Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయిల్‌పామ్‌ రైతులకు శుభవార్త

  • టన్ను గెలల ధర రూ.800-900 పెరిగే అవకాశం
  • అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రాతిపదికన ధర నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు శుభవార్త. 2020-21 ఆయిల్‌ సంవత్సరానికి టన్ను గెలల ధర రూ.800 నుంచి రూ.900 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.17 వేలు ఉండగా.. ఇక నుంచి రూ.17,800 నుంచి రూ.17,900 వరకు ధర పెరగనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు, రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ గెలల ధరల నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రకటించిన ఫార్ములా ఆధారంగా ఆయిల్‌ రికవరీ శాతాన్ని బట్టి ధరలు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. గత సీజన్‌లో 2.38 లక్షల టన్నుల గెలలు ఉత్పత్తికాగా వాటిని గానుగాడిస్తే 45 వేల టన్నుల క్రూడ్‌ పామాయిల్‌ వచ్చింది. టన్ను పామాయిల్‌కు రూ.1,05,000 ధర గిట్టుబాటు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఫ్యాక్టరీల్లో ఆయిల్‌ రికవరీ 17.45 శాతం రాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆయిల్‌ ఫ్యాక్టరీలో 18.67 శాతం ఆయిల్‌ రికవరీ వచ్చింది.


అప్పారావుపేట ఫ్యాక్టరీలో మాత్రం 19.22 శాతం రికవరీ వచ్చింది. ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు ఈ మూడింటి సగటును పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయించాలని ప్రఽభుత్వానికి ప్రతిపాదించారు. అలాగైతే గెలల ధర పెరుగుదల స్వల్పంగా ఉండి రైతులకు నష్టం కలుగుతుందని రఘునందన్‌రావు, వెంకట్రాంరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. అత్యధిక రికవరీ రేటు వచ్చిన అప్పారావుపేట ఫ్యాక్టరీని పరిగణనలోకి తీసుకొని ధర నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం రైతులకు టన్నుకు రూ.17,800 నుంచి రూ.17,900 వరకు లభిస్తుందని వెంకట్రాంరెడ్డి తెలిపారు. 19.22 శాతం రికవరీ రేటు దేశంలోనే అత్యధికమన్నారు.

Advertisement
Advertisement