ఉపరాష్ట్రపతి చొరవతో నెల్లూరు రైతులకు శుభవార్త

ABN , First Publish Date - 2020-09-19T01:30:57+05:30 IST

నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు...

ఉపరాష్ట్రపతి చొరవతో నెల్లూరు రైతులకు శుభవార్త

న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు నెల్లూరు జిల్లాలో తడిసిన ధాన్యాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని ఎఫ్.సి.ఐ. గిడ్డంగులకు తరలించి, ఉప్పుడు బియ్యంగా వాడుకునేందుకు అంగీకారం తెలిపింది. రవాణా ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించే పక్షంలో ధాన్యాన్ని సేకరించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రైల్వే శాఖతో సమన్వయం చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది.


ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వ లేఖ ఆధారంగా ఉపరాష్ట్రపతి చొరవ తీసుకుని, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో పాటు హోంశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. దీనిపై స్పందించిన.. కేంద్రం ఈ రోజు తగిన ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిర్ణయించిన తేదీల ప్రకారం ఆగస్టు 31నే ధాన్యం సేకరణ గడువు ముగిసింది. అయితే.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తితో అధికారులతో మాట్లాడి సెప్టెంబర్ 30 వరకు ధాన్యం సేకరణ గడువు పెంచేలా ఉపరాష్ట్రపతి గతంలో చొరవ తీసుకున్న సంగతి విదితమే.

Updated Date - 2020-09-19T01:30:57+05:30 IST