ఏపీ బీజేపీ చర్యలపై కన్నీటి పర్యంతమైన గోపాల కృష్ణ

ABN , First Publish Date - 2020-08-10T22:26:36+05:30 IST

తాను పార్టీ లైన్‌లోనే మాట్లాడినప్పటికీ తనపై వేటు వేశారని, అమ్మలాంటి పార్టీకి దూరం చేశారని..

ఏపీ బీజేపీ చర్యలపై కన్నీటి పర్యంతమైన గోపాల కృష్ణ

విజయవాడ: తాను పార్టీ లైన్‌లోనే మాట్లాడినప్పటికీ తనపై వేటు వేశారని, అమ్మలాంటి పార్టీకి దూరం చేశారని బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. రైతులకిచ్చిన మాటమీద నిలబడకుండా.. రైతులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. బీజేపీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న తర్వాత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.


ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి రైతు మహిళలు గత 235 రోజులుగా పడుతున్న ఆవేదన గురించి, రాజకీయ కారణాలవల్ల అమరావతి నిర్మాణం మద్యలో ఆగిపోవడం..ఎందుకు ఆగిందన్న వాస్తవాన్ని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడని అన్నారు. దేశ ప్రధాని అమరావతికి వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని ఆగిపోవడం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులకు సమాధానం చెప్పకుండా.. చిన్నపాటి చర్యలవల్ల తనను కన్నతల్లిలాంటి పార్టీ నుంచి దూరం చేశారన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. మళ్లీ తనను పార్టీలోకి తీసుకుంటారని గోపాల కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.


పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్‌ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఈ మేరకు ఏపీ బీజేపీ ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సదరు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-10T22:26:36+05:30 IST