ఇది సినిమా కథ కాదు.. ఓ చీటర్ రియల్ స్టోరీ..!

ABN , First Publish Date - 2022-05-02T00:13:18+05:30 IST

అతను అద్వానీకి దత్త పుత్రుడట.. మలేషియాలో మిలీనియరట... అతని ఖాతాలో కాసులకు కొదవే లేదట. జన్మభూమిపై మమకారంతో..

ఇది సినిమా కథ కాదు.. ఓ చీటర్ రియల్ స్టోరీ..!

అతను అద్వానీకి దత్త పుత్రుడట.. మలేషియాలో మిలీనియరట... అతని ఖాతాలో కాసులకు కొదవే  లేదట. జన్మభూమిపై మమకారంతో ఇక్కడ సేవ కార్యక్రమాలకు పూనుకున్నాడట.  చివరికి సీన్ కట్ జనాలా దగ్గరే డబ్బులు వసూలు చేసి వారికే కుచ్చుటోపీ పెట్టేసి వెళ్ళిపోయాడట.. ఇవన్నీ వింటుంటే మీకు ఈ పాటికి ఓ సినిమా గుర్తుకు రావాలి...కానీ.  ఇది సినిమా స్టోరీ కాదండోయ్..  స్వచ్ఛంద సంస్థ పేరిట జనాలను ముంచిన ఓ చీటర్ రియల్ స్టోరీ ఇది.


కరోనా కల్లోలం‎లో జనాలు కూటికి లేక అల్లాడుతుంటే  జనాల ఆకలి కేకలు చూసి వందలాది చేతులు ఆపన్నహస్తం అందించాయి. వారి ఆకలి తీర్చాయి. అదే సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా  సహాయం చేశాయి. తామున్నాం అని అభయమిచ్చాయి. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు ఓ వ్యక్తి.. మలేషియాలో తానో పారిశ్రామిక వేత్తనని జన్మభూమి ఆకలి కేకలకు మనసు కదిలి వచ్చానని సేవ కార్య క్రమాలు కొనసాగించాడు. అడిగిన వారికల్లా అన్నం పెడుతుంటే అతని సేవాభావాన్ని చూసిన కొందరు అతనితో కదిలారు. అలా అతనికంటూ ఓ సైన్యం ఏర్పడింది. 


ఆ మలేషియా మిలీనియర్ పేరు పేరు రఘురాం. పుట్టింది నెల్లూరు, పెరిగింది చెన్నై. మోసం చేసింది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలని. ఇతని ఉచ్చులో చిక్కి  మోసపోయిన వారు  ఉభయ  తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతను కొల్లగొట్టిన డబ్బు కోట్లలో ఉంటుంది. దోచుకున్న డబ్బులో గోరంత సేవ కార్యక్రమాలకు వినియోగించి మిగతా మొత్తాన్ని తన  ఖాతాలో వేసుకున్నాడు.. జనాలు తిరగబడగానే ఉడాయించాడు. 


ఇంతసేపు మనం ఉపోద్ఘాతం ఇచ్చుకున్న ఈ రఘు రామ్... ఆర్‌అండ్‌ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. ఇతనే ఈ ఫౌండేషన్‌కు ఫౌండర్ అండ్ చైర్మన్‌గా ఉన్నాడు.. తెలంగాణలో  హైద్రాబాద్ కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కేంద్రంగా ఈ ట్రస్ట్ నడుస్తోంది. ఈ ట్రస్ట్ ద్వారా వాలంటీర్లను నియమించుకుని కొన్నాళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ కార్యక్రమాలను  నిర్వహిస్తుంటాడు. ప్రధానంగా రఘురాం తన ట్రస్ట్ ద్వారా ఓ వర్గం జనాలను టార్గెట్ చేశాడు.


జనాలను ముంచుదాం అని పక్కాగా ప్లాన్ చేసుకున్న రఘురాం  పక్కా ప్రణాళికతో జనాల ముందుకు వెళ్లాడు . ఈ ప్లాన్‌లో భాగంగానే ఆర్‌అండ్‌ఆర్ ట్రస్ట్‌కు అనుబంధంగా గత రెండేళ్ల క్రితం గుడ్‌షెపర్డ్ ఫాండేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో కొవిడ్ కాలంలో తనతో పాటు పని చేసిన కొందరిని ట్రస్టీలుగా నియమించాడు. దీనికి కూడా తొలుత ఫౌండర్‌గా రఘురాం ఉన్నారు. ఈ ఫౌండేషన్ కేంద్రంగా కోట్లు కొల్లగొట్టాలని స్కెచ్ వేశాడు రఘురాం. తాను గుడ్‌షెపర్డ్ ద్వారా క్రిస్టియన్‌లకు ఏం చేయబోతున్నాడో ఆన్న అంశాలను పేర్కొంటూ ఓ మేనిఫెస్టో తయారు చేశాడు. మేనిఫెస్టో‌ను అప్పటికే తనకున్న ఆర్‌అండ్‌ఆర్ ట్రస్ట్ వాలంటీర్‌ల ద్వారా ప్రచారం కల్పించాడు.. గుడ్ షెఫర్డ్  ఫౌండేషన్ కోసం నూతనంగా వాలంటీర్‌లను నియమించుకున్నాడు. 


ముందు సజావుగా నడిచిన గుడ్‌షెపర్డ్ ఫౌండేషన్‌లో అవకతవకలు చోటు చేసుకోవడంతో కొందరు ట్రస్టీలు ఎదురు తిరిగారు. అలా అక్రమాలను ప్రశ్నించిన కొందరిని ట్రస్టీ‌లుగా తప్పించి వారిని మరో ngo‌లోకి బదలాయించాడు. తనకు ఒత్తాసు పలికే వ్యక్తులను సంస్థలో ట్రస్టీ‌లుగా నియమించుకున్నాడు.. ఫౌండేషన్  తన అనుకూల వ్యక్తినీ ఫౌండర్‌గా నియమించుకున్న రఘురాం తాను ఫౌండర్ బాధ్యతల నుంచి తప్పుకుని గుడ్‌షెపర్డ్ ఫౌండేషన్‌కు సపోర్టర్‌గా మారాడనీ తొలగించబడిన ట్రస్టీలు చెప్తున్నారు.


గుడ్‌షెపర్డ్ ఫౌండేషన్ కేంద్రంగా కోట్లు కొల్లగొట్టడం కోసం గుడ్ షెప్పర్డ్ ఫౌండేషన్‌కు సపోర్టర్‌గా ఉంటూ ప్రతి జిల్లాకు నాలుగు కమిటీలు వేశాడు. ఈ నాలుగు కమిటీల ద్వారా గుడ్ షెపర్డ్ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్ళారు. పేద క్రైస్తవులకు ఇల్లు కట్టించడం, ఫాస్టర్లకు విల్లాలు ఇవ్వడం, చర్చిలను నిర్మించడం, వంటి అంశాలను మేనిఫెస్టో‌లో పొందుపరిచారు. ఇవే కాకుండా నిత్యం వివిధ జిల్లాల పర్యటనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి పలు ప్రాజెక్టులు ఇప్పిస్తామని నమ్మబలికాడు. వెళ్ళిన ప్రతిచోట భారీ ఎత్తున మీటింగ్‌లు పెట్టాడు . ఆ మీటింగ్‌లకు డబ్బు కూడా జనాలు నుంచి వసూలు చేశాడు.. మేనిఫెస్టో‌లోని సేవలు పొందాలంటే సంస్థలో సభ్యత్వం తీసుకుని ఉండాలని ఎలాంటి లెక్క పత్రం లేకుండా ఒక్కొక్కరి నుంచి 4 వేల నుండి 5 వేలు వసూల్ చేశారు. 


ఇలా ఈ నాలుగు కమిటీలు వసూలు చేసిన డబ్బును రఘురాం గుడ్ షెపర్డ్  ఫౌండేషన్‌కు కాకుండా తన ఆర్‌అండ్‎ఆర్ ట్రస్ట్ అకౌంట్‌లోకి జమ చేయించుకున్నాడు.  ఈ కమిటీ మెంబర్లు వసూలు చేసిన డబ్బునంత upi పేమెంట్ ద్వారా రఘురాం తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది నుంచి సభ్యత్వం వసూలు చేశాడు రఘురాం. ఆ డబ్బును మొత్తం తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.  అలా వచ్చిన డబ్బుతో చెదురుమదురు సేవా కార్యక్రమాలు చేసి జనాల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసిన కూడా భారీగా జనాలతో హడావిడి చేసేవాడు .దీంతో జనాలు కూడా రఘురాంను నమ్మారు. తమకు మేలు చేస్తారనే ఉద్దేశంతో లక్షలాది మంది సంస్థలో భాగస్వామ్యం అవ్వడానికి డబ్బులు కట్టి మోసపోయామని వాపోతున్నారు .


ఇవే కాకుండా రఘురాం ప్రముఖులతో దిగిన ఫొటోలను చూపించి తనకు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంంధాలున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలను నమ్మించాడు. తన సేవా కార్యక్రమాలను చూసిన ప్రభుత్వ పెద్దలే తనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేవాడట. మరోవైపు తనకు తెలిసిన విదేశీయుల వద్ద బ్లాక్‌మనీ ఉందని ఆ మనీ కావాలంటే ప్రతిఒక్కరూ ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు రెండు వేల రూపాయలు తనకు చెల్లిస్తే ఒక్కొక్కరి ఖాతాలో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు జమ చేయిస్తానని చెప్పడంతో వరంగల్‌తో పాటు కృష్ణా, గోదావరి జిల్లాలోని చాలా మంది రఘురాంకు రెండు వేల రూపాయల చొప్పున సమర్పించుకున్నారు. మరోవైపు ప్రతి జిల్లాకు, మండలానికి తమ సంస్థ తరపున ఉద్యోగాలు ఉన్నాయని, వేలల్లో జీతం ఇస్తామని రఘురాం చెప్పడంతో ఆ ఉద్యోగాలు పొందేందుకు కూడా రఘురాంకు ఆశావహులు లక్షలాది రూపాయలు ఇచ్చుకున్నారు .


ఒకవైపు సంస్థకు కాంట్రిబ్యూషన్, మరోవైపు వివిధ స్కీమ్‌లు ద్వారా లబ్ది పొందేలా చేస్తామని లక్షల్లో వసూలు చేసిన రఘురాం రోజులు గడుస్తున్నా.. సహాయం పొందని జనాలు కమిటీ మెంబర్లను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో కమిటీ మెంబర్లపై ఒత్తిడి పెరగడంతో రఘురాంను నిలదీశారు . క్రైస్తవ కమ్యూనిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపి వేసిందని..మరోవైపు తనకు మలేషియా నుంచి రావాల్సిన డబ్బులు సైతం రావడం ఆలస్యం అవుతోందని తప్పక మేనిఫెస్టో‌లో ఉన్నవని చేద్దామని చెప్పేవాడిని బాధితులు చెప్తున్నారు. దీంతో కొన్నాళ్ల తర్వాత రఘురాంను ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారని, దీంతో తాము మోసోయామని తెలుసుకున్నామని కమిటీ మెంబర్లు చెప్తున్నారు. దీంతో తాము ఊళ్ళో తిరగలేక పోతున్నామని వాపోతున్నారు. మరి కొందరు అయితే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. తమకు న్యాయం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.


బాధితుల ఫిర్యాదులు చేయడానికి రాగానే రఘురాం తన అసలు బుద్దిని బయట పెట్టాడు.. చంపుతామని బెదిరిస్తున్నారని, ఇళ్ళ మీదకు మనుషుల్ని పంపుతున్నాడనీ బాధితులు వాపోతున్నారు.  ఇక రఘురాం మాత్రం తాను చేసిన దాన్ని సమర్థించుకుంటున్నాడు. తనకి వారంతా విరాళం ఇచ్చారని, వారు ఇచ్చింది కాంట్రిబ్యూషన్ కాదని బుకాయిస్తున్నారు. ఎందుకు తన వ్యక్తిగత ఖాతాలోకి డబ్బు జమ అయిందని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తూ దాత వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం వెలుగులోకి వచ్చాక రఘురాం పరారయ్యారు. తనపై కొందరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు. ఇప్పటి వరకు రఘురాం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 50 కోట్లు వసూలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు. 


జనాలకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన రఘురాం గుడ్ షెపర్డ్ ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఏర్పాటు చేశాడు.  ఇందుకోసం ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకున్నాడు.. జనాలను మోసం చేసినట్టే ఆ బిల్డింగ్ ఓనర్ కూడా రఘురాం మోసం చేశాడు. గత సంవత్సరకాలంగా రఘురాం బిల్డింగ్ అద్దె చెల్లించట్లేదని ఓనర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె అడిగినా ప్రతిసారీ ఏవేవో కారణాలు చెప్తూ వస్తున్నాడని ఓనర్ అంటున్నారు. తాను ఒంటరి మహిళ అని.. తనని మోసం చేయొద్దని వేడుకుంటుంది.


మొత్తానికి రఘురాం బాధితులు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఏకరువు పెడుతున్నారు. న్యాయం చేయాలని సీసీఎస్ చుట్టూ తిరుగుతున్నారు.  కానీ రఘురాం మాత్రం తాను తప్పు చేయలేదని లీగల్‌గా ప్రొసీడ్ అవుతానంటున్నారు. మొత్తానికి రఘురాం వసూళ్లకు పాల్పడింది నిజమే అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడంతో రఘురాంపై FIR నమోదు చేశారు.  రఘురాం జనాలను నుండి కలెక్ట్ చేసిన సొమ్ము యాభై కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు ఏం చర్యలు తీసుకోనున్నారు.  మోసపోయిన వారికి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.

Updated Date - 2022-05-02T00:13:18+05:30 IST