Abn logo
May 4 2021 @ 03:01AM

నేడు హుజూరాబాద్‌లో ఈటల కీలక ప్రకటన

  • ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌కు ఈటల గుడ్‌బై?
  • భారీ కాన్వాయ్‌తో అక్కడికి వెళ్లిన ఈటల
  • దేవరయాంజాల్‌ భూ ఆక్రమణలపై 
  • ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీ
  • త్వరగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు


హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా ఎదురుదాడికి దిగుతున్న క్రమంలో ఇకపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం.  సోమవారం శామీర్‌పేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. కోర్టులో దోషిగా తేలితే శిక్షకు సిద్ధమని ప్రకటిస్తూనే, ఇదంతా సీఎం కేసీఆర్‌ చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఈ రకంగా మాట్లాడటాన్ని తప్పుపడతారని కూడా వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రాత్రికి హుజూరాబాద్‌ చేరుకున్నారు. మార్గమధ్యంలో సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. మంగళవారం కూడా ఈటల హుజూరాబాద్‌లోనే ఉండనున్నారు. ముఖ్య అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు జరపనున్నారు. 


తదుపరి చర్యలు తీసుకోకముందే..

పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తనను వదిలిపెట్టబోరని, తప్పుడు కేసులతో జైలుకు పంపించినా ఆశ్చర్యంలేదని సన్నిహితులతో ఈటల వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయినా లొంగేది లేదని.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి, దూకుడుగా ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి ఈటల వచ్చారని తెలుస్తోంది. మంగళవారం హుజూరాబాద్‌లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి స్పీకర్‌ను కలిసి నిర్ణీత నమూనాలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.


ఆరు నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నిక !

ఈటల హుజూరాబాద్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే స్థానం ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ మేరకు ఈటల రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వస్తుంది. 


ఇంట గెలిచాకే..!

ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చాక ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్‌ఎ్‌సకు సవాల్‌ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెబుతున్నారు.


ఈటల భద్రత కుదింపు

ఈటలకు భద్రతను ప్రభుత్వం కుదించింది. ప్రొటోకాల్‌ను ఉపసంహరించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌, ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాలను వెనక్కి తెప్పించుకుంది. సాధారణ ఎమ్మెల్యేకు ఉండే విధంగా ఇద్దరు గన్‌మెన్ల (2+2) సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు దెయ్యమా?

Advertisement
Advertisement
Advertisement