి ద్వారా అతని స్వభావాన్ని అంచనా వేయగలం. మంచిగా మెలగి, స్నేహభావంతో మాట్లాడే వారు ఉన్నత వ్యక్తులుగా పరిగణన పొందుతారు. జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఆ వ్యక్తి ఉత్తమ గురువు, ఉత్తమ పుత్రుడు, ఉత్తమ స్నేహితుడు, ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ వ్యాపారి అవుతాడు. 


అందంగా, ఆకర్షణీయంగా ఉన్నవారిని లోకులు ప్రత్యేకంగా అభిమానిస్తారు. సంపన్నులకు ఎక్కువ విలువ ఇస్తారు. కానీ ఎంత అందంగా ఉన్నవారైనా, ఎంత సంపద కలిగినవారైనా... వాళ్ళు మాట్లాడే తీరు సరిగ్గా లేకపోతే ఎవరూ గౌరవించరు. సౌమ్యంగా, స్నేహపూరితంగా, ఆకట్టుకొనేలా, ఇతరులను గౌరవించేలా, ధైర్యం కలిగించేలా సంభాషించే వ్యక్తిని అందరూ ఇష్టపడతారు. అతని రాకకోసం ఎదురు చూస్తారు. అతని పలకరింపు కోసం పిల్లలు ఎదురు చూస్తారు. అతనితో కలిసి ఉండడానికి బంధువులు, మిత్రులు ఎదురుచూస్తారు. అతని ఆజ్ఞ శిరసావహించడానికి శిష్యులు సదా సిద్ధంగా ఉంటారు.


మహా ప్రవక్త మహమ్మద్‌ ఎప్పుడూ వేగంగా సంభాషించేవారు కాదు. ఆయన సంభాషణలో ఎన్ని పదాలున్నాయో సునాయాసంగా లెక్కించగలిగేలా మాట్లాడేవారని ‘హదీసు’లు చెబుతున్నాయి. వేగంగా, తొందరపడి మాట్లాడడం సరైనది కాదని, బాధ్యతగా మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలనీ మహా ప్రవక్త జీవితం మనకు తెలియజేస్తుంది. ‘నా మాటలు సరైనవేనా?’ అని బేరీజు వేసుకొని, ఆచితూచి మాట్లాడడం ఉత్తముల లక్షణం. అలా మాట్లాడే వ్యక్తి... వాటిని వినేవారికి కూడా మేలు చేకూరుస్తాడు. మంచి మాటతీరు మన్ననలు అందుకుంటుంది. మధురమైన సంభాషణ దేవునికి కూడా ప్రీతిపాత్రమే అవుతుంది.

                                                                                          మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-12-10T04:30:01+05:30 IST