కోచ్‌లు, సహాయ సిబ్బందిని ఆదుకునేందుకు రన్‌ టు ది మూన్‌

ABN , First Publish Date - 2020-06-13T09:58:35+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వైరస్‌ విజృంభణతో అనేక టోర్నమెంట్లు రద్దవడంతో పాటు ...

కోచ్‌లు, సహాయ సిబ్బందిని ఆదుకునేందుకు రన్‌ టు ది మూన్‌

3,84,400 కి.మీ పూర్తి చేయడం రేసు ఉద్దేశం 

గోపీ, అశ్విని నిధుల సేకరణ  

ముంబై: కరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వైరస్‌ విజృంభణతో అనేక టోర్నమెంట్లు రద్దవడంతో పాటు మరికొన్ని వాయిదా పడ్డాయి. వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలో క్రీడాకారులతోపాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని క్రీడల్లో మళ్లీ ఈవెంట్లు మొదలవుతున్నా.. ఈ మూడు నెలల కాలంలో కోచ్‌లతో పాటు అనేక అకాడమీలు, స్పోర్ట్స్‌ ఫౌండేషన్స్‌ ఎలాంటి ఆదాయమూ లేక ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. వీళ్లను ఆదుకునేందుకు మాజీ క్రీడాకారులు ముందుకొచ్చారు. బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మాజీ అథ్లెట్లు, అర్జున అవార్డు గ్రహీతలు అశ్వినీ నాచప్ప, మాలతి హొల్ల.. ఐడీబీఐ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ సంస్థలతో కలిసి ‘రన్‌ టు ది మూన్‌’ పేరిట నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ‘లాక్‌డౌన్‌ వల్ల ఈ మూడు నెలల్లో దేశంలోని అనేక మంది కోచ్‌లు, అకాడమీలతో పాటు క్రీడా సిబ్బంది ఆర్ధికంగా చాలా నష్టపోయారు. వీళ్లను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే రన్‌ టు ది మూన్‌ కార్యక్రమాన్ని చేపట్టి వీటి ద్వారా వచ్చిన నిధులను వాళ్లకు అందజేస్తాం’ అని గోపీచంద్‌ తెలిపారు. 


ఏమిటీ ‘రన్‌ టు ది మూన్‌’?

మానవుడు చంద్రమండలంపైకి అడుగుపెట్టి వచ్చే నెల 21వ తేదీకి 51 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘రన్‌ టు ది మూన్‌’ నిర్వహిస్తున్నారు. 

భూమి నుంచి చంద్రునికి మధ్య దూరమైన 3,84,400 కిలో మీటర్లను కవర్‌ చేసేలా రేసును రూపొందించారు. 

ఈనెల 20 నుంచి వచ్చేనెల 20 వరకు ఈ రన్‌ రేసు ఉంటుంది. దేశవ్యాప్తంగా 10 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల వారు ఎవరైనా రేసులో పాల్గొనవచ్చు.

పోటీదారుడు రోజులో కనిష్ఠంగా 2.5 కిలో మీటర్లు లేదా గరిష్ఠంగా 10 కిలో మీటర్లు పూర్తి చేయవచ్చు. మొత్తంగా నెలలో 65 కి.మీ పూర్తి చేయాలి. 

పార్కులో లేదంటే వీధిలో ఇలా తమకిష్టమైన ఏ చోటు నుంచైనా  పరిగెత్తవచ్చు. పరిగెత్తిన దూరాన్ని నమోదు చేసేందుకు పోటీదారునికి ఓ లింక్‌ను షేర్‌ చేస్తారు. అందులో నమోదైన దూరాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 

రేసులో పోటీపడాల్సిన వారు ఈనెల 10 నుంచి 18 వరకు రూ. 100 సాధారణ ఫీజుతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం https://www.nebsports.in/run-to-the-moon/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Updated Date - 2020-06-13T09:58:35+05:30 IST