రూ. 5కోట్ల లోపు ఐటీ వివాదాలకు విముక్తి!

ABN , First Publish Date - 2020-03-14T06:41:54+05:30 IST

దీర్ఘకాలంగా పన్ను వివాదాలు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి పెనాల్టీ, అపరాధ వడ్డీ లేకుండా బకాయి మొత్తం చెల్లించి కేసుల నుంచి బయటపడేందుకు వీలు కల్పించే ‘వివాద్‌ సే విశ్వాస్‌’

రూ. 5కోట్ల లోపు ఐటీ వివాదాలకు విముక్తి!

వివాద్‌ సే విశ్వాస్‌కు పార్లమెంట్‌ ఆమోదం

మోసగాళ్లకు వర్తించదు : నిర్మలా సీతారామన్‌


న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలంగా పన్ను వివాదాలు ఎదుర్కొంటున్న వారు ఎలాంటి పెనాల్టీ, అపరాధ వడ్డీ లేకుండా బకాయి మొత్తం చెల్లించి కేసుల నుంచి బయటపడేందుకు వీలు కల్పించే ‘వివాద్‌ సే విశ్వాస్‌’ బిల్లును రాజ్యసభ శుక్రవారం ఆమోదించింది. ఈ నెల రెండో తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు నాలుగో తేదీన లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో దీనికి చట్టపరమైన ప్రతిపత్తి లభిస్తుంది. వివాద్‌ సే విశ్వాస్‌ కింద పన్ను వివాదాల పరిష్కారానికి గరిష్ఠ పరిమితి రూ.5 కోట్ల వరకే ఉంటుంది. ఆలోపు పన్ను వివాదాల్లో చిక్కుకున్న వారు ఎలాంటి అపరాధ వడ్డీలు, జరిమానాలు లేకుండా చెల్లించాల్సిన పన్ను మాత్రం చెల్లించి వివాదం నుంచి బయటపడవచ్చు. ఈ అవకాశం ఉపయోగించుకునేందుకు  మార్చి 31 వరకే గడువు విధించారు. మార్చి 31 పైబడి జూన్‌ 30 లోపు వివాదం పరిష్కరించుకునేందుకు ముందుకు వచ్చే వారు తాము చెల్లించాల్సిన బకాయికి 10 శాతం అదనపు పెనాల్టీ కూడా జోడించి చెల్లించాల్సి ఉంటుంది.


ఇది క్షమాభిక్ష ఏ మాత్రం కాదు 

డీమానిటైజేషన్‌ సమయంలో బ్యాంకుల్లో భారీ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారికి, మోసగాళ్లకు ఇది క్షమాభిక్ష ఏ మాత్రం కాదని అంతకు ముందు సభలో చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అలాంటి వారు డీమానిటైజేషన్‌ సమయంలో చేసిన డిపాజిట్ల మొ త్తంలో 75 శాతం పన్ను చెల్లించినప్పుడే వారికి కేసుల నుంచి విముక్తి లభిస్తుందని ఆమె అన్నారు.  మోసపూరిత లావాదేవీలను నిర్వహించిన  వారు   దీని ద్వారా లబ్ధి పొందకుండా నివారించేందుకే వివాదంలో చిక్కుకున్న పన్ను గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఆలోపు బకాయిలున్న వారు మాత్రమే వివాద్‌ సే విశ్వాస్‌ కింద పన్ను చెల్లింపునకు అర్హత ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఆదాయపు పన్ను చట్టం కింద వచ్చిన వివాదాలకు తప్ప సంపద పన్ను చట్టం వివాదాలకు ఇది వర్తించదని ఆమె అన్నారు. అంతే కాదు ఐటీ సోదాలు, దాడు లు జరిగిన కేసుల్లో రూ.5 కోట్లలోపు ఆస్తులు స్వాధీనం చేసుకున్న కేసులకు కూడా ఇది వర్తిస్తుందని ఆమె చెప్పారు. వడ్డీ చెల్లింపులు, పెనాల్టీలకు సంబంధించిన వివాదాలైతే మాత్రం అలాంటి వారు వివాదంలో చిక్కుకున్న మొత్తంలో 25ు పెనాల్టీ లేదా వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఐటీ చట్టం కింద ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొంటున్న వారు మాత్రమే ఈ పరిష్కారానికి అర్హత కలిగి ఉంటారని చెప్పారు. 2017-18 అసె్‌సమెంట్‌ సంవత్సరం తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని కూడా ఆమె తెలిపారు. వివాద్‌ సే విశ్వాస్‌ వర్తించే గడువును మార్చి 31గాను, 10ు పెనాల్టీతో గడువు జూ న్‌ 30 వరకు ఇచ్చినప్పటికీ స్కీమ్‌ ఎప్పుడు ముగుస్తుందనేది తదుపరి నోటిఫై చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. వివాద్‌ సే విశ్వాస్‌ అనే పదంపై హిందీయేతర భాషల వారికి పూర్తి అవగాహన కోసం ఆయా భాషల్లో వాస్తవికమైన అర్ధం తెలియచేసే విధంగా రాష్ర్టాలన్నింటికీ స్థానిక భాషల్లో సర్కులర్లు పంపుతామని ఆమె చెప్పారు. 


వివాదంలో రూ.9.32 లక్షల కోట్లు

దేశంలో ఇప్పటివరకు 4.83 లక్షల ప్రత్యక్ష పన్ను కేసులు వివిధ కోర్టులు, డెట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌, ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్స్‌ ముందు పెండింగులో ఉన్నాయి. వీటిలో చిక్కుకున్న వివాదాస్పద పన్ను బకాయిల విలువ రూ.9.32 లక్షల కోట్లుంది. ఈ కేసుల్లో అధిక శాతం పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంది.

Updated Date - 2020-03-14T06:41:54+05:30 IST