యూసఫ్‌ పఠాన్‌ అల్విదా

ABN , First Publish Date - 2021-02-27T09:03:46+05:30 IST

టీమిండియా ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బంతిని బలంగా బాదడంలో సిద్ధహస్తుడైన పఠాన్‌..

యూసఫ్‌ పఠాన్‌ అల్విదా

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు


న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. బంతిని బలంగా బాదడంలో సిద్ధహస్తుడైన పఠాన్‌ ఆట అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విటర్‌ వేదికగా శుక్రవారం వెల్లడించాడు. ‘నా జీవితంలో క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా’ అని ప్రకటించాడు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్లలో 38 ఏళ్ల యూసఫ్‌ సభ్యుడు. ‘నా కుటుంబానికి, స్నేహితులు, జట్లు, కోచ్‌లు, నాకు మనస్ఫూర్తిగా మద్దతు పలికిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు’ అని అన్నాడు. 57 వన్డేలలో టీమిండియాకు ప్రాతినిఽధ్యం వహించిన పఠాన్‌..113.60 స్ట్రయిక్‌ రేట్‌తో 810 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలున్నాయి. 22 టీ20లు ఆడిన యూసఫ్‌ 146.58 స్ట్రయిక్‌ రేట్‌తో 236 పరుగులు సాధించాడు. ‘భారత జట్టు జెర్సీ వేసుకున్న రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది.


ఆ రోజు నేను కేవలం భారత జట్టు బాధ్యతలే కాదు.. నా కుటుంబం, కోచ్‌లు, స్నేహితులు, యావత్‌ దేశంతోపాటు నా అంచనాలను మోస్తున్నానని భావించా’ అని గుర్తు చేసుకున్నాడు. ‘భారత్‌ రెండు ప్రపంచకప్‌లు సాధించడం, సచిన్‌ టెండూల్కర్‌ను భుజాలపైకి ఎత్తుకోవడం నా కెరీర్‌లో మరిచిపోలేని క్షణాలు. ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ, షేన్‌ వార్న్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌, జాకబ్‌ మార్టిన్‌ నేతృత్వంలో రంజీట్రోఫీలో అరంగేట్రం చేశా. నాపై నమ్మకముంచిన వారందరికీ ధన్యవాదాలు’ అని అన్నాడు. ఉపయుక్తమైన ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా అయిన పఠాన్‌ 100  ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకడు. ఇంకా 199 లిస్ట్‌ ‘ఏ’, మొత్తం 274 టీ20లు ఆడాడు. కోల్‌కతా కెప్టెన్‌ గంభీర్‌, తన సోదరుడు, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తనకు వెన్నుముకగా నిలిచారని యూసఫ్‌ తెలిపాడు. చివరగా..బీసీసీఐ, బరోడా క్రికెట్‌ సంఘాలకు అతడు కృతజ్ఞతలు చెప్పాడు.


 2007లో పాకిస్థాన్‌తో టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన యూసఫ్‌..ఆ మరుసటి ఏడాది పాకిస్థాన్‌పైనే వన్డేలలో అరంగేట్రం చేశాడు. కేకేఆర్‌తోపాటు రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఐపీఎల్‌లో ఆడాడు. 174 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 143 స్ట్రయిక్‌ రేట్‌తో 3204 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్‌ సెంచరీలున్నాయి. అలాగే 42 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్‌ రికార్డు యూసఫ్‌ సొంతం. కోల్‌కతా రెండుసార్లు ,రాజస్థాన్‌ ఒకసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.  కాగా.. గత రెండు ఐపీఎల్‌ వేలాలలో యూసఫ్‌ అమ్ముడు పోలేదు. 


పేసర్‌ వినయ్‌ కూడా..

కర్ణాటక వెటరన్‌ పేసర్‌ ఆర్‌.వినయ్‌కుమార్‌ కూడా అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 37 ఏళ్ల వినయ్‌ ఒక టెస్ట్‌, 31 వన్డేలు, తొమ్మిది టీ20లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ‘25 ఏళ్లుగా పరిగెడుతూ క్రికెట్‌ జీవితంలో ఎన్నో స్టేషన్లగుండా పయనించిన దావణగెరె ఎక్స్‌ప్రెస్‌ చివరగా రిటైర్మెంట్‌ అనే స్టేషన్‌కు చేరుకుంది’ అని ట్విటర్‌లో వినయ్‌ ప్రకటించాడు. సచిన్‌, ధోనీ, కోహ్లీలతో కలిసి ఆడడం అదృష్టంగా పేర్కొన్నాడు.  

Updated Date - 2021-02-27T09:03:46+05:30 IST