శుభారంభం

ABN , First Publish Date - 2021-01-17T07:25:18+05:30 IST

కరోనా కష్టకాలాన్ని ఎదురీదుతున్న దేశ ప్రజలు.. ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనా మహమ్మారి అంతం దిశగా భారత్‌ శుభారంభం పలికింది. ఇన్ఫెక్షన్ల

శుభారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంతో కరోనా అంతానికి నాంది 

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

దేశంలో తొలి టీకా వేయించుకున్న పారిశుధ్య కార్మికుడు మనీశ్‌కుమార్‌

‘అపోలో’ ప్రతాప్‌రెడ్డి, ఎయిమ్స్‌ డైరెక్టర్‌, పలువురు ప్రముఖులు కూడా..

తొలి రోజున 1,91,181 మందికి వ్యాక్సినేషన్‌ 

11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండింటి వాడకం

ఢిల్లీలో 51 మందిలో దుష్ప్రభావాలు

ఒకరి ఆరోగ్యం విషమం, ఎయిమ్స్‌ ఐసీయూలో భర్తీ


 దేశంలోనే మొట్టమొదటి టీకాను వేయించుకునేందుకు నేను సిద్ధమని మా సూపర్‌వైజర్‌కు చెప్పాను. టీకాలపై ప్రజలకున్న భయాలు, సందేహాలను దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

- మనీశ్‌కుమార్‌


న్యూఢిల్లీ, జనవరి 16 : కరోనా కష్టకాలాన్ని ఎదురీదుతున్న దేశ ప్రజలు.. ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనా మహమ్మారి అంతం దిశగా భారత్‌ శుభారంభం పలికింది. ఇన్ఫెక్షన్ల వ్యాప్తి మొదలైన దాదాపు ఏడాది తర్వాత.. వైరస్‌ పీచమణిచేందుకు వ్యాక్సిన్‌తో వార్‌ను ప్రారంభించింది. రెండు (కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌) ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కరోనా వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను శనివారం ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్‌తో.. తొలి విడత టీకా కార్యక్రమానికి వేదికలుగా నిలవనున్న 3,006 వ్యాక్సినేషన్‌ కేంద్రాల సిబ్బంది, అధికారులు అనుసంధానమై ఉండటం విశేషం. అంతకుముందు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ అభినందనలు తెలిపారు.


టీకా కార్యక్రమంలో తొలి రోజున (శనివారం) దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో 1,91,181 మందికి వ్యాక్సినేషన్‌ చేశారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందుకోసం మొత్తం 16,755 మంది వ్యాక్సినేటర్ల సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడించింది. కొవిషీల్డ్‌ టీకాను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయగా, భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను 12 రాష్ట్రాలకే పంపించినట్లు తెలిపింది.

అయితే శనివారం 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్‌), కొవాగ్జిన్‌ టీకాలను రెండింటినీ వాడారని పేర్కొంది. ఆ రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అసోం, బిహార్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ ఉన్నాయని తెలిపింది. ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యాక్సినేషన్‌ అనంతరం దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరలేదని కేంద్రం స్పష్టంచేసింది. 


రాష్ట్రాల్లో తొలి టీకాలు.. 

వివిధ రాష్ట్రాల్లో తొలి టీకా వేయించుకున్న వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో తొలి టీకాను ముంబై జేజే హాస్పిటల్‌ డీన్‌ డాక్టర్‌ రంజిత్‌ మంకేశ్వర్‌కు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి వ్యాక్సిన్‌ను విజయవాడకు చెందిన పుష్పకుమారి అనే ఆరోగ్య కార్యకర్తకు ఇవ్వగా, ఒడిశాలో ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ అశోక్‌ మోహపాత్రకు అందించారు. 



ప్రముఖుల క్యూ..  

తొలిరోజే టీకా వేయించుకున్న ప్రముఖుల్లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా కూడా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీకి విజయం సిద్ధించాలని ఆయన ట్విటర్‌ ద్వారా ఆకాంక్షించారు.


టీకాలు వేయించుకు న్న ఇతర ప్రముఖులు ఎవరంటే.. న్యూఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌, అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతా్‌పరెడ్డి, ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్‌ మోహన్‌ కామేశ్వరన్‌, ఎంజీఆర్‌ మెడికల్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సుధా శేషయ్యన్‌, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) మాజీ అధ్యక్షుడు కేతన్‌ దేశాయ్‌, ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ ఆర్‌.కె.ధీమాన్‌, రాం మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఎ.కె.సింగ్‌. 

ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేల పాకులాట

కరోనా టీకాలు వేయించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాకులాడొద్దని కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ హితవు పలికినా కొందరు పెడచెవిన పెట్టారు. యూపీలో బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర మంత్రి నిర్మల్‌ మజీ, టీఎంసీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ ఛటర్జీ, సుభాష్‌ మోండల్‌లు తొలిరోజే టీకా వేయించుకున్నారు. అయితే వైద్యుడిని కావడంతో టీకా వేయించుకున్నానని బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పరిమితమయ్యారే తప్ప.. టీకా వేయించుకోలేదు. తెలంగాణలో తొలి టీకా తానే వేయించుకుంటానన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సైతం వ్యాక్సినేషన్‌లో ఆరోగ్య కార్యకర్తలకే అగ్రతాంబూలం ఇచ్చారు.


Updated Date - 2021-01-17T07:25:18+05:30 IST